Published : 21 May 2022 00:54 IST

వెతలు దాటి పాటల యాత్ర

సెక్యూరిటీగార్డుగా పని చేస్తూనే సరిగమల సాధన చేశాడు. డెలివరీ బాయ్‌గా మారినా అక్షర సేద్యం ఆపలేదు. కష్టాలు వెనక్కి లాగుతున్నా కలను, కలాన్ని వదల్లేదు. తొమ్మిదేళ్లు అలుపెరుగక శ్రమించి పాటల రచయిత కావాలనే స్వప్నం నెరవేర్చుకున్నాడు... ఆ యువకుడే కామారెడ్డి జిల్లా మల్కాపూర్‌ యువకుడు  శ్రీ సిరాగ్‌.

‘తోడు వీడి పాదం.. తీరం చేరే...’ ఈమధ్య కాలంలో యువత సెల్‌ఫోన్లలో విపరీతంగా వినిపిస్తోన్న సాంగ్‌. ప్రతి మదిని తట్టిన ఈ పాట అక్షరాలను అల్లింది శ్రీ సిరాగ్‌నే. తను ఈ గుర్తింపు అందుకోవడం వెనక ఓ ట్రాజెడీ సినిమాకి సరిపడేంత కథ ఉంది.

సిరాగ్‌కి సినీ నేపథ్యం లేదు. ఆస్తిపాస్తులు అంతకన్నా లేవు. తను కడుపులో ఉండగానే నాన్న ఇల్లొదిలి వెళ్లిపోయాడు. బిడ్డే సర్వస్వంగా బతికింది ఆ తల్లి. డిగ్రీ దాకా వసతి గృహాల్లో ఉంటూ, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివాడు. టీవీల్లో చూస్తూ పాటపై మమకారం పెంచుకున్నాడు.  మనసు పెట్టి పాడుతూ బహుమతులు గెల్చుకున్నాడు. తను బాగా పాడటం చూసి సంగీతం నేర్చుకొమ్మని కొందరు సలహా ఇచ్చారు. ఒక టీచరు దగ్గర మూడేళ్లు శిష్యరికం చేశాడు. 2013లో డిగ్రీ పూర్తవగానే గాయకుడిగా సత్తా చాటాలని హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. ‘ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌’ అంటూ చాలామంది సంగీత దర్శకుల చుట్టూ తిరిగాడు. ‘ప్రముఖుల దగ్గర సంగీతం నేర్చుకున్నావా?’, ‘ఏ షోలో పాల్గొన్నావు?’ ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి తప్ప అవకాశం ఇచ్చినవారు లేరు. మరోవైపు ఇల్లు గడిచే పరిస్థితి లేదు. రాత్రిపూట ఏటీఎంలలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తూ పగలంతా అవకాశాల కోసం వెతికేవాడు. తర్వాత స్విగ్గీలో డెలీవరీ బాయ్‌గా పని చేశాడు. నాలుగేళ్లయ్యాక ఓసారి ‘రేలారే రేలా’ అనే టీవీ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది. కానీ ఆ సమయానికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేక దాన్నీ చేజార్చుకున్నాడు. చివరికి 2019లో ఒక ఛానెల్‌లో వ్యాఖ్యాతగా చేరాడు. ఆర్జేగా పని చేశాడు. ఇవన్నీ చేస్తూనే తెలుగు యూనివర్సిటీలో ఎం.ఎ. మ్యూజిక్‌  పూర్తి చేశాడు.

సిరాగ్‌కి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే ప్రాణం. ఆయన పాటలు పాడుతూ చాలా బహుమతులు అందుకున్నాడు. సింగపూర్, మలేసియా, దుబాయ్, అండమాన్‌లలో ప్రదర్శనలు ఇచ్చాడు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొని యూనివర్సిటీ తరపున బహుమతులు గెలుచుకున్నాడు. ఇంత చేసినా గాయకుడిగా అవకాశాలు రాకపోవడంతో.. పంథా మార్చాడు. గొంతు సవరించుకోవడం మానేసి, కలం అందుకొని పాటలు రాయడం మొదలు పెట్టాడు. 2018లో ‘క్షణమొక యుగం’ అనే షార్ట్‌ఫిల్మ్‌కి ‘మెరిసే నయనాల’ పాట రాశాడు. దీనికి బాగా పేరొచ్చినా.. పెద్దగా అవకాశాలు రాలేదు. ఏడాదిపాటు ఖాళీ. తర్వాత ‘సుమనోహరం’లో రాసిన పాట సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్‌ చేతుల మీదుగా విడుదలైంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 20 సినిమాల్లో 50 వరకు సాంగ్స్‌ రాశాడు. అంతా కుదురుకుంటోంది అనుకుంటుండగానే కరోనా దెబ్బ కొట్టింది. అవకాశాలు తగ్గడం, పాటలు రాయించుకున్నవారు డబ్బులివ్వకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఆ సమయంలో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ బృంద సభ్యులు సురేష్, వికాస్‌లు అండగా నిలిచారు. దాంతో చెన్నైకి వెళ్లిపోయాడు. పాటలతోపాటు వాణిజ్య ప్రకటనలకు రాయడం మొదలుపెట్టాడు. సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌లో పూజా హెగ్డే బుట్టబొమ్మ ప్రకటన, చెన్నై షాపింగ్‌ మాల్, ఆర్‌.ఎస్‌. బ్రదర్స్, రామ్‌రాజ్‌ కాటన్స్, ఉదయనిధి బనియన్స్‌.. ఇలా 20 వరకూ వాణిజ్య ప్రకటనలకు కలం కదిల్చాడు. ప్రస్తుతం ఆహా ఓటీటీలో యువతని బాగా ఆకట్టుకుంటున్న హలో జూన్, పోయే ఏనుగు పో అనే సినిమాలకు సింగిల్‌ కార్డు అవకాశం దక్కించుకున్నాడు. ఎవరి అండదండలూ లేకున్నా.. కేవలం సంగీతంపై మమకారంతో తొమ్మిదేళ్ల నిరీక్షణ అనంతరం తను అనుకున్నది సాధించాడు సిరాగ్‌.

సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ కోసం రాసిన ‘రాక్‌స్టార్‌ ఏంథెమ్‌..’, కరోనా సమయంలో జనం పద్ధతి మారాలంటూ రాసిన ‘మారాలి..’, తెలంగాణ పోలీసుల కోసం ‘జయహో పోలీస్‌..’ ప్రశంసలందుకున్నాయి. ‘నీ పాటలు హృద్యంగా ఉంటాయ’ని సిరివెన్నెల సీతారామశాస్త్రి, చిత్ర, ఎస్‌.ఎస్‌.తమన్‌లు మెచ్చుకున్నారు. 

- భూపతి సత్యనారాయణ, ఈజేఎస్‌


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని