గూగుల్‌ మెచ్చిన కుర్రాడు

ఓ కంపెనీ.. అంటే ఇంటర్నెట్‌ డేటా వాడకం ఎక్కువగా ఉంటుంది. మరి దీన్ని తగ్గించి, ఖర్చును అదుపు చేసే  మార్గాలున్నాయా? అనే ప్రశ్న వేసుకుంది ఏ కార్పొరేట్‌ కంపెనీనో కాదు...

Updated : 11 May 2019 05:58 IST

 గూగుల్‌ సమ్మర్‌ ఆఫ్‌ కోడ్‌ ఇంటర్న్‌షిప్‌నకు ఎంపిక

ఓ కంపెనీ.. అంటే ఇంటర్నెట్‌ డేటా వాడకం ఎక్కువగా ఉంటుంది. మరి దీన్ని తగ్గించి, ఖర్చును అదుపు చేసే  మార్గాలున్నాయా? అనే ప్రశ్న వేసుకుంది ఏ కార్పొరేట్‌ కంపెనీనో కాదు... ఓ విద్యార్థి. ఈ ప్రశ్నకు సమాధానం పరిశోధించాడు ఆ యువకుడు. ఫలితం సాధించాడు. దాంతో పాటు గూగుల్‌ అందించే రూ.2లక్షల ఉపకార వేతనానికి అర్హుడయ్యాడు. గూగుల్‌ ఇచ్చే మూడునెలల ప్రతిష్ఠాత్మక శిక్షణకు ఎంపికయ్యాడు ఏపీ నిట్‌లో చదువుతున్న కమ్మకోమటి మెహంత్‌.

గూగుల్‌ సంస్థలో ఉద్యోగం చేయటమే నా లక్ష్యం. ఇందుకోసం నిత్యం ప్రణాళికాబద్ధంగా చదివేవాడ్ని. ఆచార్యులు చెప్పే పాఠ్యాంశాలతోపాటు గ్రంథాలయంలో పుస్తకాలనూ ఉపయోగించుకున్నా. సెలవుల్లోనూ ఇందుకు తగిన విధంగా ప్రిపేర్‌ అయ్యేవాడిని. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నదే లక్ష్యం.  

- కమ్మకోమటి మెహంత్‌

చదువులో మెరిక
హైదరాబాద్‌కు చెందిన మేహంత్‌ ఏపీ నిట్‌లో సీఎస్‌ఈ విభాగంలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తున్నాడు. పదో తరగతిలో 97 శాతం మార్కులు, ఇంటర్‌లో 970 మార్కులు సాధించాడు. ఏపీ నిట్‌ మొదటి సెమిస్టర్‌ ఫలితాల్లో 8.83 జీపీఏ తెచ్చుకున్నాడు.
ఎలా ఎంపికయ్యాడంటే..
గూగుల్‌ సంస్థ సమ్మర్‌ ఆఫ్‌ కోడ్‌ ఇంటర్న్‌షిప్‌ నిర్వహిస్తోందని తెలుసుకున్న మెహంత్‌ గత నెలలో తన బసా ప్రాజెక్టును ఆన్‌లైన్‌లో సంస్థ నిర్వాహకులకు సమర్పించాడు. దీని ద్వారా వ్యాపారులు, కంపెనీదారులు ఎవరైనా అంతర్జాలంలోని డేటాను (ఫైల్స్‌ను) ఒక్కసారే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆ డేటా అంతా లోకల్‌ సర్వర్‌లో ఉంటుంది. దాన్ని కంపెనీలోని మిగిలిన వారికి షేర్‌ చేయటం వల్ల అంతర్జాలంలో తక్కువ డేటా ఖర్చు అవుతుందని, దీనిపై ఇంటర్న్‌షిప్‌ చేసి ప్రాజెక్టును రూపొందిస్తానంటూ గూగుల్‌ కంపెనీ నిర్వాహకులను మెహంత్‌ మెప్పించాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులు పేరెన్నికగన్న సంస్థల నుంచి ఇంటర్న్‌షిప్‌నకు పోటీపడగా 1,276 మంది తుదిగా ఎంపికయ్యారు. వారిలో మేహంత్‌ ఒకరు. మూడు నెలల ఇంటర్న్‌షిప్‌ కాలానికి ఉపకార వేతనంగా మూడు వేల అమెరికన్‌ డాలర్ల (రూ.2 లక్షలు)ను సంస్థ అందజేయనుంది. 2017లోనూ గూగుల్‌ ఫోర్డ్‌ఇన్‌ ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తే తుదిగా ఎంపికైన 50 మందిలో ఇతను ఒకడు. శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లి అక్కడ నాలుగురోజులు ఉండి గూగుల్‌ సంస్థను పరిశీలించే అవకాశం ఉపయోగించుకున్నాడు.
ఇంటర్న్‌షిప్‌ ఇలా..
ఈ కొత్త ప్రాజెక్టు రూపకల్పనకు అవసరమైన సూచనలు, సలహాలు అందించేందుకు గూగుల్‌ సంస్థ ఇద్దరు అడ్మిన్‌లను నియమించింది. ఇందులో ఒకరు భారతీయుడు కాగా, మరొకరు శ్రీలంకవాసి. వీరిద్దరూ వారానికి 35 గంటలపాటు మెహంత్‌కు ఆన్‌లైన్‌లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. మే 27 నుంచి ఆగస్టు 19 వరకు ఉండే ఇంటర్న్‌షిప్‌ కాలవ్యవధిలో బిజినెస్‌ అప్లికేషన్లపై డాకర్‌, కూబర్‌నేటీస్‌ వంటి ఆధునిక సాఫ్ట్‌వేర్లను ఉపయోగించి ప్రాజెక్టును రూపొందించి సంస్థ నిర్వాహకులకు అందజేయాల్సి ఉంటుంది.

- పొట్టి శ్రీనివాసరావు

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని