Updated : 19 Mar 2022 03:54 IST

చదువు, పరిశోధనల మణిహారం

తేతల మణిసందీప్‌ రెడ్డి. తాజాగా వెలువడిన ‘గేట్‌-2022’ ఫలితాల్లో ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంకర్‌. అంతేనా? తన గురించి చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయి. అతగాడు చదువుల్లో మేటి. సేవకు ముందుండే ఎన్‌.ఎస్‌.ఎస్‌.వలంటీరు. సామాజిక పరిశోధకుడు. అరుదైన నాణేల సేకర్త. డిగ్రీ పట్టా చేతికి  రాకముందే పలు కొలువులు కొల్లగొట్టిన విజేత. ప్రణాళిక ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటున్న ఈ ఆల్‌రౌండర్‌ ఈతరంతో మాట కలిపాడు.

గేట్‌లో గెలవడం మాటలు కాదు. ఇది కఠినమైన జాతీయస్థాయి పరీక్ష. ఐఐటీ, ఎన్‌ఐటీలాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు సహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కళాశాలల్లోని లక్షలమంది విద్యార్థులు పోటీ పడతారు. అందులో అందరినీ వెనక్కి నెట్టి మొదటి ర్యాంకు సాధించాడు మన తెలుగు తేజం మణిసందీప్‌. ఎన్‌ఐటీ-వరంగల్‌లో కెమికల్‌ ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి. మామూలు స్కూళ్లలో చదివినా, ఎలాంటి శిక్షణ తీసుకోకున్నా ర్యాంకుల గేట్‌ బద్దలు కొట్టొచ్చని నిరూపించాడు.

ర్యాంకుల మొనగాడు

మణిసందీప్‌ సొంతూరు రాజమహేంద్రవరం దగ్గర్లోని వెదురుపాక. కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. చిన్నప్పట్నుంచీ నాన్నలాగే ఇంజినీర్‌ కావాలనుకునేవాడు. ఆ పట్టుదలే పుస్తకాలపై మమకారం పెంచిందంటాడు. పదోతరగతిలో 10 సీజీపీతో స్కూల్‌ టాపర్‌గా నిలిచాడు. ఇంటర్‌లో కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ సబ్జెక్టులపై ఇష్టం పెంచుకొని.. ఎంసెట్లో 666 ర్యాంకు, జేఈఈ మెయిన్స్‌లో 13వేల ర్యాంకు సాధించాడు. ఐఐటీలో చేరే అవకాశం ఉన్నా.. జాతీయ సాంకేతిక విద్యాసంస్థ(నిట్)లో తనకిష్టమైన కెమికల్‌ ఇంజినీరింగ్‌లో సీటు రావడంతో అందులో చేరాడు. కానీ బీటెక్‌లో చేరిన ఏడాదికే కరోనా విరుచుకుపడింది. రెండేళ్లు క్యాంపస్‌కి దూరమయ్యాడు. మూడో ఏడాదిలో మనసు పెట్టి చదివి గేట్ రాశాడు. 299వ ర్యాంకు వచ్చింది. శిక్షణ తీసుకొని, ఏళ్లకొద్దీ చదివినా గేట్‌లో ఉత్తీర్ణత సాధించడమే గొప్ప. అలాంటిది ఎలాంటి కోచింగ్‌ లేకుండా మొదటిసారే మంచి ర్యాంకు సాధించాడు మణిసందీప్‌. అదే ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించి చివరి సంవత్సరంలో మరోసారి సిద్ధమయ్యాడు. ఈసారి గురి తప్పలేదు. ఏకంగా జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు కొల్లగొట్టాడు. ఆన్‌లైన్‌ తరగతులు వింటూ, అధ్యాపకులను అడిగి సందేహాలు తీర్చుకుంటూ లక్ష్యం చేరాడు.

యువ ఆవిష్కర్త

మణిసందీప్‌ బీటెక్‌ కోర్సులో భాగంగా మెషిన్‌ లెర్నింగ్‌ సాంకేతికతతో పరిశ్రమల వ్యర్థాలు శుద్ధి చేసే ఓ నమూనా ప్రాజెక్టు రూపొందించాడు. దీనికి ‘ప్రొడక్షన్‌ ఆఫ్‌ ఇన్‌ప్లుయెంట్ వేస్ట్‌ వాటర్‌ క్వాలిటీ యూజింగ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ మోడల్‌’ అని పేరు పెట్టాడు. దీని ద్వారా నీటిశుద్ధి కేంద్రాల్లో విద్యుత్తు వినియోగాన్ని గణనీయంగా తగ్గించే సూచనలు చేశాడు. ప్రస్తుతం చెరువుల్లోని వ్యర్థాలు, పరిశ్రమలు వెలువరించే మురికి నీటిని శుద్ధి చేసేందుకు చాలాచోట్ల సీవరేజ్‌ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. కానీ అందులో కొన్ని లోపాలున్నాయంటాడు మణిసందీప్‌. ప్లాంటు నడుస్తున్న క్రమంలో కొన్నిసార్లు విద్యుత్తు వినియోగం ఒక్కసారిగా పెరుగుతోంది. తను రూపొందించిన నమూనాతో ఈ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు అంటున్నాడు. తద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుంది. శుద్ధి కేంద్రాల నిర్వహణ వ్యయం తగ్గుతుంది. పుదుచ్చేరి వెళ్లి అక్కడి ఒక వ్యర్థ జల శుద్ధీకరణ కేంద్రంలో ప్రయోగాత్మకంగా పరిశీలించి చూశారు. ఇది కాకుండా ఎన్‌ఐటీ క్యాంపస్‌లో ఏటా జరిగే ‘టెక్నోజియాన్‌ సాంకేతిక వేడుక’లో ‘లేజర్‌ ట్యాగ్‌’ అనే ఆటను రూపొందించి అందరి మెప్పు పొందాడు. ఈవెంట్‌ మేనేజర్‌గా పని చేశాడు.

హాబీలు.. సేవలు

మణిసందీప్‌కి ఓ అరుదైన అలవాటు ఉంది. అది వివిధ దేశాలకు చెందిన నాణేలను సేకరించడం. అలా 80 దేశాల కాయిన్స్‌ సేకరించాడు. అందులో అరుదైన  క్రీ.శ.1700ల నాటివి కూడా ఉన్నాయి. స్నేహితులు, బంధువులు, అధికారులు, సామాజిక మాధ్యమాల్లోని గ్రూప్‌ల ద్వారా ఎంతో కష్టపడి వీటిని తీసుకొస్తున్నానంటున్నాడు. అన్నట్టు.. మణిసందీప్‌ జాతీయ సేవా పథకం (ఎన్‌.ఎస్‌.ఎస్‌.)లోనూ సభ్యుడు. కళాశాల విద్యార్థి విభాగానికి కోశాధికారి. దీని ద్వారా వరంగల్‌-ఎన్‌ఐటీ దత్తత తీసుకున్న గ్రామాల్లోకి స్వయంగా వెళ్లి రక్తదాన శిబిరాలు నిర్వహించడం.. సామాజిక సమస్యలపై అవగాహన సదస్సులు నిర్వహించడం లాంటి కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఈ సేవలకు గుర్తింపుగా 2020-21 సంవత్సరానికి ‘మెరిట్ స్కాలర్‌షిప్‌’ అందుకున్నాడు.


మనం ఏం కావాలి? భవిష్యత్తు ఎలా ఉండాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మన లక్ష్యంపై స్పష్టత ఉండి, స్థిరంగా ముందుకు సాగితే తప్పకుండా విజయం సాధిస్తాం. మధ్యలో కొన్ని వైఫల్యాలు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని ఒక విరామంగానే భావించాలి. గేట్‌లో టాపర్‌గా నిలవడంతో నాకు గెయిల్‌, ఓఎన్‌జీసీ, ఐఓసీఎల్‌లాంటి నవరత్న కంపెనీల్లో మంచి వేతనంతో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

- గుండు పాండురంగశర్మ, ఈనాడు, వరంగల్‌


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని