మీమ్స్‌ చేస్తే.. కేక బా!

ఇన్‌స్టాలో ఏడున్నర లక్షల మంది ఫాలోయర్లు... చేసిన ప్రతి వీడియోకి మిలియన్లలో వీక్షణలు... సినిమా తారలు సైతం మెచ్చుకునే సృజనాత్మకత... ఇదీ సాయిని శ్రీహర్ష పరిచయం... కుర్రకారుకి బాగా దగ్గరైన ఈ మీమర్‌ నేపథ్యం, సరదా ప్రయాణం అతడి మాటల్లోనే.

Updated : 09 Apr 2022 04:35 IST

ఇన్‌స్టాలో ఏడున్నర లక్షల మంది ఫాలోయర్లు... చేసిన ప్రతి వీడియోకి మిలియన్లలో వీక్షణలు... సినిమా తారలు సైతం మెచ్చుకునే సృజనాత్మకత... ఇదీ సాయిని శ్రీహర్ష పరిచయం... కుర్రకారుకి బాగా దగ్గరైన ఈ మీమర్‌ నేపథ్యం, సరదా ప్రయాణం అతడి మాటల్లోనే.

మీమ్స్‌నే ఎందుకు?: సినిమా సన్నివేశాలు, కమెడియన్స్‌ హావభావాలకు సరదా మాటలు జోడించి రూపొందించిన చిత్రాలు, పొట్టి వీడియోలే మీమ్స్‌. సూటిగా, సుత్తి లేకుండా ఉండే వీటిని చూడగానే యువత పెదాలు విచ్చుకుంటాయి. సామాజిక మాధ్యమాల్లో త్వరగా షేర్‌ అవుతుంటాయి. పేరుకి పేరు, సంపాదనకి అవకాశం ఉండటంతో ఇటొచ్చా.

తొలి అడుగు: విజయనగరం సొంతూరు. జనాలను ఏదో రకంగా నవ్వించడం, నా ప్రతిభను అందరికీ చూపించడం అంటే చిన్నప్పట్నుంచి ఇష్టం. 2018లో మీమ్స్‌ ట్రెండ్‌ ఊపందుకుంది. జనాలకు దగ్గరయ్యేందుకు ఇదొక మార్గంగా కనిపించింది. నేనూ రంగంలోకి దిగిపోయా.

ఇప్పటివరకు: ఫొటో, షార్ట్‌ వీడియోలు, రీల్స్‌.. అన్నీ కలిపి నాలుగేళ్లలో పదిహేను వేల మీమ్స్‌ చేశాను. ‘హర్ష ఈజ్‌ అవెయిలబుల్‌’, ‘లైట్‌ బా’ అనే రెండు ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలు నిర్వహిస్తున్నా. ఈ రెండింట్లో కలిపి దాదాపు ఏడున్నర లక్షల ఫాలోయర్లు ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నా రోజుకి పది నుంచి పదిహేను మీమ్స్‌ చేస్తుంటా.


నాపై చేసిన మీమ్స్‌ బాగున్నాయని బ్రహ్మానందం అభినందించారు.
‘బ్రతుకు జట్కా బండి’పై చేసిన మీమ్స్‌ నటి రోజాకి నచ్చాయి.
‘పాగల్‌’ అనే సినిమాలో అవకాశం వచ్చింది.
స్ఫూర్తిదాయక ‘జోష్‌ టాక్స్‌’లో  నా ప్రయాణం గురించి చెప్పాను.


ఆసక్తికరంగా: ఆకట్టుకునేలా, ఆసక్తికరంగా ఉంటేనే దేంట్లో అయినా గుర్తింపు. దీనికోసం క్రికెట్‌, బిగ్‌బాస్‌, వెబ్‌ సిరీస్‌లు,  టీవీ సీరియళ్లు, రాజకీయాలు, సినిమాలు, వైరల్‌ వీడియోలు.. ట్రెండింగ్‌లో ఉన్న వాటినే సబ్జెక్టుగా ఎంచుకుంటా. ట్విటర్‌ని ఫాలో అవుతా. సినిమాలు చూస్తా. పత్రికలు బాగా చదువుతా. నా మీమ్స్‌ సరదాగా ఉంటాయే తప్ప ఎవరినీ కించపరచవు. ఆ ఉద్దేశం లేదు.

వెక్కిరించినా: మీమ్స్‌ చేస్తున్న కొత్తలో ‘ఈ వీడియోలేంటి? పనేం లేదా? చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చుగా’ అంటూ ఎంతోమంది వెక్కిరించారు. అయినా నేను తగ్గలేదు. ఒకట్రెండు సంవత్సరాలయ్యాక ఆదాయం మొదలైంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం మానేసి పూర్తిగా దీనికే సమయం కేటాయిస్తున్నా. మంచి పేరు రావడం, మీడియాలో కనపడుతుండటంతో కసిరిన వాళ్లే పొగుడుతున్నారు.

కెరియర్‌గా: మీమర్స్‌కి ఒక్కసారి పేరొస్తే సంపాదనకి ఢోకా ఉండదు. డిజిటల్‌ మార్కెటింగ్‌ చేసి సంపాదించవచ్చు. పెద్దపెద్ద సంస్థల తరపున యాడ్స్‌ చేయొచ్చు. సినిమాలకు పని చేయొచ్చు. నేను పోస్టర్లు, కొన్ని సన్నివేశాలు తీసుకొని మీమ్స్‌ రూపొందిస్తా. ఈమధ్య రాధేశ్యామ్‌, భీమ్లానాయక్‌లతో పాటు అంతకుముందు చాలా సినిమాలకు మీమ్స్‌ రూపొందించా. ప్రతిభ, సృజనాత్మకత, మార్కెటింగ్‌ నైపుణ్యం ఉంటే ఎవరైనా దీన్ని కెరీర్‌గా ఎంచుకోవచ్చు.

సలహా: ఏదైనా కొత్త పని చేసేటప్పుడు అందులో లోపాలు వెతికేవాళ్లూ ఉంటారు. డీలా పడిపోవద్దు. నిలదొక్కుకోవడానికి కొంచెం సమయం పట్టొచ్చు. మన టైం మొదలైతే ఆపేవాళ్లుండరు. ఇష్టమైన కళనే కెరియర్‌గా మలచుకుంటే పేరు, సంపాదన వెతుక్కుంటూ వస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు