మాటతో మాయ చేస్తోంది!

‘ఏ..కా..డా..’ అంటూ సరదాగా ఆట పట్టించిన అమ్మాయి... ‘ఒరేయ్‌ కిక్కూ.. నచ్చావురా’ అంటూ కవ్వించిన సొగసరి... ‘దెయ్యంతో కాంట్రాక్టా’ అంటూ ఒంట్లో వణుకు పుట్టించిన క్యారెక్టర్‌... సినిమా ఏదైనా.. ఆ పాత్రలో దూరి...

Updated : 24 Oct 2021 01:56 IST

‘ఏ..కా..డా..’ అంటూ సరదాగా ఆట పట్టించిన అమ్మాయి... ‘ఒరేయ్‌ కిక్కూ.. నచ్చావురా’ అంటూ కవ్వించిన సొగసరి... ‘దెయ్యంతో కాంట్రాక్టా’ అంటూ ఒంట్లో వణుకు పుట్టించిన క్యారెక్టర్‌... సినిమా ఏదైనా.. ఆ పాత్రలో దూరి మాటతో కనికట్టు చేస్తున్న గళాకారిణి హరిత రావూరి. మొన్నటి శ్వేతాబసు నుంచి నేటి రకుల్‌ప్రీత్‌ దాకా హీరోయిన్‌ ఎవరైనా ఆమె గొంతులో ఒదగాల్సిందే! తాజాగా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’లో పూజాహెగ్డేకి స్వరం అరువిచ్చి.. ముద్దుముద్దుమాటలతో కుర్రాళ్లని మాయచేసిన ఈ తెలుగమ్మాయి ఈతరంతో మాట కలిపింది.

సినిమా తారలకి బోలెడు క్రేజ్‌. వాళ్లని తెరవేల్పులను చేయడంలో తెర వెనకుండే డబ్బింగ్‌ కళాకారుల పాత్ర తక్కువేం కాదు. అలాంటివారిలో ముందుంది హరిత.

గళంగేట్రం

హరిత పిన్ని డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌. ఆమె వెంట తను తరచూ స్టూడియోలకు వెళ్లేది. సరదాగా చిన్నచిన్న పాత్రలకు డబ్బింగ్‌ చెప్పేది. ఆ రకంగా ఈ రంగంతో పరిచయం ఏర్పడింది. బీకామ్‌లో ఉన్నప్పుడు కొత్త బంగారులోకం కోసం వాయిస్‌ టెస్ట్‌ జరుగుతోందని ఎవరో చెబితే వెళ్లింది. ఎంపికైంది. అందులో అందర్నీ ఆటపట్టించేలా శ్వేతాబసు ఏ.. కా.. డా అంటూ సాగదీస్తూ చెప్పే డైలాగ్‌ ఎంతో పాపులరైంది. తొలి సినిమానే హిట్‌ కావడంతో తనకు అవకాశాలు వరుస కట్టాయి. అప్పట్నుంచి టాప్‌ హీరోయిన్లందరికీ గొంతు కలుపుతూనే ఉంది. నవరసాలు, అన్ని భావోద్వేగాలూ అలవోకగా పలికిస్తుండటంతో కొద్దిసమయంలోనే ఉన్నత స్థానానికి చేరింది. నచ్చావులే, జెర్సీ, మహర్షి సినిమాలకు అవార్డులూ అందుకుంది.

తేలికేం కాదు

తెర వెనక ఉండి, కథానాయికల పెదాల కదలికలకు అనుగుణంగా డైలాగులు చెప్పడం అంత తేలికేం కాదంటోంది హరిత. రెగ్యులర్‌ నటులకు డబ్బింగ్‌ చెప్పడం తేలికే అయినా.. కొత్తవాళ్లకి, కొన్ని సందర్భాల్లో పాత్ర శైలికి అనుగుణంగా స్వరం మార్చి మాట్లాడటం, భావోద్వేగాలు పలికించడం కత్తిమీద సామే. జెంటిల్‌మేన్‌, జెర్సీ, నచ్చావులే సినిమాలకు డబ్బింగ్‌ చెప్పడం కష్టమైందనీ, ఆ పాత్రలే మంచి పేరు తెచ్చాయంటోంది. జెర్సీలో హీరోయిన్‌కి ముందు ఎవరితోనో డబ్బింగ్‌ చెప్పించారు. తర్వాత హీరో నానీకి అది నచ్చక హరితని రికమెండ్‌ చేశాడు. అలాగే బాపు చిత్రం శ్రీరామరాజ్యంలో లవుడికి వాయిస్‌ ఇవ్వడం మర్చిపోలేని అనుభవం అంటోందీమె. జాన్వీకపూర్‌ కోసం గుంజన్‌ సక్సేనాలోనూ గళం ఇచ్చింది.

తలైవితో టాప్‌కి

హరితకి ఈమధ్యకాలంలో బాగా పేరు తెచ్చిన సినిమా తలైవి. బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌కి ఇందులో తమిళం, తెలుగులో డబ్బింగ్‌ చెప్పింది. దీనికోసం ముందు చాలామందిని వాకబు చేశారు. డెబ్భై మందితో వాయిస్‌ టెస్ట్‌ చేయించారు. అదేసమయంలో ధనుష్‌ సినిమా ‘జగమే తందిరం’లో తెలుగు వెర్షన్‌ హీరోయిన్‌కు డబ్బింగ్‌ చెప్పింది హరిత. ఆ చిత్రానికి విజయ్‌ రచయితగా పని చేశాడు. తలైవికి అతడే దర్శకుడు కావడంతో పాత పరిచయంతో ఆ అవకాశం వరించింది. ఈ సినిమా కోసం చాలానే కష్టపడింది. జయలలిత గొంతులో ఒకరకమైన మృదుత్వం, గాంభీర్యం ఉంటుంది. దాన్ని అందిపుచ్చుకోవడం కోసం ఆమె ఇంటర్వ్యూలు, రాజకీయ ప్రసంగాలు ఎక్కువగా చూసింది.


‘కొన్ని చిత్రాలకు ఒక్కరోజులోనే డబ్బింగ్‌ చెప్పేస్తా. మరికొన్నింటికి వారం పడుతుంది. కొత్త కథానాయికలకు చెప్పాల్సి వస్తే ముందు వారి గొంతు వింటా. ముఖకవళికలు గమనిస్తా. తర్వాత వారిని అనుకరించడానికి ప్రయత్నిస్తా. దాంతోపాటు దర్శకుడు చెప్పే స్టైయిల్‌నీ అందిపుచ్చుకోవాలి. ఇలియానా, తమన్నా, శృతిహాసన్‌, రకుల్‌, పూజాహెగ్డే.. వీళ్లందరికీ నేనే డబ్బింగ్‌ చెబుతున్నా.. ఒక్కొక్కరికీ ఒక్కోలా గొంతు మార్చి చెబుతుంటా. పాత్రకు అనుగుణంగా ఒక్కోసారి గట్టిగా అరవాల్సి ఉంటుంది. ఎక్కువసార్లు అలా చేసినప్పుడు గొంతు జీరగా మారుతుంది. అలా కాకుండా కొన్ని కిటుకులు పాటిస్తా. డైలాగులు బాగా వచ్చాయని నాకు సంతృప్తి కలిగేవరకూ ఎన్నిసార్లైనా ప్రయత్నిస్తా. పాత్రకి అనుగుణంగా సంభాషణలు ఒక్కోసారి కడుపులోంచి, మరొకసారి గుండెల్లోంచి రావాలి. అలా జరగాలంటే పాత్రలో లీనం కావాలి. సరిత, రోజారమణిలను గురువుల్లా భావిస్తా.

- వసుంధరాదేవి చందాన


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని