కష్టాలన్నీ.. ఆబ్రకదబ్ర!

ఆబ్రకదబ్ర అంటూ మ్యాజిక్‌ చేసే వాళ్లంటేనే ప్రత్యేకం... అలాంటి వాళ్లలో మార్త రవి మరింత స్పెషల్‌... గారడీ చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్న కష్టజీవి తను... వేల ప్రదర్శనలు ఇచ్చి.. పలు

Updated : 22 Jan 2022 06:07 IST

ఆబ్రకదబ్ర అంటూ మ్యాజిక్‌ చేసే వాళ్లంటేనే ప్రత్యేకం... అలాంటి వాళ్లలో మార్త రవి మరింత స్పెషల్‌... గారడీ చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్న కష్టజీవి తను... వేల ప్రదర్శనలు ఇచ్చి.. పలు అవార్డులు అందుకున్న ప్రతిభావంతుడు అతడు... అంతేగాక ఈ షోలకు సంబంధించిన అరుదైన సామగ్రి తయారు చేస్తూ.. సాటి మెజీషియన్ల కష్టాలు తీర్చుతున్న ఔత్సాహికుడు కూడా...ఆ యువకుడితో ఈతరం మాట కలిపింది.

ఇంటర్లో ఉన్నప్పుడు.. రవి మొదటిసారి ప్రముఖ మెజీషియన్‌ ఆర్‌.నారాయణ షో చూసి అచ్చెరువొందాడు. ఆ ప్రదర్శన తన మనసుపై బలంగా ముద్ర వేయడంతో ఎలాగైనా ఆ విద్య నేర్చుకోవాలనుకున్నాడు. ఆయనను ఒప్పించి శిష్యుడిగా చేరాడు. గురువుతోపాటు దేశమంతా తిరిగేవాడు. తర్వాత నెల్లూరు, హైదరాబాద్‌ ఇంద్రజాలికులు.. ఎన్‌.ఆర్‌. కరెంట్‌, అలీల దగ్గర మరిన్ని మెలకువలు నేర్చుకున్నాడు. పద్దెనిమిదేళ్ల వయసులోనే సొంతంగా తొలి షో చేశాడు. అప్పట్నుంచి వెనుదిరిగి చూడకుండా దాదాపు మూడు వేల ప్రదర్శనలిచ్చాడు. భారత్‌లో జరిగిన కొన్ని అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొన్నాడు. విదేశాల నుంచి ఆహ్వానం అందినా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆగిపోయాడు. అయినా అతడి ప్రతిభకి పలు జాతీయ స్థాయి అవార్డులు వరించాయి.

కుటుంబ భారం మోస్తూ...

ప్రేక్షకుల్ని అలరిస్తూ రవి చేస్తున్న మాయాజాలం వెనక మోయలేనంత భారం ఉంది. అతడి అమ్మానాన్నలు వ్యవసాయ కూలీలు. వాళ్ల కష్టం చూడలేక సెలవుల్లో తానూ పనికి వెళ్లేవాడు. ఇరవై ఏళ్ల కిందటే తండ్రి చనిపోవడంతో చిన్నతనంలోనే కుటుంబ భారం అతడిపై పడింది. పదేళ్ల కిందట చెల్లెలి భర్త అనారోగ్యంతో, ఐదేళ్ల కిందట తమ్ముడు వడదెబ్బతో మృతి చెందారు. ఆ రెండు కుటుంబాల బాధ్యతనూ తీసుకున్నాడు. ప్రదర్శనలు ఇస్తూ, అవి లేనప్పుడు వ్యవసాయ పనులు చేస్తూ మూడు కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉన్నాడు రవి.

సాటి మెజీషియన్ల కోసం..

మెజీషియన్లు తమ ప్రదర్శనల్లో ఎక్కువగా ఆస్ట్రిచ్‌, బాతు పక్షుల ఈకలతో తయారు చేసిన ఫ్లవర్స్‌ వాడుతుంటారు. కళ్లు మూసి తెరిచేలోగా వీటిని మాయం చేస్తూ, గాల్లోంచి సృష్టిస్తూ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంటారు. ఎంతో కీలకమైన ఈ ఫ్లవర్స్‌ని మన ఇంద్రజాలికులు చైనా, కొరియా, జపాన్‌, థాయ్‌లాండ్‌, మలేసియా దేశాల నుంచి తెప్పిస్తుంటారు. ఖరీదు ఎక్కువగా ఉండటంతో చిన్న మెజీషియన్లకు ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ సమస్య పరిష్కరించేందుకు.. రవినే సొంతంగా గూస్‌ ఫెదర్‌ ఫ్లవర్స్‌ తయారు చేయడం మొదలుపెట్టాడు. ఇందులో ఇప్పటివరకు కేన్‌, కేఫ్‌, మల్టీ, క్యాండిల్‌, బొటానియం, మాగ్నెట్‌, కిసైర్‌ బొటానియం.. అంటూ 25 రకాలు రూపొందించాడు. పైగా సగం ధరకే అందిస్తుండటంతో.. దేశీయంగా, విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. గిరాకీ బాగుండటంతో ఇంటినే ఒక కుటీర పరిశ్రమగా మార్చి కొంతమందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు. ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తే మెజీషియన్లకు అవసరమైన ఇతర సామగ్రి కూడా తయారు చేస్తానంటున్నాడు రవి.


* గుంటూరులో ఆంధ్రప్రదేశ్‌ మెజీషియన్‌ అసోసియేషన్‌ నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో వరుసగా మూడేళ్లు మొదటి స్థానంలో నిలిచాడు.

* ఇంటర్నేషనల్‌ మ్యాజిక్‌ అకాడెమీ ‘మాయ-మాయ’ పేరుతో బెంగళూరులో నిర్వహించిన పోటీల్లో నిమిషంలోనే 12 గొడుగులు, 2 పావురాలు, 2 కర్రలు సృష్టించాడు. ఇది అంతర్జాతీయ రికార్డు.

* 2019లో మయూరి ఆర్ట్స్‌ అకాడెమీ కళాకారుల విభాగంలో విశ్వసంస్కృతి నంది పురస్కారం.

* తాజాగా ‘ఇంటర్నేషనల్‌ మ్యాజిక్‌ క్లబ్‌’ ఆన్‌లైన్‌ అంతర్జాతీయస్థాయి పోటీలో రెండోస్థానం. ఇందులో ఫిలిప్పీన్స్‌, మెక్సికో, శ్రీలంక, థాయ్‌లాండ్‌ సహా పన్నెండు దేశాలకు చెందిన వందమందికిపైగా కళాకారులు పోటీపడ్డారు.


- నూనె నరేశ్‌, వెంకటాపూర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని