Updated : 07 May 2022 04:55 IST

టెక్‌ బాట.. జీవితం పూలతోట!

ఇన్‌స్టా తెరవకుండా కుర్రకారుకి రోజు గడవదు! దాన్ని ఎన్నో కుటుంబాల బతుకుదెరువు బాగుచేసే వారధిగా మలిచాడు వరంగల్‌ యువకుడు కిరణ్‌ చిప్పా. అమెజాన్‌లో వస్తువులు కొనని యువత అరుదే! ఈ ఈ- కామర్స్‌ వెబ్‌సైట్‌ని తన ప్రతిభ సొమ్ములు చేసుకొనే వేదిక చేసుకున్నాడు ఆదిలాబాద్‌ యువకుడు మడావి రాజేశ్వర్‌. వాడే తీరు మారితే సామాజిక మాధ్యమాలు, టెక్నాలజీ కాసులు కురిపించే మార్గమవుతాయని నిరూపించారు ఈ ఇద్దరు యువకులు.

చేనేత కళకి అంతా సలాం కొడతారు. కానీ ఆ నేతకారుల బతుకులు మాత్రం వెలవెలబోతూనే ఉంటాయి. సంప్రదాయానికి టెక్నాలజీ జోడించి ఈ రాతను స్వయంగా మార్చుకున్నాడు వరంగల్‌ యువకుడు కిరణ్‌ చిప్పా. ఆ అడుగు మరికొన్ని కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది.


ఇన్‌స్టాతో మారిన బతుకు

కిరణ్‌ది సంప్రదాయ చేనేత కుటుంబం. తను మాత్రం చదువుల్లో చురుగ్గా ఉండేవాడు. ఎంటెక్‌ పూర్తవగానే ఓ నిర్మాణ సంస్థలో కొలువులో చేరాడు. కొన్నాళ్లకే కొవిడ్‌ విజృంభించింది. లాక్‌డౌన్‌లో జీతాలు ఇవ్వలేమని చేతులెత్తేసింది కంపెనీ. మరోవైపు కరోనాతో చేనేత కార్మికులూ తీవ్ర ఇబ్బందులు పడటం గమనించాడు. వాళ్లు నేసిన దరీస్‌ (తివాచీలు) కొనేవారు లేక అందరి ఇళ్లలో గుట్టలకొద్దీ పేరుకుపోయేవి. ఈ సమయంలో కిరణ్‌ సామాజిక మాధ్యమ ఉద్యమం ప్రారంభించాడు. ‘చేనేతకు చేయూతనివ్వండి’ అంటూ నాన్న వెంకటేశంతో కలిసి పోస్టులు పెట్టడం ప్రారంభించాడు. భౌగోళిక గుర్తింపు పొందిన వరంగల్‌ కొత్తవాడ దరీస్‌ ప్రత్యేకతలు వివరించేవాడు. దీనికి మంచి స్పందన వచ్చి, విదేశాల నుంచీ ఆర్డర్లు రాసాగాయి. దీంతో తనతోపాటు చుట్టుపక్కల కొంతమంది కుటుంబాలకు చేతి నిండా పని దొరికింది. ఈక్రమంలో తనకి అవగతమైన పరిస్థితులు ఏమంటే.. మూసకి భిన్నంగా, కొత్త డిజైన్లతో వెళితే చేనేత వస్త్రాలు కొనడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. వారికి దగ్గరవడానికి మరింత సృజనాత్మకత జోడించాలనుకున్నాడు. చివరికి తాను ఆటో క్యాడ్‌ కోర్సులో నేర్చుకున్న డిజైన్లను తివాచీలపై వేయడం మొదలు పెట్టాడు. ఇవిగాక పిల్లలు ఇష్టపడే మిక్కీమౌజ్‌లాంటి బొమ్మలు, కార్టూన్‌ పాత్రలు, సీతాకోకచిలకలు, పూలు, జంతువులు.. ఇలా భిన్న రకాలుగా ప్రయత్నించాడు. వీటన్నింటితో ‘అవర్‌ వీవర్‌ హౌజ్‌’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ప్రారంభించాడు. కొద్దిరోజుల్లోనే వేలమంది ఫాలోయర్లు వచ్చారు. ఈ డిజైన్లు నచ్చి ఇతర రాష్ట్రాలతోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్‌, దుబాయ్‌ దేశాల నుంచీ ఆన్‌లైన్‌లో ఆర్డర్లు రాసాగాయి. తను డిజైన్లు రూపొందించి, ఇతరులతో పని చేయిస్తూ.. చుట్టుపక్కల కుటుంబాల వారికీ ఉపాధి కల్పిస్తున్నాడు. ‘ఉద్యోగం చేస్తే నేనొక్కడినే లాభపడేవాడిని. భిన్నంగా ఆలోచించడంతో నాతోపాటు ఇంకొందరు బాగుపడటం సంతోషంగా ఉందం’టున్నాడు కిరణ్‌.

- గుండు పాండురంగశర్మ, వరంగల్‌


అమెజాన్‌తో ఆదరువు

పోడు వ్యవసాయం తప్ప మరో ఉపాధి ఎరుగని కుమురం భీం జిల్లా రాసిమెట్ట అనే పల్లెలో పుట్టిపెరిగాడు రాజేశ్వర్‌. పూట గడవడానికి రోజూ బతుకు పోరాటం చేసే పేద కుటుంబం. పచ్చని చెట్లు.. సంస్కృతీ, సంప్రదాయాలనే చిత్రాలుగా గీయడం మొదలు పెట్టాడు. ఆ ప్రతిభనే అమెజాన్‌లో పెట్టి ఆర్థిక సుడిగుండాలు ఈదాడు.

 

నకి ఊహ తెలిసే సమయానికే చుట్టూ ఉన్న పరిసరాలనే బొమ్మలుగా వేసేవాడు రాజేశ్వర్‌. అతడి ప్రతిభను గురువు ఆనంద్‌రావు గుర్తించి వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఇంటర్‌ పూర్తవగానే ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సు చేయమని సలహా ఇచ్చారు. ఆ మాటతో 2016లో తొలిసారి కుమురం భీం జిల్లా దాటి హైదరాబాద్‌లో అడుగు పెట్టాడు. జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఉచిత సీటు సంపాదించాడు. కానీ పుస్తకాలు, రోజువారీ ఖర్చులకు సైతం డబ్బుల్లేని పరిస్థితి. ‘ఇతరుల నుంచి ఆశించడం ఎందుకు? నీ గిరి కళనే చిత్రాలుగా వేసి, దాన్నే ఆదాయంగా మార్చుకోవచ్చు కదా’ అంటూ గిరిజన సంక్షేమశాఖ అధికారులు సలహా ఇచ్చారు. దాంతో కుంచె అందుకున్నాడు. ఒకవైపు చదువుకుంటూనే ఏమాత్రం ఖాళీ దొరికినా తన ఊహలకు ప్రాణం ఇచ్చేవాడు. ఊరి పండగలు, పల్లె వాతావరణం, గోండుల జీవనశైలి, మూగజీవాలు.. వీటన్నింటినీ వర్ణచిత్రాలుగా మలిచి అమెజాన్‌లో అమ్మకానికి పెట్టాడు. అవన్నీ జీవకళ ఉట్టిపడే చిత్రాలు కావడంతో హాట్‌కేకుల్లా అమ్ముడయ్యేవి. అలా నాలుగేళ్లలో దాదాపు రెండువేల చిత్రాలు గీసి రూ.6 లక్షలు సంపాదించాడు. ఎవరిపై ఆధారపడకుండా కోర్సు పూర్తి చేశాడు.

తను లాభపడటమే కాదు.. తనకున్న అరుదైన ప్రతిభతో ఇతరుల జీవితాలూ మారాలని తపిస్తున్నాడు రాజేశ్వర్‌. ప్రభుత్వ వసతిగృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు ఏడాదిలో మూడునెలల పాటు ఉచితంగా చిత్రలేఖనం, గోండు కళలపై శిక్షణనిస్తున్నాడు. వాళ్లకి అవసరమైన సామగ్రి ఖర్చు సొంతంగా భరించి అందజేస్తున్నాడు. జైనూర్‌, సిర్పూర్‌(యు) మండలాల్లోని 74 మంది విద్యార్థులు తన దగ్గర తర్పీదు పొందారు. దిల్లీలో 2019లో ‘కృష్ణ ఆర్ట్‌ జోన్‌’ అధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో మొదటి బహుమతి దక్కించుకున్నాడు రాజేశ్వర్‌. అంతకుముందు ఏడాది గిరిజన సంక్షేమశాఖ నుంచి ‘కుమురం భీం’ అవార్డు అందుకున్నాడు.

 - చొక్కాల రమేశ్‌, ఆసిఫాబాద్‌


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts