Updated : 04 Jun 2022 09:08 IST

లెక్కలతో.. లెక్కలేనంత గుర్తింపు!

ఆరేళ్ల వయసులో జరిగిన ప్రమాదంతో ఏడాదిపాటు మంచానికే పరిమితమయ్యాడు. ఆ సమయంలో సరదాగా మొదలైన అలవాటు ‘మైండ్‌ స్పోర్ట్స్‌ ఒలింపియాడ్‌’లో బంగారు పతకం నెగ్గేలా చేసింది. ఆపై గణిత మేధావి శకుంతలాదేవి రికార్డులను బద్దలుకొట్టి ప్రపంచంలోనే వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌గా పేరు సాధించాడు. తాజాగా ‘ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 ఆసియా క్లాస్‌ ఆఫ్‌ 2022’ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. లెక్కల్లో దిట్టగా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ప్రశంసలందుకుంటున్న ఆ హైదరాబాదీ జొన్నలగడ్డ నీలకంఠ భానుప్రకాశ్‌. తన ప్రయాణం, విద్యార్థులకు చేరువ అవుతున్న ప్రయత్నాల్ని ‘ఈతరం’తో పంచుకున్నాడు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నలుగురిలో ముగ్గురికి గణితం అంటే భయం. విద్యార్థులకు లెక్కలు నేర్పించే మెరుగైన విధానం ఉంటే, వణుకు పోగొట్టేలా ఉపాధ్యాయులు బోధిస్తే.. గణితం అందరికీ ఇష్టమైన సబ్జెక్టుగా మారుతుందంటాడు భాను. ఆ ప్రయత్నంలోనే ముందుకెళ్తున్నాడు.

భాను ఆరేళ్ల వయసులో ఓ ప్రమాదం బారిన పడ్డాడు. ఏడాదిపాటు మంచంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో తనకి బోర్‌ కొట్టకుండా అమ్మనాన్నలు పజిల్స్, గణితంలో సమస్యలు సాధన చేయడం అలవాటు చేశారు. అనారోగ్యం నుంచి కోలుకున్నాక కూడా దాన్ని వదల్లేదు. వేగంగా లెక్కలు చేయడంపై సాధన చేశాడు. 14 ఏళ్లు వచ్చేసరికి లిమ్కా బుక్, ప్రపంచ రికార్డులు సాధించాడు. అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లు గెలిచాడు. 

ఆలోచనల అంకురం: అపారమైన మేధతో అలవోకగా లెక్కలు సాల్వ్‌ చేయగలిగే భాను.. ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చాడు. కొన్నాళ్లకి ఈ షోలతో ఎక్కువమంది విద్యార్థులను ప్రభావితం చేయలేకపోతున్నానేమో అన్న అనుమానం అతడిలో కలిగింది. ఓ సంస్థ ప్రారంభించి నేరుగా పాఠాలు చెప్పగలిగితే కోట్ల మందికి చేరువ కావొచ్చు అని భావించాడు. ఆ ఆలోచన నుంచే ‘భాన్జు’ స్టార్టప్‌ మొదలైంది. పిల్లలకు మ్యాథ్స్‌ ఫోబియా పోగొట్టి, వాళ్లలో ఆసక్తి పెంచేలా 30-40 రకాల ప్రాజెక్టులతో పాఠ్య ప్రణాళిక రూపొందించాడు. ఇవి ఆడుతూ, పాడుతూ గణితం నేర్చుకునేలా ఉంటాయి. దాంతోపాటు 5 నుంచి 15 ఏళ్ల వయసున్న పిల్లలందరికీ ఉపయోగపడేలా కార్యక్రమాలు రూపొందించాడు. లైట్‌స్పీడ్‌ వెంచర్స్‌ అనే సంస్థ ఇందులో రూ.15 కోట్లు పెట్టుబడి పెట్టింది.

చేరువవుతూ: రెండేళ్లలో తరగతులు, ప్రదర్శనలతో 20లక్షల మందికి చేరువయ్యాడు భాను. మరుసటేడే హైదరాబాద్‌తోపాటు బెంగళూరుకి విస్తరించాడు. ముప్ఫై మందితో మొదలైన సంస్థలో ప్రస్తుతం 300 మంది పని చేస్తున్నారు. వీరంతా పిల్లల్లో మ్యాథ్స్‌లో భయం పోగొట్టడంపై పనిచేస్తున్నారు. 120 మంది శిక్షకుల సాయంతో విద్యార్థులు వేగంగా గణితం చేసేలా తర్ఫీదునిస్తున్నారు. ఆరు నెలల్లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, పంజాబీ, బెంగాలీ వంటి ప్రధాన ప్రాంతీయ భాషలలో ఆన్‌లైన్‌ కోర్సులు తీసుకురాబోతున్నాడు. ఇతర విద్యాసంస్థలకు భిన్నంగా గణితాన్ని ఒక సబ్జెక్టులా కాకుండా ‘మైండ్‌ స్పోర్ట్స్‌’గా ప్రోత్సహిస్తున్నాడు. ‘భాన్జు’ని ప్రపంచంలో అతిపెద్ద గణిత విద్య స్టార్టప్‌గా మార్చడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు భాను. సింగపూర్, సౌదీఅరేబియా, మలేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికాల్లోనూ విస్తరిస్తున్నాడు. దీంతోపాటు మనదేశంలో గణితంపై పట్టు ఉన్న అధ్యాపకులకు కొరత లేదు. వాళ్లకి అవకాశం దక్కేలా మూడేళ్లలో నాలుగువేల మందికి ఉద్యోగాలు కల్పిస్తా అంటున్నాడు.      

‘మన దేశంలో అంకుర సంస్థల వ్యవస్థ ప్రారంభ దశలోనే ఉంది. ఉద్యోగాల కల్పనలో వీటి వాటా ఆరుశాతం లోపే. అమెరికాలో అది 35 శాతం దాటింది. ఇందులో అత్యధికం ఐటీ, టెక్‌ అంకురసంస్థలే. భారత్‌లో అంతకుమించి కొలువులు రాబోతున్నాయి. కష్టపడే యువత అంకురసంస్థల్లోనే అవకాశాలు, ఎదుగుదల ఉంటాయని గ్రహించాలి. సృజనాత్మకతో ముందుకు సాగాలి’.

‘పిల్లల్లో గణిత భయాలు పోగొట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా 500 ప్రదర్శనలు చేశాను. 23 దేశాలు తిరిగాను. 1,500 తరగతులు చెప్పాను. లాక్‌డౌన్‌కి ముందు తెలంగాణలో టీ-శాట్‌తో కలిసి 20లక్షల మంది పిల్లలకు ఉచితంగా ఆన్‌లైన్‌ తరగతులు చెప్పాను’. 

 - యార్లగడ్డ అమరేంద్ర, హైదరాబాద్‌


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని