అన్నదాత ఆనందమే ‘నా పంట’

చదివింది ఎంబీఏ మార్కెటింగ్‌. చేసింది బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగం. కెరీర్‌ ఏమో వ్యవ‘సాయం’. అదేలా అంటే... దాని వెనుక ఒక కన్నీటి కథ ఉంది. పెద్ద పరిశోధన ఉంది. తపన ఉంది. రైతుకు ఎదురయ్యే ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపే తెగువ ఉంది. ఆ తెగువ అతనితో ఓ యాప్‌ రూపొందించేలా చేసింది.

Published : 18 May 2019 00:24 IST

దివింది ఎంబీఏ మార్కెటింగ్‌. చేసింది బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగం. కెరీర్‌ ఏమో వ్యవ‘సాయం’. అదేలా అంటే... దాని వెనుక ఒక కన్నీటి కథ ఉంది. పెద్ద పరిశోధన ఉంది. తపన ఉంది. రైతుకు ఎదురయ్యే ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపే తెగువ ఉంది. ఆ తెగువ అతనితో ఓ యాప్‌ రూపొందించేలా చేసింది. దాని పేరు ‘నా పంట’. ఈ డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌తో కర్షకులకు సమగ్రమైన సమాచారం ఇస్తున్నాడీ యువకుడు. వరంగల్‌ జిల్లా న్యూ శాయంపేట గ్రామానికి చెందిన నవీన్‌కుమార్‌ అన్నదాత ఆనందమే తన సంతోషంగా ‘నా పంట’ స్టార్టప్‌ ప్రారంభించి విజయం సాధించాడు.
నవీన్‌ బ్యాంకింగ్‌ విభాగంలో ఉద్యోగం చేసే సమయంలో.. ఓ రోజు పక్క ఊరికి పనిమీద బయలుదేరాడు. రోడ్డుకు అవతల గుంపు కనిపించింది. అక్కడికెళ్లి చూస్తే పత్తిరైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయిన రైతును  చూసి చలించిపోయాడు నవీన్‌. అన్నదాత చావు అతన్ని వెంటాడింది. ప్రశ్నించింది. ఈ బలవన్మరణాలకు అంతం లేదా? అనిపించింది. ఎందుకు ఇలా కర్షకులు ప్రాణాలు విడుస్తున్నారో తెలుసుకోవాలనే తపనను రేపింది. వివరాలు తెలుసుకున్నాడు. శాస్త్రవేత్తలతో మాట్లాడాడు. కర్షకులను కలిశాడు. అసలు నకిలీ విత్తనాలేంటీ? రైతుల సమస్యలేంటీ? అనే ప్రశ్నలతో నాలుగు నెలలు పొలాల వెంట తిరిగాడు. చాలామందికి విత్తనాల ఎంపిక ఎలా? పురుగుమందులు ఎలా వాడాలి? పంట బీమా తీసుకోవటమెలా? లాంటి కీలకమైన విషయాలు తెలియదని అర్థం చేసుకున్నాడు. సరైన సమాచారం తెలీక అన్నదాతలు పంట పండించే క్రమంలో అధిక శాతం సమయం వృథా చేసుకుంటున్నారని తెలుసుకున్నాడు.
యాప్‌కి ‘సాయం’
‘ప్రభుత్వాలు ఇప్పటివరకూ లక్షలకోట్లు ఇచ్చినా వ్యవసాయం బాగుపడలేదు. మీ సమయాన్ని వృథా చేసుకోవద్దు’ అన్నారంతా. అయినా తన ప్రయత్నాలు ఆపలేదు. సరిగ్గా ఆ సమయంలో.. సీనియర్‌ సైంటిస్ట్‌ రంగారావు ఇచ్చిన సమాచారంతో పాటు భరోసా ఇచ్చారు. పరిశోధనలో భాగంగా వివిధ గ్రామాల్లో తిరిగిన తనకు ఒకరోజు వరి రైతునుంచి కాల్‌ వచ్చింది. ‘మా పంటకి పురుగుపట్టింది. సలహా ఇవ్వమ’ని అడిగారు. నవీన్‌ గూగుల్‌లో సమాచారం కోసం వెతికాడు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, ఇక్రిశాట్‌, ఐకార్‌ సంస్థలు.. వ్యవసాయ యూనివర్సిటీల వెబ్‌పేజీల్లో టన్నుల కొద్దీ వ్యవసాయానికి సంబంధించిన సమాచారం ఉంది. మరి కర్షకులకు ఈ సమాచారాన్ని అందజేయాలంటే ఏంచేయాలని ఆలోచించాడు. ఓ అగ్రికల్చర్‌ వెబ్‌పోర్టల్‌ రూపొందించాడు. దాన్ని రైతు దగ్గరికి తీసుకెళ్లి చూపించాడు. ‘రైతులు ఎక్కడైనా ల్యాప్‌ట్యాప్‌లు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారా? అసలు మీరు చదువుకున్నారు కానీ బుర్రలుండవు’ అని కొట్టిపారేశారు ఆ రైతు. తర్వాత మొబైల్‌ యాప్‌ చేసి ఓ అన్నదాతకు చూపించాడు. ‘బావుంది.. అయితే రైతులు ఫోన్లు వాడటం తక్కువ. ఇంటర్నెట్‌ ఉంటేనే సమాచారం వస్తుంది అంటున్నావు. మరి ఇది మాకు ఎలా ఉపయోగపడుతుంది?’ అని పెదవి విరిచారు.

అలా అప్‌డేట్‌
నవీన్‌ ఈ యాప్‌ను 2017లో ప్రారంభించాడు. నాలుగునెలల్లో 50వేల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇంటర్నెట్‌ తక్కువ ధరకే దొరకటంతో యాప్‌ చూడటం రైతులకు సులువైంది. తర్వాత యాప్‌ అప్‌డేట్‌ కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డారు. దాదాపు 30 వర్షెన్లు మార్చారు. వ్యవసాయరంగానికి సంబంధించిన ఆరుమంది నిపుణులు యాప్‌కి పునాదులుగా నిలిచారు. యాప్‌లో రైతుల ప్రశ్నలకు శాస్త్రవేత్తలు, నిపుణులు, ఉత్తమరైతులు, సేవచేయాలనే తలంపు ఉండేవాళ్లు సమాధానాలిచ్చేలా ఓ వ్యవస్థ ఏర్పాటు చేశారు. దీంతో ‘నాపంట’కి సన్నకారు రైతులు కనెక్టయ్యారు. ఫోన్లు చేసి మరీ సమాచారం తెలుసుకుంటున్నారు. నా పంట యాప్‌ను ఆండ్రాయిడ్‌లో ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇది తెలుగు, ఇంగ్లీషు భాషల్లో లభిస్తుంది. ఇప్పటివరకూ డౌన్‌లోడ్‌ల సంఖ్య 1,37,514. ప్రస్తుతం ‘నాపంట’ యాప్‌ డౌన్‌లోడ్‌కి 5.5 ఎంబీ మెమొరీ అవసరం. సమాచారం అంతా పొందాలన్నా 70 ఎంబీ సరిపోతుంది.
యాప్‌తో ఉపయోగాలివే!
ఈ యాప్‌లో పంట జమ ఖర్చులు రాసుకోవచ్చు.సలహాలు, చర్చావేదిక, సబ్సిడీ రుణ సమాచారం, మార్కెట్‌ ధరలు, వ్యవసాయ వార్తలు, వాతావరణం, పంటబీమా, డీలర్ల సమాచారం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ, మట్టి సారం పరీక్ష నమూనాతో పాటు అగ్రి ఇ కామర్స్‌ (ఆన్‌లైన్‌లో పంటను అమ్ముకోవచ్చు, కొనొచ్చు) ఉంటాయి. రైతు పొలానికి దగ్గర్లోని వ్యవసాయ పరికరాలను సైతం ఈ యాప్‌ ఉపయోగించి బాడుగకు తీసుకోవచ్చు. 120 రకాల పంటల పెస్ట్‌మేనేజ్‌మెంట్‌ సమాచారం ఉంది. రైతు తన పొలాన్ని జియోట్యాగింగ్‌ చేసుకుని భూసారం, అక్కడి వాతావరణ పరిస్థితుల్ని ఎక్కడి నుంచైనా ఫోన్‌లో చూసుకోవచ్చు. పంటవ్యాధుల్ని అరికట్టడానికి జీవామృతాలు, కషాయాలు ఎలా చేయాలి? ఏ పంటకు ఎలా వాడాలి? లాంటి విషయాలు తెలుసుకోవచ్చు. ఈ యాప్‌లో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అందించే వ్యవసాయ బులెటిన్లు అప్‌డేట్‌ అవుతుంటాయి. పంటలో ఏదైనా వ్యాధి కనబడితే.. ఆకుల్ని ఫొటో తీసి పంపితే చాలు.. ఆ వ్యాధి ఏంటీ? ఎలా నివారించాలనే విషయంపై నిపుణులు సమాధానమిస్తారు.

 

అదే నా కల..

నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడే మా నాన్న చనిపోయారు. అమ్మ గృహిణి. నాకో తమ్ముడు, చెల్లి. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎంబీఏ చదివే రోజుల్లో దాదాపు ఎనిమిదినెళ్లు రోజుకోపూటే భోజనం చేశా. ఇంగ్లీషు మాట్లాడలేక పోవటం వల్ల ఉద్యోగాలు రాలేదు. అయితే ఏదైనా సాధిస్తాననే నమ్మకమే నన్ను నడిపించింది. పంట సబ్సిడీ, బీమా అందుకోవటం రైతు హక్కు. సమాచారం, అవగాహనాలేమితో ఇబ్బందుల పాలవుతోన్న వారికి సాయం చేయటం ఓ గొప్పవరంగా భావిస్తున్నా. అనంతపురం నుంచి ఓ పోలీస్‌ ఫోన్‌ చేసి యాప్‌తో మంచి సేవలందిస్తున్నావ్‌ అని అభినందించారు. ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వం నా సేవలను మరాఠీ భాషలో అందించాలని కోరింది. ఇదో గొప్ప ప్రోత్సాహంగా భావిస్తున్నా. దేశమంతా ‘నాపంట’ యాప్‌ వాడాలన్నదే నా కల.’

 
 
- నవీన్‌

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని