పేదల లాయర్‌ వాదిస్తాడు..మనసు గెలుస్తాడు!

కేసులు వేస్తాడు.. వాదిస్తాడు.. కానీ ఫీజుల బేరం చేయడు. బాధితుల ఆస్తులు కాపాడతాడు.. అందులో వాటాలివ్వమని అసలే అడగడు. న్యాయం దక్కాల్సిన చోటికే నడిచి వెళ్తాడు.. నల్లకోటుకి మరింత వన్నెలద్దుతాడు.

Updated : 06 Nov 2021 05:46 IST

కేసులు వేస్తాడు.. వాదిస్తాడు.. కానీ ఫీజుల బేరం చేయడు. బాధితుల ఆస్తులు కాపాడతాడు.. అందులో వాటాలివ్వమని అసలే అడగడు. న్యాయం దక్కాల్సిన చోటికే నడిచి వెళ్తాడు.. నల్లకోటుకి మరింత వన్నెలద్దుతాడు. ఆ యువ లాయరే సింగపోగు సుబ్బారావు. పేదల తరపున వకాల్తా పుచ్చుకొని 27 ఏళ్లకే వందల కేసులు ఉచితంగా వాదిస్తున్న యువ వకీలు. కాసులు కుమ్మరిస్తేగానీ న్యాయం దొరకని రోజుల్లో ‘ఫ్రీ లీగల్‌ ఎయిడ్‌’ పేరిట సేవ చేస్తున్న అతడితో మాట కలిపింది ఈతరం.

న్యాయస్థానాల్లో బాధితులకు దక్కే న్యాయంపై బోలెడు జోక్స్‌ ప్రచారంలో ఉన్నాయి. న్యాయం కోసం వెళ్తే ఉన్న ఆస్తులు కరిగిపోవడం.. వయసులో ఉన్నప్పుడు కేసు వేస్తే ముసలితనంలో తీర్పు రావడం లాంటివి. నిష్టూరంగా ఉన్నా వీటిలో నిజాలు లేకపోలేదు. ఇవన్నీ ఒకెత్తు. పేదలైతే కనీసం న్యాయస్థానం గడప తొక్కడానికీ సాహసించరు అన్నది మరో వాదన. అలాంటి న్యాయార్థులకోసం కడదాకా పోరాడతానంటున్నాడు సుబ్బారావు.

స్వానుభవంతో: ఖమ్మం జిల్లా సిద్ధారం సుబ్బారావు సొంతూరు. చిన్నప్పుడు తన కుటుంబానికి, ఓ వ్యక్తికి గొడవ జరిగింది. ఆ వ్యక్తి తన తండ్రిని కొడుతుంటే అడ్డుకోబోతే చేతికి తీవ్ర గాయమైంది. దీంతో పోలీస్‌స్టేషన్‌ మెట్లెక్కాడు. విచారణకు వచ్చిన పోలీసులు కేసు పెట్టడానికి డబ్బులడిగారు. న్యాయం దక్కడానికి డబ్బులు ఇవ్వడమేంటని తీవ్రంగా మథనపడిపోయాడా చిన్నారి. న్యాయవాద వృత్తి ఎంచుకుంటే పేదలు, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయవచ్చని అప్పుడే అనుకున్నాడు. అదే ఆశయంతో లాయర్‌ పట్టా అందుకున్నాడు.

పేదలకు అండగా: పట్టా అందుకుంది మొదలు పేదల కేసులే చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. విద్యార్థి దశలో ఉన్న పరిచయాలతో వివిధ జిల్లాల్లో ఫ్రీ లీగల్‌ ఎయిడ్‌ కేంద్రాలు ప్రారంభించాడు. సహచరులు నక్కా యాదీశ్వర్‌, గోవర్ధన్‌లతో కలిసి ఉచిత వకాలత్‌కు రూపకల్పన చేశాడు. అన్ని చోట్లకీ వెళ్లే వీలు లేకపోవడంతో ఎక్కడికక్కడే కేసులు నమోదు చేసేలా సహచరులు, న్యాయవాద మిత్రులను ప్రోత్సహిస్తున్నాడు. అత్యవసర కేసులు మాత్రమే సుబ్బారావు వాదిస్తున్నాడు. దీనికోసం నెలలో కొన్ని రోజులు జిల్లాలన్నీ తిరిగొస్తున్నాడు. న్యాయస్థానాలు ఉన్న ప్రాంతాల్లో ‘ఉచిత న్యాయ సేవ’ పేరిట సలహాలు ఇస్తున్నాడు.
పాత పరిచయాలతో: సుబ్బారావు 2018లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య పూర్తి చేశాడు. ఆ సమయంలో అధ్యాపకులు, సహాధ్యాయులతో సన్నిహితంగా మెలిగేవాడు. విద్యార్థి, ఇతర సంఘాలతో కలుపుగోలుగా ఉండేవాడు. ఆ తీరే తర్వాత కాలంలో తన సదాశయానికి చేదోడుగా నిలిచిందంటాడు. వారి అండతోనే ఫ్రీ లీగల్‌ ఎయిడ్‌ సర్వీసు కొనసాగిస్తున్నాడు. తను చేపట్టిన కేసుల గురించి ఎప్పటికప్పుడు మిత్రులతో చర్చిస్తుంటాడు. ‘ఆలిండియా సమతా సైనిక్‌ దళ్‌’ సైతం సహకరిస్తోంది. వీరందరి సహకారంతో జిల్లా పర్యటనలు చేస్తున్నాడు. స్థానిక యువత తోడ్పాటుతో ప్రజలకు అవగాహన కలిగేలా చేస్తున్నాడు.

భోజనం పెడితే చాలు

న్యాయం కోసం వెళ్లి ఆస్తులమ్ముకున్న ఎందరినో చూశా. లాయరు ఫీజులు చెల్లించలేక మధ్యలోనే కేసులు వదిలేసుకున్నవాళ్లూ ఉన్నారు. పేదలు, న్యాయవ్యవస్థపై అవగాహన లేనివారికి కోర్టు మెట్లెక్కాలంటేనే హడల్‌. ఈ పరిస్థితి మారడానికి నావంతుగా చేతనైన సాయం చేస్తున్నా. నా ప్రయాణం, భోజనం, కనీస ఛార్జీలు చెల్లిస్తే చాలు.. బాధితుల తరపున వాదిస్తా. అవసరమైతే వారి దగ్గరికే వెళ్తా. ఒక పేదకు న్యాయం జరిగినప్పుడు అతడి మొహంలో కనిపించే సంతోషం వెలకట్టలేనిది. కరెన్సీ నోట్లు ఇవ్వలేని సంతృప్తి ఒకరికి సాయం చేసినప్పుడు కలుగుతుంది.

వాదించిన కొన్ని కేసులు..

* కరీంనగర్‌కు చెందిన ఓ మహిళ భర్త మరణిస్తే కుటుంబ సభ్యులు ఆమెను ఇంట్లోంచి వెళ్లగొట్టారు. మానసికంగా కుంగిపోయిన ఆ బాధితురాలి తరపున కేసు వేసి వాదిస్తున్నాడు.

* గద్వాలలో ఓ వృద్ధ జంట స్థలాన్ని తెలిసిన వ్యక్తులే ఆక్రమించారు. నానా ఇబ్బందులకు గురిచేశారు. బాధితుల గోడు విన్న సుబ్బు గద్వాల న్యాయస్థానంలో కేసు వేయించాడు.

* దేవరకొండకు చెందిన దళిత యువతిని ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొడుకు పుట్టిన తర్వాత వదిలేశాడు. ఓ న్యాయవాది మధ్యవర్తిగా ఉంటానంటూ ఆ యువతి కేసు వేయకుండా ఆపాడు. ఈ డ్రామా తెలుసుకున్న సుబ్బారావు బాధితురాలితో కేసు పెట్టించడమే కాదు.. బార్‌ కౌన్సిల్‌ ఆ లాయరుకి మొట్టికాయలు వేయించాడు.

* తెలంగాణాలోని అన్ని జిల్లాల్లో ఇప్పటివరకు పేదలు, మహిళలు, బాధితుల తరపున వందకు పైగా కేసులు వేయించాడు. కొన్ని స్వయంగా వాదిస్తున్నాడు.

- ఇల్లెందుల జయప్రకాశ్‌, ఈటీవీ నల్గొండ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని