పల్లెటూరి పిల్లగాడు.. గ్రాఫిక్స్‌లో మొనగాడు!

పుట్టింది పల్లెటూరిలో.. చదివింది అత్తెసరే! అయితే ఏంటట? ప్రతిభ ఎవడి సొంతమూ కాదంటూ దూసుకెళ్తున్నాడు చందు ఆది. కృష్ణా జిల్లా కొత్త మాజేరు యువకుడు. బాహుబలి, మహానటి సహా

Published : 15 Jan 2022 01:04 IST

పుట్టింది పల్లెటూరిలో.. చదివింది అత్తెసరే! అయితే ఏంటట? ప్రతిభ ఎవడి సొంతమూ కాదంటూ దూసుకెళ్తున్నాడు చందు ఆది. కృష్ణా జిల్లా కొత్త మాజేరు యువకుడు. బాహుబలి, మహానటి సహా ఎనభై సినిమాలకు గ్రాఫిక్స్‌ సమకూర్చాడు. చేతినిండా పని ఉంటే చాలనుకునే స్థాయి నుంచి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. పనితీరుకు పలు అవార్డులందుకున్నాడు.

చందుది పేద కుటుంబం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పదితో చదువాపేసి చిన్నచిన్న పనులు చేయడం మొదలు పెట్టాడు. తర్వాత రాజమండ్రి వెళ్లి మల్టీమీడియా కోర్సు చేశాడు. అక్కడే లోకల్‌ టీవీలో ఎడిటర్‌గా చేరాడు. ఆపై ఓ న్యూస్‌ ఛానెల్లో కూడా పని చేశాడు. ఏం చేసినా ఆర్థిక సమస్యలు తీరేవి కావు. ఒకరి సలహాతో హైదరాబాద్‌ వచ్చాడు. రామోజీ ఫిల్మ్‌సిటీలో పని చేశాడు. దర్శకుడు రాజమౌళి ‘మకుట’లో చేరాక విజువల్‌ ఎఫెక్ట్స్‌లో రాటుదేలిపోయాడు.

ఓవైపు ఉద్యోగం చేస్తూనే సొంత ప్రాజెక్టులు చేసేవాడు చందు. అతడి పనితనం నచ్చి, నిర్మాత తుమ్మలపల్లి రాంసత్యనారాయణ ఓరోజు చందుకి ఫోన్‌ చేశారు. తను తీయబోతున్న ‘అవంతిక’ సినిమాకు గ్రాఫిక్స్‌ చేయమన్నారు. పెద్ద ప్రాజెక్టు అది. చిన్న గదిలో ఓ మిత్రుడితో కలిసి పని మొదలుపెట్టాడు. మొదటి సినిమా కావడంతో ప్రాణం పెట్టి చేశాడు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ బాగున్నాయని అంతా పొగిడారు. అవకాశాలు వరుస కట్టాయి. బాహుబలి, మహానటి.. ఖైదీ నెంబర్‌ 150...ఇలా ఏడేళ్లలో 80కి పైగా సినిమాలకు పని చేశాడు. టీవీ సీరియళ్లకూ గ్రాఫిక్స్‌, టైటిళ్లు చేస్తున్నాడు. ఒక్కడితో మొదలైన ‘శ్రీనిధి విజువల్‌ ఐకాన్‌’లో ఇప్పుడు ముప్ఫైమందికిపైగా ఉద్యోగులున్నారు. ఒకప్పుడు సినిమావాళ్లను దగ్గరి నుంచి చూస్తే చాలనుకున్న చందు.. రాఘవేంద్రరావు, అశ్వినీదత్‌, వి.వి.వినాయక్‌లాంటి పెద్దలతో కలిసి పని చేసే అవకాశం దక్కించుకున్నాడు. అంతేకాదు.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎంతోమందికి ఉచితంగా శిక్షణనిచ్చి ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాడు.. తెలిసిన కంపెనీల్లోకి పంపిస్తున్నాడు. ఎవరి అండదండలూ లేకుండా ఈ స్థాయికి చేరిన నీ విజయ రహస్యం ఏంటని అడిగితే.. ‘నేను పెద్దగా చదువుకోలేదు. నాకు తెలిసిందొక్కటే.. పనే జీవితం అనుకున్నా. నన్ను నమ్మి వచ్చేవాళ్లకు ది బెస్ట్‌ ఇవ్వాలనుకున్నా. అది చేయగలిగితే ఎవరికైనా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి’ అంటాడు.


గుర్తింపు

* 2009లో దాసరి మోస్ట్‌ టాలెంటెడ్‌ టెక్నీషియన్‌ అవార్డు.
* 2020లో ఏవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ అవార్డు.
* ప్రైడ్‌ కల్చరల్స్‌ ‘శివనంది’ పురస్కారం.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని