గెలిచిన సంకల్పం  ఓడిన వైకల్యం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన మద్దిరాల ముప్పాల గ్రామం అశోక్‌ది. రెండేళ్ల వయసుండగా కుడి కాలికి పోలియో సోకింది. కుటుంబానికి వ్యవసాయం కలిసిరాలేదు.అప్పుల పాలై ఉన్న ఊరు విడిచిపెట్టారు. ఇద్దరు పిల్లల్ని పోషించలేక అశోక్‌ తల్లిదండ్రులు అతడిని అమ్మమ్మ ఇంటికి పంపించారు. డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌కి వచ్చి పలు ఉద్యోగాలు చేశాడు అశోక్‌.....

Updated : 20 Apr 2019 06:01 IST

వైకల్యం జాలిని కోరుకోదు..
ఇక ఓటమిని ఎలా అంగీకరిస్తుంది?
అందుకు అశోక్‌ ప్రయాణమే సాక్ష్యం!
తన వైకల్యాన్ని అధిగమించి జీవితంలో ఎదిగేందుకు కష్టపడ్డాడు. కానీ అనుకున్న స్థాయికి ఎదగలేకపోయాడు. ప్రేమలో విఫలమయ్యాడు.
ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు..కానీ సభ్య సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నానా? అని ఒక్క క్షణం ఆలోచించాడు.
జీవితంలో ఏమీ సాధించకుండానే తనువు చాలిస్తే తన బతుక్కి విలువేముందని అనుకున్నాడు. తనేంటో ప్రపంచానికి చాటాలనుకున్నాడు. పదేళ్ల తర్వాత.. రూ.25 కోట్ల వార్షిక టర్నోవర్‌ ఉన్న కంపెనీకి అశోక్‌ బాబు పుచ్చకాయల యజమాని.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన మద్దిరాల ముప్పాల గ్రామం అశోక్‌ది. రెండేళ్ల వయసుండగా కుడి కాలికి పోలియో సోకింది. కుటుంబానికి వ్యవసాయం కలిసిరాలేదు.అప్పుల పాలై ఉన్న ఊరు విడిచిపెట్టారు. ఇద్దరు పిల్లల్ని పోషించలేక అశోక్‌ తల్లిదండ్రులు అతడిని అమ్మమ్మ ఇంటికి పంపించారు. డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌కి వచ్చి పలు ఉద్యోగాలు చేశాడు అశోక్‌. కానీ ఏదీ కలిసి రాలేదు. వరుసగా వైఫల్యాలు ఎదుర్కొన్నాడు. ఆ సమయంలోనే అతడికి ప్రేమలోనూ ఎదురు దెబ్బ తగిలింది. అశోక్‌ వికలాంగుడన్న కారణంతో అమ్మాయి తండ్రి ఒప్పుకోలేదు. ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో ఎదగలేకపోతున్నాన్న నైరాశ్యం, ప్రేమ వైఫల్యం.. ఇవన్నీ అశోక్‌ను కుంగదీశాయి. ఆత్మహత్య ఆలోచన వైపు పురిగొల్పాయి. కానీ ఇప్పుడిలా చనిపోతే సమాజానికి ఎలాంటి ఉదాహరణగా నిలుస్తానా? అని ఆలోచించి ఆగిపోయాడు.

ఉద్యోగి నుంచి.. సంస్థలకు యజమానిగా
ముద్రణ సంస్థలకు పరికరాలు సమకూర్చే సంస్థలో ఉద్యోగిగా చేరి కొన్నేళ్లు పని చేసిన అశోక్‌.. అది మూత పడ్డాక, అలాంటిదే ‘ఏబీపీ ఇమేజింగ్‌ టెక్నాలజీస్‌’ పేరుతో సొంత సంస్థ మొదలుపెట్టాడు. అప్పటికే అతడికి మౌనిక అనే అమ్మాయితో పెళ్లయింది. అశోక్‌ చిరుద్యోగిగా ఉన్నపుడే అతడిని పెళ్లాడిన మౌనిక.. భర్తకు పూర్తి అండగా నిలిచింది. ఆమె ప్రోత్సాహం, తన అనుభవంతో సంస్థను వృద్ధిలోకి తెచ్చాడు అశోక్‌. 2015లో మొదలైన ఈ సంస్థ నాలుగేళ్ల లోపే రూ.25 కోట్ల టర్నోవర్‌ సాధించే స్థితికి చేరుకుంది. ఈ సంస్థ ఆరంభానికి ముందే స్నేహితులతో కలిసి ‘జిరాఫ్‌ టెక్నాలజీస్‌’ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఆరంభించాడు. మరోవైపు ‘ఎంపవర్‌’ పేరుతో ఓ కన్సల్టెన్సీ సంస్థ మొదలుపెట్టాడు. ఇవి కూడా విజయవంతంగా నడుస్తున్నాయి. 150 మందికి అశోక్‌ ఉపాధి కల్పిస్తున్నాడు. వివిధ వ్యాపారాల్ని నడిపిస్తూ విజయవంతంగా నడిపిస్తున్న అశోక్‌.. తన సంస్థను నాలుగేళ్లలో వంద కోట్ల టర్నోవర్‌కు చేర్చడం లక్ష్యంగా పెట్టుకున్నాడు.

సేవా మార్గంలోనూ..
అశోక్‌ క్యాన్సర్‌ బాధితులకు సాయపడుతున్నాడు. హైదరాబాద్‌ గోషామహల్‌కు చెందిన క్యాన్సర్‌ బాధితుడు శ్రీనివాస్‌ సాయం కోరితే.. తనకు పరిచయం ఉన్న నాట్కో సంస్థ ఉపాధ్యక్షుడు సదాశివతో మాట్లాడి రూ.5 లక్షల విలువైన మందులు ఉచితంగా ఇప్పించాడు. ఇలా ఇప్పటిదాకా ఐదుగురు క్యాన్సర్‌ బాధితులకు ఖరీదైన క్యాన్సర్‌ మందులు ఉచితంగా ఇప్పించాడు. అశోక్‌కు పెళ్లిళ్లు చేయించడం హాబీ. తన సోదరికి పెళ్లి చేసే సమయంలో పడ్డ ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని మధ్యవర్తిత్వం వహిస్తూ ఇప్పటిదాకా 20కి పైగా పెళ్లిళ్లు చేయించాడు. తన సంస్థలోనే పని చేసే శ్రీకాంత్‌ అనే ఉద్యోగి సోదరికి రూ.4 లక్షలకు పైగా ఖర్చు పెట్టి తనే దగ్గరుండి వివాహం జరిపించాడు. హైదరాబాద్‌ అత్తాపూర్‌లోని ఓ గోశాల, స్వరూపానంద స్వామి సహకారంతో ఆంధ్రా ప్రాంతంలో గిరిజనులకు ఉచితంగా గోవుల్ని అందజేసే పనిలోనూ పాలుపంచుకుంటున్నాడు. అశోక్‌కు ఇద్దరు పిల్లలు (తన్వీర్‌, గీతిక) ఉన్నారు. ఒకప్పుడు తమ అమ్మాయిని కారైనా ఎక్కించగలడా అంటూ తనను అవమానించారని.. కానీ ఇప్పుడు తన భార్యాపిల్లల్ని ఏటా విమానాల్లో విదేశీ పర్యటనలకు తీసుకెళ్లే స్థితిలో ఉన్నానని గర్వంగా చెబుతున్నాడు అశోక్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని