Updated : 02 Apr 2022 04:13 IST

పావు కదిపితే.. ప్రత్యర్థులు చిత్తే!

పదేళ్లకే గ్రాండ్‌ మాస్టర్‌ హోదా... తనకంటే మెరుగైన రేటింగ్‌ ఉన్న ఆటగాళ్లపై విజయాలు... పదుల సంఖ్యలో జాతీయ, అంతర్జాతీయ టైటిళ్లు... హనుమకొండకు చెందిన అర్జున్‌ ఇరిగేశి ఘనతలివి... తాజాగా దిల్లీలో జరిగిన ‘దిల్లీ ఇంటర్నేషనల్‌ చెస్‌ టైటిల్‌’ గెలిచిన ఈ కుర్రాడితో ఈతరం మాట కలిపింది.

టీనేజీ అంటే.. పుస్తకాలతో కుస్తీ పడుతూ స్నేహాలు, సరదాల్లో తేలిపోయే వయసు. పద్దెనిమిదేళ్ల అర్జున్‌ మాత్రం టోర్నీల కోసం దేశాలన్నీ తిరుగుతున్నాడు. పతకాలు, ఛాంపియన్‌షిప్‌లు కొల్లగొడుతూ శెభాష్‌ అనిపించుకుంటున్నాడు. భారత చదరంగ యవనికపై వేగంగా దూసుకొస్తున్న ఈ కుర్రాడు చిన్న వయసులోనే గ్రాండ్‌మాస్టర్‌ హోదా సాధించాడు. తెలంగాణ నుంచి ఈ ఘనత అందుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.


 ఖాళీగా ఉంటే: టేబుల్‌ టెన్నిస్‌ ఆడతా, కార్టూన్స్‌ చూస్తా.

  ఇష్టమైన ఆటగాళ్లు: క్రిస్టియానో రొనాల్డో, రఫేల్‌ నాదల్‌

  బెస్ట్‌ ఫ్రెండ్‌: అక్క కీర్తన

*   సినిమాల మాటో: తగ్గేదే లే. వారానికోసినిమా చూస్తా.

 ప్రస్తుతం: డిగ్రీ మూడో సంవత్సరం

 మర్చిపోలేని విజయాలు: వరల్డ్‌ ఛాంపియన్‌ కార్ల్‌సన్‌తో మ్యాచ్‌ డ్రా. దిగ్గజ విశ్వనాథన్‌ ఆనందన్‌ని ఓడించడం.


ర్జున్‌ తండ్రి వైద్యుడు. ఉద్యోగరీత్యా తిరుపతిలో ఉండేవారు. అప్పుడే ఈ కుర్రాడిలోని ప్రతిభ, చురుకుదనం పసిగట్టి స్కూల్‌ టీచర్‌ చెస్‌ నేర్పించమని సలహా ఇచ్చారు. తల్లి జ్యోతి ప్రోత్సాహంతో ఏడేళ్లకే  అరవైనాలుగు గళ్ల ఆటలో ప్రవేశించాడు. అక్కతో కలిసి సాధన చేసేవాడు. వరంగల్‌ తిరిగొచ్చాక ఒక కోచ్‌ దగ్గర చేర్పించారు. కొన్నేళ్లలోనే స్థానికంగా మొదలుపెట్టి, అంతర్జాతీయ పోటీల్లోనూ సత్తా చూపడం ప్రారంభించాడు. ఆర్థికంగా భారమవుతున్నా అతడి ఎదుగుదలను ఆపకూడదనే ఉద్దేశంతో అంతర్జాతీయ కోచ్‌లు, మాజీ గ్రాండ్‌మాస్టర్‌ల దగ్గర శిక్షణ ఇప్పించారు కన్నవాళ్లు.

రికార్డుల మొనగాడు: ఎనిమిదేళ్లకే పోటీలో పాల్గొని మంచి ప్రతిభ కనబరిచాడు అర్జున్‌. ఆపై వెనుదిరిగి చూడలేదు. తనకన్నా మెరుగైన ర్యాంకుల్లో ఉన్న ఆటగాళ్లను ఓడించడం అలవాటుగా మలచుకున్నాడు. లాత్వేనియన్‌ టోర్నీలో అంతవరకూ ఓటమెరుగని అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ ఫాబియనో కరువానాపై గెలిచాడు. వరల్డ్‌ ఛాంపియన్‌ కార్ల్‌సన్‌తో తలపడినప్పుడు పోటాపోటీగా ఆడాడు. ప్రపంచ నాలుగో ర్యాంకు ఆటగాడు, ఆర్మేనియా గ్రాండ్‌మాస్టర్‌ లెవాన్‌ ఆరోనియన్‌ని ఓడించాడు. బ్లిడ్జ్‌ విభాగంలో అత్యుత్తమ ర్యాంకింగ్‌ నమోదు చేశాడు. ‘టాటా స్టీల్‌ చెస్‌ ఛాలెంజర్స్‌’ టైటిల్‌ సొంత చేసుకొని ప్రతిష్ఠాత్మక మాస్టర్స్‌ టోర్నీకి అర్హత సాధించాడు. ఇదే ఊపులో 2018లో ఇంటర్నేషనల్‌ మాస్టర్‌, గ్రాండ్‌మాస్టర్‌ హోదా కొల్లగొట్టాడు. ఈమధ్యే పద్దెనిమిదేళ్ల చిన్న వయసులోనే జాతీయ సీనియర్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలిచాడు. తాజాగా దిల్లీ అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో సత్తా చూపించాడు. తనకన్నా వయసులో, అనుభవంలో చాలా పెద్దవాళ్లతో పోటీ పడి అందరికన్నా మెరుగైన ప్రదర్శన చేశాడు.

చదువుల్లోనూ చురుకు: అంతర్జాతీయ టోర్నీలో  ప్రస్తుతం సూపర్‌ గ్రాండ్‌మాస్టర్‌ లక్ష్యంగా పావులు కదుపుతున్నాడు. ఈ హోదా అందుకోవాలంటే 2,700 ఫిడే రేటింగ్‌ సాధించాలి. తనకి 2,633 ఫిడే రేటింగ్‌ ఉంది. రకరకాల టోర్నీల్లో పాల్గొంటూ తీరిక లేకుండా ఉంటున్నా.. అర్జున్‌ చదువులోనూ మెరిట్‌ విద్యార్థే. పదోతరగతి, ఇంటర్‌లోనూ తొంభైశాతం మార్కులకు పైనే స్కోరు సాధించాడు.

- కర్పనస్వామి చిన్నబాబు, వరంగల్‌ క్రీడావిభాగం


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని