Updated : 05 Feb 2022 05:05 IST

కలవరం.. కళతో సాకారం

పది చదివి సరిగమల బాట పట్టిందొకరు... డిగ్రీ వదలి మెగాఫోన్‌ అందుకుంది మరొకరు. అవమానాలు.. ఆటంకాలు ఎన్ని ఎదురైనా అడుగు ముందుకే వేశారు. అనుకున్నది సాధించారు. సాదాసీదా నేపథ్యమున్నా అందలం అందుకోవచ్చని నిరూపించిన ఈ యువకిశోరాలతో మాట కలిపింది ఈతరం.


సెంచరీ దాటాడు

తొమ్మిదేళ్లకే ఆ కుర్రాడిలో రంగుల కల మొదలైంది. పెరిగి, పెద్దవుతూ తనని డిగ్రీ వదిలేసేలా చేసింది. సీన్‌ కట్‌ చేస్తే... అతడి ఖాతాలో వంద లఘుచిత్రాలు, రెండు సినిమాలు, జాతీయ అవార్డులూ ఉన్నాయి. ఎలాంటి సినిమా నేపథ్యం లేకపోయినా ఆసక్తితో ఇంతదాకా వచ్చాడు కడప జిల్లా రాజుపాలెం యువ దర్శకుడు జాకాట రమేశ్‌.

పుట్టింది కూలి కుటుంబంలో అయినా..  రంగుల కలల్లో తేలిపోయేవాడు రమేశ్‌. వయసు పెరిగినకొద్దీ స్నేహితులకు కథలు అల్లి చెప్పేవాడు. సినిమా డైలాగులకు మెరుగులద్దేవాడు. ఈ మోజుతో డిగ్రీ మధ్యలోనే ఆపేసి చిత్రనగరిలో వాలిపోయాడు. స్నేహితులు, అంతర్జాలాన్నే గురువులుగా మార్చుకొని కెమెరా, ఎడిటింగ్‌, నటన, టెక్నాలజీ, విజువల్‌ టేకింగ్‌, స్క్రిప్ట్‌ రాయడం, దర్శకత్వం.. అన్నీ నేర్చుకున్నాడు. ఈ సమయంలో రోజు గడవడమే ఇబ్బందిగా ఉండేది. స్నేహితులే ఆదుకునేవారు. తర్వాత కెమెరామన్‌గా మారాడు. నాలుగేళ్లలో యాభైకి పైగా లఘుచిత్రాలకు పని చేశాడు. ఈ అనుభవంతో 2014లో దర్శకుడిగా మారాడు. లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులు పడుతున్న బాధలు వివరిస్తూ ‘వలస’ షార్ట్‌ఫిల్మ్‌ తీశాడు. ఈ దృశ్యరూపానికి మంచి స్పందన వచ్చింది. ఆపై వెనుదిరిగి చూసుకోలేదు.భిన్న కథాంశాలతో ప్రయోగాలు చేశాడు.

‘వ్యవసాయం’, ‘ఓ నిమిషం’ అనే లఘుచిత్రాలకు జాతీయస్థాయి అవార్డు, పురస్కారం దక్కాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా మొదటి చిత్రానికి అవార్డు అందున్నాడు.

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ స్పార్క్‌ వరల్డ్‌ ఓటీటీ కాన్సెప్ట్‌ పేరుతో దేశవ్యాప్తంగా నిర్వహించిన లఘుచిత్రాల పోటీలో రమేష్‌ ‘ఫస్ట్‌ నైట్‌ విత్‌ కరోనా’ తుది జాబితాలో నిలిచింది.

లఘుచిత్రాలపై పట్టు సాధించాక ఖోఖో క్రీడ కథాంశంతో ‘రథేరా’ సినిమా తీశాడు. ఇందులో నటీనటులంతా కడప కుర్రాళ్లే. తక్కువ బడ్జెట్‌లో తీసినా, టేకింగ్‌ బాగుండటంతో ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్‌ సహా పలువురు రమేశ్‌ని ప్రశంసించారు. హీరో నందమూరి తారకరత్న సినిమా అవకాశం ఇచ్చాడు. రథేరాకు కొనసాగింపుగా అతడితో ‘సారథి’ రూపొందించాడు. ఇది మార్చిలో విడుదలవుతోంది. పేదరికంలో పుట్టినా.. సినిమా కష్టాలు ఎన్ని ఎదురైనా.. పట్టు వదలకుండా చివరికి తన లక్ష్యాన్ని చేరుకున్నాడు రమేశ్‌.  

- జి.మురళీమోహన్‌ గౌడ్‌, ఈటీవీ, కడప


బ్యాండ్‌ నుంచి బుల్లెట్టు బండి దాకా

అరకొర అర్హతలే ఉన్నా.. ఉద్ధండులతో కలిసి పని చేశాడు. సరికొత్త బాణీలతో కుర్రకారుని ఉర్రూతలూగిస్తున్నాడు. లఘుచిత్రాలు, ప్రైవేట్‌ ఆల్బమ్స్‌, వాణిజ్య ప్రకటనలు అన్నింట్లో తనదైన ముద్ర వేస్తూ ఆల్‌రౌండర్‌ అనిపించుకుంటున్న ఆ తెనాలి యువకుడే షేక్‌ బాజి.

బాజిది సంగీత నేపథ్య కుటుంబం. అమ్మానాన్నలు క్లారినెట్ విద్వాంసులు. తాతయ్య ‘మస్తాన్‌ బ్యాండ్‌’ పేరుతో ఒక బృందాన్ని నడిపేవారు. నిరంతరం పాటల సాధన, సంగీత హోరు మధ్యే పెరిగాడు. కానీ చదువుపై ఆసక్తి ఉండేది కాదు. ఎలాగోలా పదోతరగతి పూర్తి చేశాడు. ఆపై మామయ్య షేక్‌ బాజి (సీనియర్‌) దగ్గర కీబోర్డు వాయించడం నేర్చుకున్నాడు. యజ్ఞనారాయణ, సతీష్‌ల శిష్యరికంలో రాటుదేలాడు. వాళ్ల బృందంలో చేరి వందల కచేరీలు చేశాడు. ఈ సమయంలోనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఏసుదాస్‌, సుశీల, జానకి లాంటి ఉద్ధండులతో కలిసి పని చేశాడు. ఏ రంగంలో ఉన్నా అప్‌డేట్‌గా ఉంటేనే రాణింపు. దీన్ని పసిగట్టిన బాజి చెన్నై వెళ్లి మిత్రుడు నరేశ్‌ సాయంతో ఆధునిక రికార్డింగ్‌ విధానంపై శిక్షణ తీసుకున్నాడు. ఆ అనుభవంతో రికార్డింగ్‌ స్టూడియో తెరిచాడు. అప్పుడప్పుడే లఘుచిత్రాల హవా ఊపందుకుంటోంది. తెనాలి చుట్టుపక్కల ఉండే కాలేజీ విద్యార్థులు తాము తీసిన షార్ట్‌ఫిల్మ్స్‌ రికార్డింగ్‌ కోసం బాజి దగ్గరికొచ్చేవారు. చక్కని పనితీరుతో మంచి పేరు సంపాదించుకున్నాడు. అదేసమయంలో విజయవాడలోని ఒక ఎఫ్‌.ఎం.కి జింగిల్స్‌ చేశాడు. ఆపై పదేళ్లలో 150కు పైగా లఘుచిత్రాలు, 100కు పైగా ప్రైవేటు ఆల్బమ్స్‌, పదుల సంఖ్యలో ప్రకటనలకు సంగీతం అందించాడు.

కీలక మలుపు

హైదరాబాద్‌లో ఉంటే మంచి అవకాశాలొస్తాయని కొందరు యువ గాయకులు ఆహ్వానించారు. అదే సమయంలో పన్నెండు భారతీయ భాషల్లో రూపొందించిన ‘ధీర’ యానిమేషన్‌ సినిమాకి పని చేయమని కోరారు. దాంతో 2016లో హైదరాబాద్‌కి మకాం మార్చాడు బాజి. ధీరకి మంచి పేరొచ్చింది. గాయని మంగ్లీతో చేసిన జానపద పాటలు పాపులర్‌ అయ్యాయి. యువ గాయకులు, శ్రోతలకు నచ్చేలా కొత్తదనంతో బాణీలు ఇస్తుండటంతో అవకాశాలు వరుస కట్టాయి. శ్రీలేఖ, మధుప్రియ, బిత్తిరి సత్తి, గీతామాధురి, శ్రీకృష్ణ, అనురాగ్‌ కులకర్ణి, హేమచంద్ర, అంజనా సౌమ్య, రాహుల్‌ సిప్లిగంజ్‌లాంటి గాయకులతో.. సుద్దాల అశోక్‌తేజ, కందికొండ, కాసర్ల శ్యామ్‌, రాంబాబు కోసాల, లక్ష్మణ్‌లాంటి రచయితలతో కలిసి పని చేశాడు. ఎన్నికల ప్రచారం కోసం టీఆర్‌ఎస్‌ పార్టీకి చేసిన పాట.. కరోనా సమయంలో తెలంగాణ పోలీసులకి సలాం కొడుతూ కట్టిన బాణి పెద్ద బాస్‌లను మెప్పించింది. ఇక గాయని మోహన భోగరాజుతో కలిసి చేసిన ‘బుల్లెట్టు బండి’ ఎంత సంచలనమైందో అందరికీ తెలిసిందే. ఈమధ్యే ఎన్టీఆర్‌ కోసం చేసిన పాట మనసుకి హత్తుకునేలా ఉందని బాలకృష్ణ మెచ్చుకున్నారు. రికార్డింగ్‌ స్టూడియో ప్రారంభించింది మొదలు.. బాజి ఏనాడూ ఖాళీగా లేడు. ‘నిబద్ధతతో పని చేస్తూ, క్రమశిక్షణతో ఉంటే ఏ రంగంలో అయినా గుర్తింపు వచ్చి తీరుతుంది. అదే నా విజయ రహస్యం’ అంటాడు బాజి.

- షేక్‌ అబ్దుల్‌ తాజుద్దీన్‌, తెనాలి టౌన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని