క్షమించలేని తప్పు చేశా!

మాది ఉన్నతమైన కుటుంబం. ఇంట్లో నేను చిన్నమ్మాయిని. నా పేరు స్వాతి(పేరు మార్చాం). గారాబం తోడవ్వడంతో ఆడింది ఆట.. పాడింది పాటయ్యింది. నాకున్న విద్యార్హతలతో ప్రొఫెసర్‌ కావాలనేది నా ఆశయం. ఇప్పటికే ఆ దిశగా చాలా మెట్లు ఎక్కేశాను. నా భర్త నేను చేసే సంస్థలోనే ఉద్యోగి...

Published : 11 May 2019 02:07 IST

మాది ఉన్నతమైన కుటుంబం. ఇంట్లో నేను చిన్నమ్మాయిని. నా పేరు స్వాతి(పేరు మార్చాం). గారాబం తోడవ్వడంతో ఆడింది ఆట.. పాడింది పాటయ్యింది. నాకున్న విద్యార్హతలతో ప్రొఫెసర్‌ కావాలనేది నా ఆశయం. ఇప్పటికే ఆ దిశగా చాలా మెట్లు ఎక్కేశాను. నా భర్త నేను చేసే సంస్థలోనే ఉద్యోగి. మా పెద్దబ్బాయి అయిదో తరగతి, చిన్నవాడు మూడో తరగతి చదువుతున్నాడు. అంతా బానే ఉంది కదా అనుకునేంతలోనే చిన్న మార్పు మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. నాకంటే చిన్నవాడైన సహోద్యోగితో (రంజిత్‌) ఏర్పడిన స్నేహం సాన్నిహిత్యంగా మారింది. అతడి మాటలు, చేతలు నాపై చూపే ప్రేమ నన్ను ఆకర్షితురాలిగా చేశాయి. నా వయసు, పిల్లలు, భర్త, అమ్మ, నాన్న ఎవరూ గుర్తు రాలేదు. పబ్బులు, క్లబ్బులు, లేట్‌నైట్‌ పార్టీలు... ఒక్కటేమిటీ క్రమక్రమంగా మొత్తం మారిపోయాను. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో భర్తతో చీటికి మాటికీ గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టా. భర్తపై పుట్టింటి వాళ్లకు ఉన్నవి లేనివి కల్పించి చెప్పా. రోజంతా ఆఫీసులో కష్టపడి వస్తాను.. పని మనిషిని కూడా పెట్టుకోనివ్వడు.. ఒక్కదాన్నే చేసుకోలేకపోతున్నా.. అంటూ అన్ని కల్పించి చెప్పా. నాన్నకు నాపై ఉన్న ప్రేమ నా మాటల్ని నమ్మేలా చేసింది. విడాకులు తీసుకుంటానని చెప్పేశాను. ఊరికి బయలుదేరాను. రంజిత్‌ నాతో పాటు వచ్చేశాడు. నన్ను దిగబెట్టడానికి వచ్చాడని చెప్పడంతో నమ్మేశారు. అక్కడ అందరితో సరదాగా, ఎలాంటి అనుమానం రాకుండా ఉన్నాం.
మళ్లీ దిల్లీ వెళ్లా. నా భర్త నుంచి విడాకులు కోరా. ఎంతో అపురూపంగా చూసుకునే భర్త, ఆఫీసు నుంచి ఇంటికి వస్తే ఆప్యాయంగా అల్లుకునే పిల్లలు ఎవరూ కంటికి కనిపించలేదు నాకు. ఆఫీసులో ఏం జరుగుతుందో, అతడి ఆలోచనలు ఏంటో నేను గుర్తించలేకపోయాను. తర్వాత నాకు తెలిసింది. చాటుమాటుగా ఇతర కొలీగ్స్‌తోనూ సరదాగా గడిపేవాడని తెలిసింది. కానీ నేను కళ్లతో చూడలేదని.. ఎవరేం చెప్పినా నమ్మలేదు. ఆఫీసు నుంచి ఇంటికి రావడంతోనే పిల్లలపై చిరాకు పడేదాన్ని, మా ఆయనపై అరిచేదాన్ని. అంతా గమనించిన నా భర్తకు విషయం తెలిసింది. ఎంతో నచ్చచెప్పాడు. పిల్లల భవిష్యత్తు పాడవుతుంది, నీ కెరీర్‌ దెబ్బ తింటుందని బతిమాలాడు. బెదిరించైనా నా నిర్ణయాన్ని మార్చాలనుకున్నాడు. తను విడాకులు ఇవ్వనన్నాడు. నువ్వు విడాకులు ఇవ్వకపోతే చస్తానని బెదిరించా. గత్యంతరంలేని పరిస్థితుల్లో ఒప్పుకొన్నాడు. పిల్లలకు ఏం అర్థమైందో ఏమో తెలియదు కానీ దూరంగా ఉండటం మొదలుపెట్టారు.
మాకున్న స్థిరచరాస్తులతో పాటు నేను, నా భర్త కష్టపడి సంపాదించిన ఆస్తిపై అతడికి కన్నుందని ఊహించలేకపోయాను. నాకులాగే మంచి జీతం నా నుంచి డబ్బెందుకు ఆశిస్తాడని అనుకున్నా. డబ్బులు వాడుకున్నాడు, సరదాలు తీర్చుకున్నాడు. నాకు విడాకులు వచ్చాక అతడి నిజస్వరూపం తెలిసింది. అతడి మాటల్లో చేతల్లో మార్పులు స్పష్టమయ్యాయి. అతడికి ఇంకో అమ్మాయితో పెళ్లి సెటిలయ్యిందని తెలిసింది. నిలదీశాను.. ఫలితం శూన్యం. ఏడ్చాను. కుంగిపోయాను. ఏకాకిగా మిగిలాను. ఎందుకు బతుకుతున్నానో తెలియదు. పిల్లల్ని ఒక్కసారి చూడాలని కోరిక తప్ప నాకు ఇంకేం ఆశల్లేవిప్పుడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని