ప్రేమిస్తూనే ఉంటా

మాది నిర్మల్‌ జిల్లా. నేను కలెక్టర్‌ కావాలన్నది మా నాన్న కోరిక. డిగ్రీ పూర్తవ్వగానే హైదరాబాద్‌కు వచ్చి పీజీలో చేరాను. పీజీ చేస్తూ సివిల్స్‌ కోచింగ్‌కు వెళ్లేవాడిని. అలా

Updated : 27 Apr 2019 04:07 IST

మాది నిర్మల్‌ జిల్లా. నేను కలెక్టర్‌ కావాలన్నది మా నాన్న కోరిక. డిగ్రీ పూర్తవ్వగానే హైదరాబాద్‌కు వచ్చి పీజీలో చేరాను. పీజీ చేస్తూ సివిల్స్‌ కోచింగ్‌కు వెళ్లేవాడిని. అలా అప్పుడప్పుడూ క్లాసులకు అటెండ్‌ అవుతూ పరీక్షలు రాసేవాడిని. సివిల్స్‌ కొట్టాలని దీక్షతో సాగుతున్న నాకు పీజీ సెకండియర్లో ఒకమ్మాయి పరిచయమైంది. తన పేరు బుజ్జి. ఎంతో సౌమ్యంగా మాట్లాడేది. మా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఈలోపు సెకండియర్‌ పరీక్షలు ముగిశాయి. నేను మా ఊరికి వెళ్లాను. తనూ వాళ్ల ఊరికి వెళ్లిపోయింది. అయినా ఫోన్లో టచ్‌లో ఉండేవాళ్లం. నా కష్టాలను, బాధలను తనతో పంచుకొనేవాడిని... తను అన్ని విషయాలూ నాతో చెప్పుకొనేది. అలా మా ఇద్దరి మధ్య చనువు పెరిగిపోయింది. కొన్నిరోజులకు మళ్లీ నేను హైదరాబాద్‌కు వచ్చాను. తను వచ్చి ఇక్కడే గర్ల్స్‌ హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నించేది. ఇద్దరి మధ్యా సఖ్యత పెరిగాక నేను ప్రపోజ్‌ చేశాను. ఓకే అంది. ఇంకేముంది నా ఆనందానికి హద్దుల్లేవు. ఇద్దరం కలిసి సినిమాలు, షికార్లు, పార్కులు తిరిగాం. ప్రపంచంలో మేమిద్దరమే ఉన్నామేమో అనిపించేది. అయితే ఎక్కడా నా చదువును నిర్లక్ష్యం చేయలేదు. అలా కొన్ని రోజులు తర్వాత ఉన్నట్లుండి తన ప్రవర్తనలో మార్పు వచ్చింది. నా కాల్స్‌కి స్పందించేది కాదు. మెసేజ్‌ చేస్తే రిప్లై లేదు. రెండు మూడు రోజులకు ఒకసారి కూడా సమాధానం ఇచ్చేది కాదు. ‘నేను తర్వాత మాట్లాడతాను’ అని చెప్పేది అంతే! అలా చాలా రోజులు గడిచిపోయాయి. తన నిర్లక్ష్యాన్ని నేను భరించలేకపోయాను. ఇంతలో తనకు ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం వచ్చిందని తెలిసింది. నేను అక్కడికి వెళ్లి తనతో మాట్లాడాను. ‘నన్ను ఎందుకు ఇంతగా డిస్ట్రబ్‌ చేస్తున్నావ్‌’ అంది. నా గుండె పగిలిపోయింది. ‘సారీ’ చెప్పాను. ‘నువ్వులేకుండా నేను బతకలేను. నన్ను పెళ్లిచేసుకో... తర్వాత నిన్ను డిస్ట్రబ్‌ చేయను. నువ్వు నెలకు ఒక్కసారి మాట్లాడినా చాలు’ అన్నాను. తను సరే అంది. 29.07.2018న సాయిబాబా గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఆ రోజు అలా ట్యాంకు బండ్‌పైకి వెళ్లి కూర్చొన్నాం. ఎందుకో నేను తన ఫోన్‌ తీసుకొని అలా చూస్తుంటే... తను మరో అబ్బాయితో చాటింగ్‌ చేస్తున్నట్లు తెలిసింది. ఎవరని అడిగితే.. బావ అంది. నేను అతని నంబర్‌ తీసుకొన్నా. తర్వాత ఎవరి రూంలకు వాళ్లు వెళ్లిపోయాం. బుజ్జి బావతో ఒక ఫ్రెండ్‌లా చాటింగ్‌ మొదలుపెట్టాను. దీంతో బుజ్జికి జాబ్‌ ఇప్పించింది తనే అని, ఇద్దరూ ఫార్మా కంపెనీలోనే పనిచేస్తున్నామని చెప్పాడు. మరోవైపు బుజ్జి నాతో మాట్లాడటం బాగా తగ్గించేసింది. రెండు నెలలైనా మాట్లాడిదికాదు. అర్ధరాత్రి ఫోన్‌ చేసినా తన ఫోన్‌ బిజీ వచ్చేది. నాతో మాట్లాడటానికి మాత్రం టైమ్‌ లేదని మెసేజ్‌ పెట్టేది. నేను వాళ్ల కంపెనీ దగ్గరికి వెళ్లి నిలదీశాను. నీలాంటి అనుమానం ఉన్నవాడిని చేసుకోవడం కంటే భిక్షగాన్ని చేసుకోవడం నయమంది. సరేలే ఏదో బాధతో మాట్లాడిందేమో అనుకున్నా. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా తీయలేదు. ఒకరోజు నేను వాళ్ల కంపెనీ దగ్గర భిక్షమెత్తుకున్నా. నన్ను చూసి పక్కకి వెళ్లిపోయింది తప్ప నాతో మాట్లాడలేదు. పైగా నేను వేధిస్తున్నానని పోలీసు కేసు పెట్టింది. నేను ఆత్మహత్యాయత్నం చేశా. స్నేహితులు కాపాడారు. ఇక ఇక్కడ పనికిరానని నన్ను నాన్న ఊరికి తీసుకెళ్లిపోయాడు. నా చదువు మొత్తం దెబ్బతింది. అలాగే పిచ్చోడిని అయిపోతానని నన్ను సౌదీకి పంపారు. అక్కడా ఉండలేకపోయాను. తాగుడుకు బానిసయ్యాను. తనకు ఎన్ని సార్లు కాల్‌ చేశానో నాకే తెలియదు. బుజ్జి నుంచి ఎలాంటి స్పందన లేదు. నేను తిరిగి మా ఊరికి వచ్చేశాను. తన జ్ఞాపకాలతో చావలేక... బతుకుతున్నా.
‘‘బుజ్జి ఒక్కటే గుర్తు పెట్టుకో... నువ్వు నన్ను మోసం చేసినా... వేధిస్తున్నానని కేసు పెట్టినా... నువ్వు నన్ను ప్రేమించావని, మనం పెళ్లిచేసుకున్నామని ఎవ్వరికీ చెప్పలేదు. ఎందుకంటే నేను ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నా. ప్రేమిస్తూనే ఉంటా.’’

- అజేయరాజ్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని