ఆనాటి అభిమాని.. అంతా మెచ్చే ఎడిటర్‌!

కుటుంబ నేపథ్యం సినిమాలపై ఆసక్తి పెంచింది.  బీకాం డిగ్రీ చిత్రసీమకి దారి చూపింది. అవకాశాలు మాత్రం అంత తేలిగ్గా చిక్కలేదు. అర్ధాకలి, అవమానాలు, వెక్కిరింపులు.. అన్నీ దాటాకే తలుపు తట్టింది. ఆపై ఆ కుర్రాడు వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా పన్నెండు చిత్రాలకు ఎడిటర్‌గా పని చేశాడు. తనే కడప యువకుడు కుడుముల అమర్నాథ్‌ రెడ్డి. తన సినీ ప్రయాణాన్ని ఈతరంతో పంచుకున్నాడు. 

Updated : 16 Apr 2022 01:35 IST

కుటుంబ నేపథ్యం సినిమాలపై ఆసక్తి పెంచింది.  బీకాం డిగ్రీ చిత్రసీమకి దారి చూపింది. అవకాశాలు మాత్రం అంత తేలిగ్గా చిక్కలేదు. అర్ధాకలి, అవమానాలు, వెక్కిరింపులు.. అన్నీ దాటాకే తలుపు తట్టింది. ఆపై ఆ కుర్రాడు వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా పన్నెండు చిత్రాలకు ఎడిటర్‌గా పని చేశాడు. తనే కడప యువకుడు కుడుముల అమర్నాథ్‌ రెడ్డి. తన సినీ ప్రయాణాన్ని ఈతరంతో పంచుకున్నాడు. 

సినిమా అనగానే గుర్తొచ్చేది తెరపై కనిపించే హీరోహీరోయిన్లు, తెర వెనక ఉండే దర్శకుడే. కానీ తన కత్తెరకి ఒడుపుగా పని చెబుతూ బొమ్మకి ఒక అందమైన రూపం తీసుకురావడంలో ఎడిటర్‌ది కీలక పాత్ర. కడప జిల్లాలోని వేంపల్లె అనే చిన్న ఊరిలో, సినిమా నేపథ్యం లేని కుటుంబంలో పుట్టినా టాప్‌ ఎడిటర్‌గా పేరు తెచ్చుకున్నాడు అమర్‌.

నేపథ్యం: అమర్‌ నాన్న వాళ్ల ఊరిలో ఓ సినిమా థియేటర్‌లో భాగస్వామి. దాంట్లో ఆడే ప్రతి చిత్రం చూసేవాడు. సరదాగా మొదలైన అలవాటు రాన్రాను సినిమాలపై విపరీతమైన ఇష్టం పెంచింది. బీకాం కంప్యూటర్స్‌ పూర్తయ్యాక తనకున్న కంప్యూటర్‌ పరిజ్ఞానంతో చిత్ర పరిశ్రమలో టెక్నీషియన్‌గా స్థిరపడిపోదాం అనుకున్నాడు. అదే ఉద్దేశంతో కృష్ణానగర్‌లో వాలిపోయాడు. 

అవమానాలు: అక్కడికెళ్లాకే తెలిసింది సినిమాలో అవకాశం దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదని. తనకున్న టెక్నాలజీకి ఇంకాస్త మెరుగులు దిద్దుకుందాం అని మల్టీమీడియా కోర్సు చేశాడు. తర్వాత సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఏడాదిన్నర తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికొచ్చేశాడు. ఈ సమయంలో ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు దగ్గరి బంధువులే హేళన చేసేవారు. నీవల్ల ఏమవుతుందని నవ్వేవారు. మరోవైపు ఇంట్లోవాళ్లు కూడా ‘సినిమాలు వదిలెయ్‌.. ఏదో ఒక పని చూసుకో’ అనేవాళ్లు. ఇవన్నీ భరించలేక మళ్లీ హైదరాబాద్‌ తిరిగొచ్చాడు అమర్‌. స్నేహితుల గదిలో ఉంటూ ఎడిటింగ్‌ నేర్చుకున్నాడు. ఆపై ఆరునెలలు కష్టపడి తెలుగు పరిశ్రమలోని ఒక టాప్‌ ఎడిటర్‌ దగ్గరికి వెళ్లి శిష్యుడిగా చేర్చుకొమ్మని బతిమాలాడు. ఆయన అసలు పని కాకుండా కొసరు పని చేయమని పురమాయించేవారు. అది ఇష్టం లేక బయటికొచ్చేశాడు. మరో ఆరునెలలు ప్రయత్నించి 2015లో బాగా బిజీగా ఉన్న ఎడిటర్‌ ఎం.ఆర్‌.వర్మ దగ్గర చేరిపోయాడు. 

పనే ధ్యాసగా: సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. ఆర్థికంగా స్థితిమంతులేం కాదు. కష్టపడటం తప్ప ఇతర మార్గం లేదని భావించాడు అమర్‌. అప్పటికే వర్మ దగ్గర ఐదారుగురు అసిస్టెంట్లు ఉండేవారు. తనకు చిన్నచిన్న పనులు చెబుతుండేవాళ్లు. వాళ్లంతా ఇంటికి వెళ్లిపోయిన తర్వాత అర్ధరాత్రుళ్లు కూర్చొని సొంతంగా ఎడిటింగ్‌ సాధన చేసేవాడు. ఈ కష్టపడే తత్వం వర్మకి నచ్చి, ముఖ్యమైన పనులు అప్పజెప్పేవారు. ఈ సమయంలోనే దూకుడు, ఆగడు, 1 నేనొక్కడినే, తీన్‌మార్, బాద్‌షాలాంటి పెద్ద సినిమాలతోపాటు 21 చిత్రాలకు అసోసియేట్‌ ఎడిటర్‌గా పని చేశాడు. 

మొదటి అవకాశం: దూకుడుకి పని చేస్తున్న సమయంలో ఆ సినిమా నిర్మాతలకు అమర్‌ పని తీరు నచ్చి వాళ్ల ఆఫీసులోనే ఒక ఎడిటింగ్‌ రూం ఏర్పాటు చేసి అందులో పని చేయమన్నారు. అక్కడే 1 నేనొక్కడినే చిత్రానికి పని చేశాడు. ఆ సమయంలోనే దర్శకుడు సుకుమార్‌తో పరిచయమైంది. ఆయన స్వయంగా నిర్మించిన ‘కుమారి 21 ఎఫ్‌’ సినిమాకు ఎడిటర్‌గా అవకాశం ఇచ్చారు. ఆరేళ్ల తర్వాత తన కల నెరవేరింది. తెరపై తన పేరు చూసుకున్నాడు. ఆపై రక్షకభటుడు, పెళ్లికి ముందు ప్రేమలేఖ, అమరం అఖిలం ప్రేమ, రాహువు, రాక్షసుడు.. తాజాగా రవితేజ నటించిన ఖిలాడీ సినిమాలకు పని చేశాడు. కల్యాణ్‌రామ్‌ డెవిల్, ఆది సాయికుమార్‌ బ్లాక్, సీఎస్‌ఐ సనాతన.. కన్నడ నటుడు ఉపేంద్ర నిర్మిస్తున్న సినిమా, మరో బెంగాలీ చిత్రం..ఇలా మరి కొన్నింటికి పని చేస్తున్నాడు.

నేను సినిమాల్లోకి వెళతా అన్నప్పుడు చాలామంది నవ్వారు. అవకాశాలు దొరక్క ఊరు తిరిగొచ్చినప్పుడు దగ్గరివాళ్లే చిన్నచూపు చూశారు. అది భరించలేక తాడోపేడో తేల్చుకోవాలనే కసితో మళ్లీ హైదరాబాద్‌లో అడుగు పెట్టా. మధ్యలో ఏదైనా పనిమీద ఊరొస్తే ఎవరికీ కనిపించకుండా రాత్రుళ్లు వచ్చి వెళ్తుండేవాణ్ని.  ఆపద సమయంలో  స్నేహితులే ఆదుకున్నారు. తర్వాత కష్టాలన్నీ గట్టెక్కి ఈ స్థాయికి వచ్చా. కానీ నా ఉన్నతస్థితిని చూడకుండానే మా నాన్న చనిపోవడం ఒక్కటే నాకు లోటు. నేనే కాదు.. ఎవరైనా, ఏ రంగంలో రాణించాలన్నా ఓపిక చాలా అవసరం. ఈ క్రమంలో లక్ష్యం చేరకుండా మనని వెనక్కి లాగే వాళ్లుంటారు. వాళ్లనసలే పట్టించుకోవద్దు. ఒక్కసారి విజయం సాధిస్తే.. డబ్బు, పేరు, అభిమానం.. మనల్ని వెతుక్కుంటూ వస్తాయి.

- బాలం గోపాల్,  న్యూస్‌టుడే, వేంపల్లె 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని