ఈ దూకుడు.. ఆగదు గురూ!

కార్తీక్‌ సొంతూరు వరంగల్‌. పుట్టి పెరిగిందేమో హైదరాబాద్‌లోనే. అందరు కుర్రాళ్లలాగే టీనేజీలోనే ఇంట్లో వాళ్లకు తెలియకుండా మోటార్‌సైకిల్‌పై షికారు చేసేవాడు. కొత్త మోడల్‌ కనిపిస్తే చాలు.. రయ్‌రయ్‌మనిపించేవాడు. కిందపడి దెబ్బలు తిన్నా,

Updated : 28 May 2022 06:51 IST

కార్తీక్‌ మాటేటి.
ఓ నిఖార్సైన రేసర్‌...
చేతిలో యాక్సిలరేటర్‌ ఉంటే చెలరేగిపోతాడు...
బండి ఇంజిన్‌ శబ్దం వింటే మైమరిచిపోతాడు...
ఈ మోజే తనని రేసింగ్‌ రారాజుని చేసింది.

కార్తీక్‌ సొంతూరు వరంగల్‌. పుట్టి పెరిగిందేమో హైదరాబాద్‌లోనే. అందరు కుర్రాళ్లలాగే టీనేజీలోనే ఇంట్లో వాళ్లకు తెలియకుండా మోటార్‌సైకిల్‌పై షికారు చేసేవాడు. కొత్త మోడల్‌ కనిపిస్తే చాలు.. రయ్‌రయ్‌మనిపించేవాడు. కిందపడి దెబ్బలు తిన్నా, చుట్టుపక్కలవాళ్లు చీవాట్లు పెట్టినా బండి వదిలేవాడు కాదు. ఇంజినీరింగ్‌లో స్నేహితుల ప్రోద్బలంతో బైక్‌ స్టంట్స్‌ కూడా నేర్చుకున్నాడు. ఈ క్రమంలో రేసింగ్‌ ట్రాక్‌, పోటీల గురించి తెలిసింది. స్థానికంగా ఉన్న ఓ రేసింగ్‌ బృందంలో చేరాడు. గోకార్టింగ్‌ ట్రాక్‌పై సాధన చేశాడు. నాలుగేళ్లలో 150 రేసుల్లో పాల్గొంటే వందకుపైగా పోడియంలు గెల్చుకున్నాడు. గస్టో రేసింగ్‌ ఇండియా బృందంలో మేటి రేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

పద్దెనిమిదేళ్ల వయసులో తొలి పోటీకెళ్లాడు కార్తీక్‌. ఫిట్‌నెస్‌, ట్రాక్‌పై ప్రదర్శన, ల్యాప్‌ సమయం, రెండు రౌండ్ల ఇంటర్వ్యూలు.. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తనని ఎంపిక చేశారు. 900 మీటర్ల ల్యాప్‌ను 49 సెకన్లలోనే పూర్తి చేయడంతో సుజుకీ గిక్సర్‌ కప్‌ ఓపెన్‌ ఛాంపియన్‌షిప్‌నకు తొలి ప్రయత్నంలో ఎంపికయ్యాడు. 2018లో 165 సీసీ ఛాంపియన్‌గా, టీవీఎస్‌ వన్‌మేక్‌ నొవిస్‌ ఛాంపియన్‌గా.. నిలిచాడు. ఒక రౌండ్‌ మిగిలి ఉండగానే ఈ రేస్‌ పూర్తి చేశాడు. దీంతో ఆసియా కప్‌లో భారత్‌ తరపున ప్రాతినిధ్యం వహించేందుకు వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ అందుకున్నాడు. దిల్లీలోని ‘బుద్ధ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌’లో జరిగిన ఈ పోటీల్లో భారత్‌ రన్నరప్‌గా నిల్చింది. 2019లో 300-400 సీసీ బైకులతో ఐఎన్‌ఎంఆర్‌సీ ప్రొ స్టాక్‌లో పాల్గొని ఫ్యాక్టరీ రేసర్లతో పోటీపడి రన్నరప్‌ అయ్యాడు. టీవీఎస్‌ ఆర్‌ఆర్‌ 310 కప్‌ ఓపెన్‌కు ఎంపికై పొడియం గెల్చుకున్నాడు. ఫ్యాక్టరీ రేసర్లతో పోటీపడటం ఆషామాషీ కాదు. కంపెనీలు తమ రేసర్లకు మేటి శిక్షణనిస్తాయి. ఖరీదైన మోటార్‌సైకిళ్లను ఇస్తాయి. వీళ్లను బరిలోకి దించడానికి కోట్ల రూపాయల ఖర్చు చేస్తాయి. కార్తీక్‌ వాళ్లతో పోటీ పడి గెలవడం విశేషం.

అంతర్జాతీయ రేసింగ్‌లో పాల్గొనడం ఖరీదైన వ్యవహారం. మోటార్‌సైకిల్‌, ప్రత్యేకమైన డ్రెస్‌, శిక్షణ.. అన్నింటికీ కలిపి రూ.80 లక్షల వరకు ఖర్చవుతుంది. అది భరించే స్తోమత లేకపోవడంతో రేసింగ్‌ కోసమే అమెరికాలో మాస్టర్స్‌ చేసేందుకు కార్తీక్‌ సిద్ధమవుతున్నాడు. అక్కడ శిక్షణ తీసుకుని భారత్‌ తరపున ప్రాతినిధ్యం వహించాలని కలలు కంటున్నాడు. ప్రభుత్వం, స్పాన్సర్లు చేయూతనిస్తే మరింత మెరుగైన ప్రదర్శన ఇస్తానంటున్నాడు.

- మల్లేపల్లి రమేశ్‌రెడ్డి, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు