చేతుల్లేనివాళ్లకు.. చేయూతనిస్తాడు!

చేతుల్లేకున్నా ల్యాప్‌టాప్‌ను క్లిక్‌మనిపించొచ్చు... కదల్లేని స్థితిలో ఉన్నా స్మార్ట్‌ఫోన్‌ని ఆపరేట్‌ చేయొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే దివ్యాంగులు సైతం అందరిలా టెక్నాలజీని ఉపయోగించవచ్చు...

Updated : 05 Feb 2022 05:08 IST

చేతుల్లేకున్నా ల్యాప్‌టాప్‌ను క్లిక్‌మనిపించొచ్చు... కదల్లేని స్థితిలో ఉన్నా స్మార్ట్‌ఫోన్‌ని ఆపరేట్‌ చేయొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే దివ్యాంగులు సైతం అందరిలా టెక్నాలజీని ఉపయోగించవచ్చు... అలాంటివాళ్ల కోసమే ‘మౌజ్‌వేర్‌’ అనే పరికరం రూపొందించాడు కె.వి.ప్రవీణ్‌కుమార్‌. ఈ ఆవిష్కరణకు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాడు.

నెల్లూరుకి చెందిన ప్రవీణ్‌ చెన్నైలో స్థిరపడ్డాడు. కాలేజీ స్థాయి నుంచే టెక్నాలజీపై ఆసక్తి. ఇంజినీరింగ్‌లో వీడియోగేమ్స్‌ బాగా ఆడేవాడు. ఆ సమయంలోనే కీబోర్డు వాడకుండా, గేమ్‌ ఆడే ఓ పరికరాన్ని తయారు చేశాడు. సెన్సర్ల సాయంతో పని చేస్తుందిది. తలకు కట్టుకొని ఆజ్ఞలు ఇవ్వొచ్చు. ‘ఓసారి నా స్నేహితుడి చేయి విరగడంతో కంప్యూటర్‌ వాడటం కష్టమైంది. అప్పుడు నేను రూపొందించిన పరికరం తనకిచ్చాను. దాంతో బాగా ఆపరేట్‌ చేశాడు. అప్పుడే నాకో ఆలోచన వచ్చింది. దీన్ని దివ్యాంగులకు ఉపయోగపడేలా మరింత అభివృద్ధి చేయాలనుకున్నా’ అంటాడు ప్రవీణ్‌.

తోడ్పాటు: ‘మౌజ్‌వేర్‌’ అనే పేరు పెట్టిన ఈ ఆవిష్కరణని పలు ఇంజినీరింగ్‌ ఫెస్ట్‌లలో ప్రదర్శించాడు. ఐఐటీ మద్రాసు, గూగుల్‌ పోటీల్లో పలువురి మెప్పు పొందాడు. ఐఐటీ మద్రాసు యజమాన్యం దీన్ని మరింత మెరుగు పరచమని రూ.10లక్షల ఆర్థిక సాయం చేసింది. పరిశోధనకు ప్రత్యేక గదినీ కేటాయించింది. టీసీఎస్‌ అనుబంధ ‘డిజిటల్‌ ఇంపాక్ట్‌ 2021’ కూడా కొంతమొత్తం అందించింది.

పనిచేస్తుందిలా: చిన్న అగ్గిపెట్టెలాంటి దాంట్లో సెన్సర్ల బాక్స్‌, మరిన్ని స్విచ్‌లు అమర్చాడు. దీన్ని కళ్లజోడు, హెడ్‌ఫోన్‌ లేదా తలకు ఎలాస్టిక్‌ బ్యాండ్‌లా తగిలించుకోవచ్చు. తల కదలికలకు అనుగుణంగా మౌజ్‌ కదులుతుంది. తెరపై పేజీ స్క్రోల్‌ అవుతుంది. చేతుల్లేని వారు మోచేతులు లేదా కాళ్లతో.. చేతులున్నవారు వేళ్ల ద్వారా క్లిక్‌ చేయడానికి చిన్నపాటి స్విచ్‌లూ అమర్చాడు. దివ్యాంగులు తమకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఈ మీటలు పెట్టుకోవచ్చు. తలకు కట్టుకున్న సెన్సర్‌ను సెకనుపాటు ఆపి ఉంచితే ఆటోమేటిగ్గా క్లిక్‌ అవుతుంది. మాటల ఆజ్ఞలతో కంపోజింగ్‌, ఎడిటింగ్‌, ఇతర ప్రోగ్రామ్‌లు రన్‌ అయ్యేలా సాఫ్ట్‌వేర్‌ని రూపొందించాడు. ఈ పరికరంతో కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, మొబైల్‌, స్మార్ట్‌టీవీలాంటివి ఆపరేట్‌ చేయొచ్చు. పక్షవాతంతో శరీరం చచ్చుబడిపోయినవారు సైతం ఉపయోగించవచ్చు అంటున్నాడు ప్రవీణ్‌. ఇరవైమంది దివ్యాంగులు ప్రయోగాత్మకంగా వాడుతున్న ఈ మౌజ్‌వేర్‌కి పేటెంట్‌ కూడా దక్కింది.

-హిదాయతుల్లాహ్‌ బిజపూర్‌, చెన్నై


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని