జోడీ నెంబర్‌ 1

కంబైన్డ్‌ స్టడీతో మార్కులు కొల్లగొట్టిన విద్యార్థుల్ని చూశాం. సివిల్స్‌ సాధించిన భార్యాభర్తల గాథలు విన్నాం. నటనతో తెరను ఏలుతున్న సినీ జంటల్ని చూస్తూనే ఉన్నాం. రుచి కల్రా, ఆశిష్‌ మహాపాత్ర వీళ్లందరికీ భిన్నం. ఈ యువ దంపతులు దేశంలోనే తొలిసారి ఒకేసారి ‘యూనికార్న్‌’ హోదా సాధించిన స్టార్టప్‌ వ్యవస్థాపకులు. రూ.వేలకోట్లకి ఎదిగే క్రమంలో ఎన్నో కష్టాల ముళ్లని దాటారు... ఆ ప్రయాణంలోని స్ఫూర్తిని అందిపుచ్చుకుంటే.. వాళ్లు చెబుతున్న కిటుకులు పట్టేస్తే.. యువత విజేతలవడం ఖాయం.

Published : 23 Apr 2022 01:20 IST

కంబైన్డ్‌ స్టడీతో మార్కులు కొల్లగొట్టిన విద్యార్థుల్ని చూశాం. సివిల్స్‌ సాధించిన భార్యాభర్తల గాథలు విన్నాం. నటనతో తెరను ఏలుతున్న సినీ జంటల్ని చూస్తూనే ఉన్నాం. రుచి కల్రా, ఆశిష్‌ మహాపాత్ర వీళ్లందరికీ భిన్నం. ఈ యువ దంపతులు దేశంలోనే తొలిసారి ఒకేసారి ‘యూనికార్న్‌’ హోదా సాధించిన స్టార్టప్‌ వ్యవస్థాపకులు. రూ.వేలకోట్లకి ఎదిగే క్రమంలో ఎన్నో కష్టాల ముళ్లని దాటారు... ఆ ప్రయాణంలోని స్ఫూర్తిని అందిపుచ్చుకుంటే.. వాళ్లు చెబుతున్న కిటుకులు పట్టేస్తే.. యువత విజేతలవడం ఖాయం.

నిస్సందేహంగా ఇది స్టార్టప్‌ల జమానా. సృజనాత్మక ఆలోచననే పెట్టుబడిగా అంకుర సంస్థలు పెట్టి, కోట్లకు పడగలెత్తుతున్న సృజనశీలురకు ఈ కాలంలో కొదవే లేదు. కానీ మీకో విషయం తెలుసా? ఏటా వేల స్టార్టప్‌లు పురుడు పోసుకుంటున్నా.. అందులో బతికి, ఎదుగుతున్నవి వేళ్లమీద లెక్కపెట్టగలిగినన్నే. ఇక ఏడున్నర వేల కోట్ల రూపాయలు దాటి ‘యూనికార్న్‌’లు అవుతున్నవి అతికొద్దే. వేర్వేరు అంకుర సంస్థలు ప్రారంభించి, ఆ హోదా అందుకున్న జంటే కల్రా, మహాపాత్రలు.
రుచి, ఆశిశ్‌ ఇద్దరూ ఐఐటీ పట్టభద్రులే. పట్టా అందుకోకముందే ఇద్దరికీ బహుళజాతి సంస్థల్లో కొలువులొచ్చాయి. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కొన్నేళ్లు ఉద్యోగం చేశారు గానీ.. వాళ్ల కలలు వేరు. సొంత కంపెనీ ప్రారంభించి, వందలమందికి ఉపాధి కల్పించాలనేది ఆశయం. ‘మెకిన్సే’లో ఉన్నప్పుడు ఆశయాలే కాదు.. వాళ్ల మనసులూ కలిశాయి. ఆరంకెల జీతం వదిలి బయటికొచ్చారు. ఎనిమిదేళ్లు దాచుకున్న మొత్తం.. స్నేహితులు, బంధువుల నుంచి తీసుకున్న అప్పులతో గురుగ్రామ్‌లో వేర్వేరు చోట్ల కార్యాలయాలు తెరిచారు. కార్పొరేట్‌ సంస్థల్లో పని చేసిన అనుభవం, పరిచయాలు కొంత ఉపయోగపడ్డా.. చిరు సంస్థలను వేల కోట్ల కంపెనీగా మలిచే క్రమంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు ఎన్నెన్నో.

గర్భిణిగానే..

ఆక్సిజన్‌, ఓజోన్‌ పదాల కలయికే ఆక్సిజో. రుచి సహ-వ్యవస్థాపకురాలు, సీఈవో. 2017లో మొదలైంది. చిన్న, మధ్యతరగతి కంపెనీలకు రుణాలు అందిస్తుందీ సంస్థ. వ్యయ ప్రయాసలు లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా తేలికగా లోన్లు అందించడం ప్రత్యేకత. సంస్థ ప్రారంభించినప్పుడు రుచి నిండు గర్భిణి. అయినా ఎడతెగకుండా బృంద చర్చల్లో పాల్గొనేది. సంస్థ విస్తరణ కోసం ఉద్యోగులతో ఆలోచనల మేధోమథనం చేసేది. పెట్టుబడుల కోసం నిత్యం ఇన్వెస్టర్ల చుట్టూ తిరిగేది. తన పట్టుదల, సంస్థ విస్తరణ అవకాశాలు చూసి ఆల్ఫా వేవ్‌ గ్లోబల్‌, టైగర్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌, నార్వెస్ట్‌ వెంచర్‌ పార్ట్‌నర్‌ అనే సంస్థలు 200 మిలియన్ల పెట్టుబడులు పెట్టాయి. రుచి ఇంక వెనుదిరిగి చూడలేదు. ఆరుగురితో మొదలైన ఈ సంస్థని 500 మందికి పైగా ఉద్యోగులకు పెంచింది. ఆక్సిజో ఇచ్చిన రుణాల ద్వారా 2,500పైగా సంస్థలు లబ్ధి పొందాయి. అంకుర సంస్థల ఎదుగుదలకు ఎన్నో ప్రతిబంధకాలుంటాయి. పెట్టుబడి, విస్తరణ, మార్కెట్లో నిలదొక్కుకోవడం లాంటివి. ఇవన్నీ దాటి, కొంత సమయం ఎదురుచూస్తేనే లాభాల బాట పడతారు. కానీ కంపెనీ మొదటి ఏడాది నుంచే అది సుసాధ్యం చేసి చూపించింది రుచి. ఆక్సిజో ఏడాదికి వందశాతం చొప్పున వృద్ధి సాధిస్తోంది.

73 సార్లు తిరస్కరణ

ఆఫ్‌ బిజినెస్‌.. గతంలో ‘ఓఎఫ్‌బీ టెక్‌ ప్రైవేట్‌’ పేరుతో ఉండేది. స్టీల్‌, డీజిల్‌, ఆహార, రసాయన పరిశ్రమలకు ముడి పదార్థాలు సరఫరా చేస్తుంది. చిన్న కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది. ఆఫ్‌ బిజినెస్‌ ఇప్పుడు వేల కోట్లకు ఎదిగినా.. ఒకప్పుడు పురిటి కష్టాలు అనుభవించిన సంస్థనే. 2016లో స్టార్టప్‌ మొదలుపెట్టినప్పుడు ప్రధాన అడ్డంకి విస్తరణకు డబ్బులు లేకపోవడమే. ఆశిష్‌ ఎంతోమంది ఇన్వెస్టర్ల చుట్టూ తిరిగేవాడు. బిజినెస్‌ మోడల్‌ బాగా లేదంటూ ఆరునెలల్లో 73 మంది ఇన్వెస్టర్లు డబ్బులు పెట్టడానికి నిరాకరించారు. దాంతో జీతాలు, మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఇబ్బందిగా ఉండేది. వ్యాపారం లేక కొన్నినెలలు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. ఖర్చులు తగ్గించుకునేందుకు భోజనాల్లో సైతం కోత విధించుకునేవాళ్లు. కార్లు వదిలి ఆటోల్లో ప్రయాణించేవాళ్లు. ఈ పరిస్థితుల్లోనూ తనపై నమ్మకం కోల్పోలేదు ఆశిష్‌. చివరికి ప్రముఖ పెట్టుబడుల సంస్థ ‘సాఫ్ట్‌బ్యాంక్‌’ అతడ్ని నమ్మింది. ఏకంగా 200 మిలియన్ల పెట్టుబడులు పెట్టింది. ఇది ఒక భారతీయ స్టార్టప్‌ అందుకున్న అతిపెద్ద మొత్తం. తర్వాత అంతా చరిత్రే. కంపెనీని పరుగులు పెట్టించాడు. రెండున్నర కోట్లతో మొదలైన సంస్థని ఆరేళ్లు తిరిగేసరికి ఎనిమిదివేల కోట్ల స్థాయికి చేర్చాడు.

అంకుర పాఠాలు
స్టార్టప్‌ అంటే వ్యాపారం కాదు.. కొత్త జీవితం. ఇది మొక్కుబడిగా కాకుండా నిష్టతో చేయాలి. తిండి, నిద్ర కూడా మర్చిపోయేంత ఇష్టం చూపించాలి. 
సరికొత్త బిజినెస్‌ మోడల్‌, ఎవరూ వెళ్లని దారిలో నడిస్తే సగం విజయం సాధించినట్టే. ఒకవేళ పోటీదారులు ఉన్నా తమకంటూ ఓ ప్రత్యేకత చూపించాలి.
ప్రణాళిక లేకుంటే విజయం కష్టం. ఏం చేయాలి? ఎప్పటిలోగా చేయాలి? వైఫల్యం ఎదురైతే రెండో మార్గం ఏంటి? ఇవన్నీ ముందే ప్రణాళికలు వేసుకోవాలి. 
వనరులను ఎంత పరిమితంగా వాడుకుంటే అంత ఎదుగుదల. ఉద్యోగంలా కాకుండా, కంపెనీ ఎదుగుదలలో నా పాత్ర ఉండాలని తపించే ఉద్యోగులను ఎంచుకోవాలి. 
అంకురసంస్థలో అధికారిలా పని చేస్తానంటే కుదరదు. నువ్వే యజమాని, నువ్వే నౌకరులా శ్రమించాలి. కష్టపడితే భవిష్యత్తు ఉంటుందని ఉద్యోగుల్లో నమ్మకం కలిగించాలి.
సవాళ్లను ఇష్టపడేవాళ్లనే విజయం వరిస్తుంది. కొత్త ప్రయోగాలు చేయాలి. అలాగని చేతులు కాల్చుకునేలా అతి చేయొద్దు. ఆచితూచి అడుగేయాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు