హైటెక్‌ కర్షకులు

లక్షల్లో జీతం.. దుస్తుల మడత నలగని పని. అయినా మట్టిపై మమకారంతో పొలం బాట పట్టారు. తొలి ప్రయత్నంలోనే లాభాల పంట పండించి, సేద్యంతోనూ చేవ చూపించవచ్చు అని నిరూపించారు. ఆ యువ రైతుల విజయగాథ ఇది.

Published : 09 Oct 2021 01:23 IST

లక్షల్లో జీతం.. దుస్తుల మడత నలగని పని. అయినా మట్టిపై మమకారంతో పొలం బాట పట్టారు. తొలి ప్రయత్నంలోనే లాభాల పంట పండించి, సేద్యంతోనూ చేవ చూపించవచ్చు అని నిరూపించారు. ఆ యువ రైతుల విజయగాథ ఇది.

వ్యవసాయం అంటే చాలామందికి చిన్నచూపు. డిగ్రీ పట్టా అందుకున్న చేతులతో మట్టి పిసకాలా అనుకుంటారు. కానీ ఇందులోనూ లాభాలు విరగకాస్తాయని నిరూపించారు కొందరు యువకులు. సొంతపనిలో ఉన్నంత సంతృప్తి ఎందులోనూ దొరకదంటున్నారు ఆ హైటెక్‌ రైతులు.


విమానం వదిలి మట్టిబాట

ఒకరిది ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌, ఇంకొకరిది స్పేస్‌ ఆస్ట్రోనాటికల్‌ చదువు. విమానాల్లో తిరిగే కొలువులు వరించాయి. అంతరిక్ష పరిశోధనల్లో భాగస్వాములయ్యే అవకాశమొచ్చింది. అవి వదిలి పొలం బాట పట్టారు. విదేశాల్లో చదువుకున్నా, కనీస సౌకర్యాలు లేని గిరిజన పల్లెలో సాగుకు శ్రీకారం చుట్టారు. తొలి ప్రయత్నంతోనే వినూత్న పంట పండించి, లాభాలు ఆర్జిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు గిరిజన యువకులు వేణుగోపాల్‌, కిరణ్‌లు.

విశాఖ జిల్లాలోని పెదవలస కుర్రాడు కంకిపాటి వేణుగోపాల్‌. ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. అన్నవరం అబ్బాయి కిరణ్‌ ఇటలీలోని రోమ్లో పబ్లిక్‌ విశ్వవిద్యాలయంలో స్పేస్‌ అస్ట్రోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చదివాడు. ఇద్దరికీ ప్రాంగణ నియామకాల్లో విదేశీ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలొచ్చాయి. రూ.లక్షల్లో వేతనం, విమానాల్లో తిరిగే అవకాశం. అది కాదనుకుంటే అంతరిక్ష పరిశోధన కేంద్రాల్లోనూ కొలువులు సిద్ధంగా ఉన్నాయి. వాటిని కాదనుకొని మన్యానికి తిరిగొచ్చారు. సేద్యానికి సిద్ధమయ్యారు.

ఉపకారవేతనంతో..: వ్యవసాయం మొదలు పెట్టేముందే గూగుల్‌లో గాలించారు. ఉద్యాన పంటలపై యూట్యూబ్‌లో విశేషంగా పరిశోధించారు. వియత్నాం, థాయ్‌లాండ్‌లో మాత్రమే పండే డ్రాగన్‌ ఫ్రూట్‌ ఇక్కడి వాతావరణానికి అనుకూలంగా ఉందని గమనించారు. పోషకాలు పుష్కలంగా ఉంటూ, గిరాకీ విపరీతంగా ఉండే ఆ విదేశీ పంటను సాగు చేయాలనుకున్నారు. కానీ విత్తనాలు, సాగు పరికరాలకే రూ.1.20 లక్షలు ఖర్చవుతాయని తేలింది. వేణుగోపాల్‌, కిరణ్‌ల ఆసక్తి గమనించి హైదరాబాద్‌లోని దక్కన్‌ ఎక్సోటిక్స్‌ ఛైర్మన్‌ డా.శ్రీనివాసరావు వాటిని రూ. 40 వేలకే అందించారు. ఆ డబ్బులు కూడా కిరణ్‌ చదువుకున్నప్పుడు ఉపకారవేతనంగా వచ్చినవే.

2018 జూన్‌లో పెదవలసలో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు ప్రారంభించారు. మిగతా వారికంటే భిన్నంగా ఒక సిమెంటు స్తంభానికి నాలుగు వైపులా, నాలుగు మొక్కలు అతుక్కునేలా వినూత్నంగా ఆధునిక పద్ధతులు పాటించారు. సేంద్రియ ఎరువులే వాడారు. ఏడాదిలో తొలి పంట చేతికొచ్చింది. ఆ ఉత్సాహంతో ఎకరం భూమిలో 400కుపైగా స్తంభాలు వేసి 1600 మొక్కలు నాటారు. ఉద్యానవనశాఖ ప్రోత్సాహం తోడైంది. పంట విరగకాసింది. విశాఖకు చెందిన వ్యాపారి పండ్లను వీరి నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో పండు మార్కెట్‌లో రూ. 70 నుంచి రూ.100 వరకు ధర పలుకుతోంది.

- సురకత్తి లక్ష్మణ్‌బాబు, గూడెంకొత్తవీధి


సాఫ్ట్‌వేర్‌ సాగుదారు

ఇంటి నుంచే అమెరికా ప్రాజెక్టులు. లక్షల్లో సంపాదన. అయినా సాగుపై మమకారంతో ఖాళీ సమయాన్ని వినియోగించుకోవాలని సాగు మొదలుపెట్టాడు చిత్తూరు జిల్లా పీలేరు యువకుడు బారేషా వలీ.

వ్యవసాయం నుంచి వచ్చే సంపాదనతో సాయం బాట పట్టి పలువురిని ఆదుకుంటున్నాడు.

వలీ ఎంటెక్‌ చదివాడు. 2016 వరకూ ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగం చేశాడు. తర్వాత తనే సొంతంగా చిన్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ప్రారంభించాడు. తను రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తో మరో పదిమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. నెలకు దాదాపు రూ.3లక్షలు ఆదాయం వస్తోంది. హాయిగా ఏసీ గదుల్లో కూర్చొని, నగరాల్లో ఉంటూ పని చేసుకోవచ్చు. కానీ మట్టిపై ఉన్న మమకారంతో పొలం బాట పట్టాడు. పైగా ఇంటి నుంచే పని కావడంతో ఖాళీ సమయం దొరుకుతోంది. పీలేరు, పెద్దమల్లెల మార్గంలో పదెకరాల్లో సేద్యం మొదలుపెట్టాడు. పొలం చదును, మొక్కల పెంపకం, బోరు బావి తవ్వకం, డ్రిప్‌, కంచె ఏర్పాటు అన్నింటికీ కలిపి రూ.10 లక్షల వరకు ఖర్చు చేశాడు. అల్లనేరేడు, మామిడి, మహాగని మొక్కలు పెంచుతూ మధ్యలో అంతర పంటలు సాగు చేస్తున్నాడు. డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతితో వీటిని సాగు చేస్తున్నాడు. అన్నింటికీ మించి వ్యవసాయం ద్వారా తనకొచ్చే ఆదాయంలో కొంతమొత్తం సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నాడు వలీ. ఫీజులు కట్టలేని నిరుపేద విద్యార్థులను ఆదుకుంటానని చెబుతున్నాడు. కరోనా సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, అత్యవసరాలు అందించాడు. ‘మనసు పెట్టి చేస్తే, ఆధునిక పద్ధతులు పాటిస్తే సేద్యమూ లాభసాటిగానే ఉంటుంది. వ్యవసాయంపై ఉన్న చిన్నచూపుని యువత విడనాడాలి’ అంటున్నాడు వలీ.

-  మల్లేపల్లి సురేంద్ర, పీలేరు గ్రామీణం


యువతకి లాభాలెన్నో..

* మనకు మనమే బాస్‌. ఎవరి కిందా పని చేయాల్సిన అవసరం లేదు.

* సొంత పని కావడంతో మనసు పెట్టి, పూర్తి అంకితభావంతో చేయొచ్చు.

* ప్రయోగాలు చేయడానికి, ఆధునిక పద్ధతులు పాటించడానికి అవకాశాలుంటాయి.

* వినూత్న పంటల సాగుకి ఉద్యానశాఖ పెద్దఎత్తున రాయితీలిస్తోంది. అధికారులు ప్రోత్సహిస్తారు.

* కష్టపడి పని చేసిన తర్వాత ఫలితం చేతికందితే కలిగే సంతృప్తి మాటల్లో వర్ణించలేం.

* ఎంత పెద్ద ఉద్యోగమైనా జీతానికి పరిమితి ఉంటుంది. సాగుకు అదేమీలేదు.


పంటపొలంలో పరిశోధకుడు

నెలకి లక్షన్నర జీతం. మంచి హోదా. కానీ వ్యవసాయంలో రైతులు మితిమీరిన రసాయనాల వాడకం చూసిన వెంకటఅప్పాజీని ఉద్యోగం వదిలాడు. గోఆధారిత సేంద్రియ వ్యవసాయం మొదలు పెట్టాడు.

అప్పాజీది తూర్పుగోదావరి జిల్లా రావికంపాడు. రైతు కుటుంబం. ఆంధ్రా యూనివర్సిటీలో కెమికల్‌ ఇంజినీరింగ్‌, గువాహటి-ఐఐటీలో ఎంటెక్‌ పూర్తి చేశాడు. తర్వాత ముంబయి డీఆర్‌డీవోలో మూడేళ్లు, ఫరీదాబాద్‌లో రెండేళ్లు శాస్త్రవేత్తగా పనిచేశాడు. లక్షల జీతం వస్తున్నా సంతృప్తి లేదు. ‘విజయం అంటే డబ్బు, పేరు సంపాదించడం కాదు.. పర్యావరణానికి హాని కలగకుండా అన్ని జీవులతో కలిసి బతకగలగడం’ అన్న సుభాష్‌ పాలేకర్‌ మాటలు అతడిలో ఆలోచనలు రేకెత్తించాయి. మరోవైపు వ్యవసాయంలో రసాయనాల వాడకం విపరీతంగా పెరిగిపోవడం బాధ కలిగించింది. ఉద్యోగం మానేసి సేంద్రియ వ్యవసాయం మొదలు పెట్టాలనుకున్నాడు. ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. అయినా తను వెనకడుగేయలేదు.

2016లో సాగు బాట పట్టాడు. 14 ఎకరాల్లో పర్యావరణహిత, గోఆధారిత ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టాడు. పాలేకర్‌ పుస్తకాలు, వీడియోలతోనే పరిజ్ఞానం పెంచుకున్నాడు. ఈ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న వారిని కలిసి మెలకువలు తెలుసుకున్నాడు. గోమూత్రం, పేడ, పాలు, పెరుగుతో పాటు సహజసిద్ధంగా లభించే వస్తువులు, ఆకులతో చేసే కషాయాలే పంటలకు ఎరువులుగా వినియోగిస్తూ వరి, పెసర, మినుము, మామిడి, కొబ్బరి పండిస్తున్నాడు. ఇలా చేయడం వల్ల జీవ వైవిధ్యం పదిలంగా ఉంటూ, పంటకు మేలు చేసే మిత్ర కీటకాలు పెరుగుతాయంటాడు అప్పాజీ. ఈ ఆహారం తీసుకోవడం వల్ల షుగర్‌, బీపీ, ఊబకాయం, థైరాయిడ్‌, క్యాన్సర్‌.. దరిచేరవంటాడు. దీంతోపాటు సొంతంగా మార్కెటింగ్‌ చేస్తున్నాడు.

- ఎ.మోహిత్‌ నాగప్రసాద్‌, రాజమహేంద్రవరం



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు