బతుకే వ్యర్థం అనుకున్నవాడు.. బతుకునిస్తున్నాడు!

ఆ కుర్రాడికి పుస్తకమంటే ప్రాణం. కానీ ఉన్నత చదువులకు పేదరికం మోకాలడ్డింది... ఆ బాధతో బతుకే ముగించాలనుకున్నాడు.. అమ్మ గుర్తొచ్చి ఆగిపోయాడు... ఆపై తనలాంటి పేద విద్యార్థులకు వెలుగుల దివ్వెలా మారాడు... ‘ఉయ్‌ ఆర్‌ విత్‌ యు’ ప్రారంభించి సమాజహిత కార్యక్రమాలు చేపడుతున్నాడు... తనే ప్రకాశం జిల్లా వైదనకు చెందిన సిగినం అయ్యప్ప.

Published : 05 Mar 2022 00:28 IST

ఆ కుర్రాడికి పుస్తకమంటే ప్రాణం. కానీ ఉన్నత చదువులకు పేదరికం మోకాలడ్డింది... ఆ బాధతో బతుకే ముగించాలనుకున్నాడు.. అమ్మ గుర్తొచ్చి ఆగిపోయాడు... ఆపై తనలాంటి పేద విద్యార్థులకు వెలుగుల దివ్వెలా మారాడు... ‘ఉయ్‌ ఆర్‌ విత్‌ యు’ ప్రారంభించి సమాజహిత కార్యక్రమాలు చేపడుతున్నాడు... తనే ప్రకాశం జిల్లా వైదనకు చెందిన సిగినం అయ్యప్ప.

అయ్యప్పది నిరుపేద కుటుంబం. ఫస్ట్‌క్లాస్‌లో పది పాసైనా ఆపై చదువుల బడి సాగలేదు. ఉపాధ్యాయురాలు, బంధువులు ఆదుకోవడంతో ఒక కార్పొరేట్‌ కళాశాలలో సీటు దక్కించుకున్నాడు. కానీ ఆ సాయం కడదాకా అందక మధ్యలోనే తనకిష్టమైన చదువు మానేయాల్సిన దుస్థితి. అప్పుడు చావే దిక్కు అనుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాలనుకున్నాడు. ఇంతలోనే అమ్మ గుర్తొచ్చింది. భర్త, కూతురుని కోల్పోయిన తనకు నేను కాకుండా మరెవరు దిక్కు లేరని ఆగిపోయాడు. మరికొందరి దగ్గర చేతులు చాచి, ఎలాగోలా ఇంటర్‌ పూర్తి చేశాడు. ఎంసెట్‌లో మంచి ర్యాంకు రావడంతో బీటెక్‌లో ఉచిత సీటొచ్చింది. కళాశాల యాజమాన్యాన్ని వేడుకొని, వసతిగృహంలో ఉంటూ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు.

బీటెక్‌లో ‘నార్త్‌ ఫౌండేషన్‌’ అనే సంస్థ నుంచి ఉపకార వేతనం అందుకున్నాడు అయ్యప్ప. చెక్‌ తీసుకోవడానికి వెళ్లినప్పుడు ‘మీలాంటి పెద్ద మనసున్న దాతల సాయంతో చదువు పూర్తి చేస్తున్నా. నేను స్థిరపడ్డాక తప్పకుండా నాలాంటి పదుగురికి సాయం చేస్తా’ అన్నాడు. ఆ మాటలు నిర్వాహకులకు నచ్చాయి. ‘ఆ సేవా కార్యక్రమాలేవో ఇప్పుడే మొదలుపెట్టు. మేం అండగా ఉంటాం’ అన్నారు. ఆ భరోసాతోనే ఓ స్వచ్ఛందసంస్థ ప్రారంభించాలనుకున్నాడు. ఆ మాట స్నేహితులతో చెబితే ‘పాలకులతోనే కావడం లేదు. మనమెలా జనాల్ని ఉద్ధరిస్తాం’ అంటూ కొందరు నిరాశ పరిచారు. అయినా అయ్యప్ప వెనక్కి తగ్గలేదు. కలిసి వచ్చిన కొన్ని చేతులతోనే 2019లో ‘ఉయ్‌ ఆర్‌ విత్‌ యు’కి పురుడు పోశాడు. పిల్లలకు కెరియర్‌ సూచనలు ఇవ్వడం, పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడంతో మొదలుపెట్టి, ఉచిత వైద్యం, వృద్ధాశ్రమాలకు పాత దుస్తుల సేకరణ, గ్రామాల్లో గ్రంథాలయాలకు పుస్తకాలు బహుకరించడంలాంటి సేవలకు విస్తరించాడు. కరోనా సమయంలో బాధితులకు నిత్యావసర సరుకులు అందించాడు. నెలసరి సమయంలో మహిళలు తీసుకోవాల్సిన వ్యక్తిగత పరిశుభ్రత గురించి ప్రచారం చేస్తున్నాడు. అనాథ పిల్లల్ని చేరదీసి వారి చదువులకు చేయూతనిస్తున్నాడు. పర్యావరణ పరిరక్షణపై చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నాడు. రోడ్డుకిరువైపులా మొక్కలు నాటుతున్నాడు. ఈ కార్యక్రమాలన్నింటికీ చదువు, పర్యావరణ, స్వేచ్ఛ, గ్రంథాలయ, వారధి, ఆపద్బంధు, అన్నపూర్ణ, అభయ అనే పేర్లు పెట్టి ముందుకు సాగుతున్నాడు. అయ్యప్ప ఒక్కడితో మొదలై, ప్రస్తుతం వందమంది దాకా సంస్థలో చురుగ్గా సేవలందిస్తున్నారు. వీరంతా ఇంజినీరింగ్‌ విద్యార్థులు, అతడి చిన్ననాటి స్నేహితులే. 


‘జీవితంలో స్థిరపడ్డాక సేవా కార్యక్రమాలు ప్రారంభించాలనుకునేవాణ్ని. కానీ కళ్లముందే సాయం అందక చదువు, భవిష్యత్తు అంధకారం అవుతున్న వారిని చూశాక ఆలస్యం చేయదలచుకోలేదు. ఈ ప్రయత్నంలో నా ఎంటెక్‌ని సైతం వాయిదా వేసుకున్నా. దాతలు, స్నేహితులు, కార్యకర్తల సాయంతో విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నా. మా ప్రతి వలంటీర్‌ ఒక్కో విద్యార్థిని దత్తత తీసుకొని వారి చదువుపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. మొదట్లో నా చదువుకు సహకరించినవారేే సమాజహిత కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచారు. ఇప్పుడు మరింత మంది తోడవడంతో పెద్ద మొత్తంలో విరాళాలు అందుతున్నాయి. అందులో ప్రతి పైసా సద్వినియోగం చేస్తూ, ఆ వివరాల్ని సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నాం. ఎవరైనా అత్యవసరాల్లో ఉన్నవారు wearewithyouct.orgలో సంప్రదించవచ్చు.

- కాకర్ల వాసుదేవరావు, ఈనాడు, గుంటూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని