గొడుగు కలిపింది

వెతికి చూడాలేగానీ.. బాలీవుడ్‌, టాలీవుడ్‌ సినిమాలకు తీసిపోకుండా వీధికో ప్రేమకథ కనబడుతుంది మనకు. చాంద్‌నీ చంద్రన్‌, అరుణ్‌ సుదర్శన్‌లది అలాంటి ఊహించని మలుపులున్న లవ్‌స్టోరీనే.

Updated : 17 Oct 2022 10:33 IST

వెతికి చూడాలేగానీ.. బాలీవుడ్‌, టాలీవుడ్‌ సినిమాలకు తీసిపోకుండా వీధికో ప్రేమకథ కనబడుతుంది మనకు. చాంద్‌నీ చంద్రన్‌, అరుణ్‌ సుదర్శన్‌లది అలాంటి ఊహించని మలుపులున్న లవ్‌స్టోరీనే.

మిళ్‌ అమ్మాయి చాంద్‌నీ పుస్తకాల పురుగు. ఐఏఎస్‌ తన లక్ష్యం. 2016లో పరీక్షలన్నీ రాసి ‘హమ్మయ్య.. భారం దిగిపోయింది’ అని ఊపిరి పీల్చుకుంటోంది. అదేరోజు సాయంత్రం.. ఆకాశంలో దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. చల్లగాలులు వీస్తూ.. చిరుజల్లులు మొదలయ్యాయి. ఆ సమయంలో వెచ్చవెచ్చగా కప్పు కాఫీ తాగితే బాగుండు అనిపించింది. వెంటనే ఫ్రెండ్‌ అరుణ్‌కి ఫోన్‌ చేసింది. తనొచ్చాడు. ఇద్దరూ కలిసి కాఫీ తాగి, పిచ్చాపాటీగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో ఎవరో తరుమున్నట్టు పెద్ద వర్షం మొదలైంది. గొడుగు విప్పి వాన చినుకులు పడకుండా కాచుకుంది ఆ జంట. స్నేహితురాలే కదా అని ఆమెకి దగ్గరగా జరిగి చొరవగా భుజంపై చేయి వేసి జాగ్రత్తగా నడిపించుకుంటూ వెళ్తున్నాడు అరుణ్‌. ‘ప్యార్‌ హువా.. ఇక్‌రార్‌ హువా...’ పాటలో హీరోహీరోయిన్లలా కనిపించారేమో.. లేక ఆ పడుచు జంటని ఏ ఫీచర్‌ పేజీలోనో వాడుకుందామనుకున్నాడో.. వెంటనే తన కెమెరాకి పని చెప్పాడో పత్రిక ఫొటోగ్రాఫర్‌. తర్వాత ఏమైంది? చాంద్‌నీ సివిల్స్‌ టాపర్‌గా నిలిచింది. వేరే ఫొటో ఏదీ లేకపోవడంతో అంతకుముందు తీసిన చిత్రాన్నే ప్రచురించి ‘భర్తతో కలిసి విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్న టాపర్‌’ అని క్యాప్షన్‌ కూడా జోడించింది ఆ డెయిలీ. వాళ్ల అత్యుత్సాహానికి చాంద్‌నీ, అరుణ్‌లు ముందు చిరాకుపడ్డా.. ‘వాళ్లు చెప్పిందే ఎందుకు నిజం చేయకూడదు?’ అని ముసిముసిగా నవ్వుకున్నారు. తమ స్నేహంలో ప్రేమ చిగుళ్లు వేయించి, ఒక్కటి చేసిన గొడుగు, పత్రికకి తర్వాత కృతజ్ఞతలు చెప్పారు. ప్రస్తుతం చాంద్‌నీ త్రిపుర జిల్లా కలెక్టరుగా పని చేస్తుంటే.. అరుణ్‌ అక్కడే ఆర్థిక వ్యవహారాల నిపుణుడిగా ఉన్నాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని