ఒంటి కాలితో..విజయాల పంట!

ప్రమాదంలో కాలు తీసేశారు.. అధైర్య పడలేదు! విలువిద్య, సైక్లింగ్‌లో రాటుదేలాడు...ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి.. చలించలేదు!   హోటల్‌లో పని చేస్తూ గట్టెక్కాడు... ప్రతిభ నిరూపించుకుందామనుకుంటే కరోనా అడ్డొచ్చింది... నమ్మకం కోల్పోలేదు!

Updated : 16 Jul 2022 11:56 IST

ప్రమాదంలో కాలు తీసేశారు.. అధైర్య పడలేదు! విలువిద్య, సైక్లింగ్‌లో రాటుదేలాడు...ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి.. చలించలేదు!   హోటల్‌లో పని చేస్తూ గట్టెక్కాడు... ప్రతిభ నిరూపించుకుందామనుకుంటే కరోనా అడ్డొచ్చింది... నమ్మకం కోల్పోలేదు! అవకాశం రాగానే సత్తా చూపించి అంతర్జాతీయ పతకాలు కొల్లగొట్టాడు! తనే నంద్యాల యువకుడు షేక్‌ అర్షద్‌.

సెలవులొస్తే.. తోబుట్టువులతో సరదాగా గిల్లికజ్జాలు.. చుట్టాలింటికి వెళ్లిరావడం.. చిన్నారి అర్షద్‌ జీవితం సంతోషంగా సాగిపోతుండేది. ఓసారలాగే బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఎడమకాలు మోకాలి వరకూ తొలగించారు వైద్యులు. కన్నవాళ్లు తల్లడిల్లిపోయారు. ఆ షాక్‌ నుంచి కోలుకొని, కొడుకుకి ధైర్యం చెబుతూ కంటికి రెప్పలా కాపాడుకున్నారు. బాలుడు యువకుడయ్యాడు. తన లోపాన్ని తేలిగ్గా తీసుకుని విలువిద్య, దేహదారుఢ్యం, పారాసైక్లింగ్‌ నేర్చుకోసాగాడు. ఈలోపు కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. అమ్మానాన్నల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, డిగ్రీ మధ్యలోనే ఆపేశాడు. ఓ హోటల్‌లో రిసెప్షనిస్ట్‌గా చేరాడు. మరోవైపు హైదరాబాద్‌లోని ఆదిత్య మెహతా ఫౌండేషన్‌లో చేరి ఏడాదిపాటు పారాసైక్లింగ్‌లో కఠినమైన శిక్షణ పొందాడు. ఈ ఆటలో అంతర్జాతీయస్థాయిలో రాణించి కుటుంబానికి అండగా నిలవాలనేది అర్షద్‌ ఆశయం. కానీ దురదృష్టవశాత్తు అప్పుడే కరోనా విరుచుకుపడటంతో అన్నిరకాల పోటీలు వాయిదా పడ్డాయి. ఈ సమయాన్ని వృథా చేయకూడదని కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ 43 రోజుల్లో సైకిల్‌యాత్ర పూర్తిచేశాడు. మాదకద్రవ్యాల వినియోగం వద్దంటూ హైదరాబాద్‌ నుంచి గోకర్ణ వరకూ సైకిల్‌యాత్ర చేపట్టాడు. చెన్నై నుంచి పాండిచ్చేరి వరకూ కరోనా టీకాల అవగాహన ర్యాలీలో పాల్గొన్నాడు. పరిస్థితులు సద్దుమణగడంతో గతనెలలో దిల్లీలో పదో అంతర్జాతీయ పారాసైక్లింగ్‌ పోటీలు నిర్వహించారు. రాకరాక వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టి.. రెండు పతకాలు సాధించాడు అర్షద్‌.
ఇతర క్రీడల్లోనూ..
ఏడోతరగతిలోనే అర్షద్‌కి ప్రమాదం జరిగింది. డిగ్రీ వరకైనా చదివితే దివ్యాంగుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనే భావనతో అర్షద్‌ తండ్రి అతడిని చదువుకోమంటూ ప్రోత్సహించాడు. ఒక వైద్యుడి సూచనతో క్రీడల్లోనూ పాల్గొనేవాడు. 2011లో విజయవాడలో డిగ్రీలో చేరాక స్పోర్ట్స్‌ అకాడెమీకి వెళ్లాడు. అక్కడ వేర్వేరు క్రీడాంశాల్లో శిక్షకులు అర్షద్‌ను పరీక్షించారు. విలువిద్య నేర్చుకుంటే రాణిస్తావని చెప్పారు. చదువుకుంటూనే సాధన చేస్తూ రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో వరుసగా నాలుగేళ్లు పాల్గొన్నాడు. ఏడు జాతీయ పతకాలు, రెండు ఆసియా స్థాయి పతకాలు సాధించాడు. ఝార్ఖండ్‌లో 2013లో నిర్వహించిన విలు విద్యపోటీల్లో రెండు పతకాలు సాధించాడు. ఆ క్రీడలో పతకాలు వచ్చేవిగానీ నగదు బహుమతులు పెద్దగా ఉండేవి కావు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడటంతో 2015లో మళ్లీ నంద్యాలకు తిరిగొచ్చాడు. ఓ ఆసుపత్రిలో పనికి కుదిరాడు. విలువిద్య అభ్యాసం చేస్తున్నప్పుడు దేహదారుఢ్యంపైనా అర్షద్‌ దృష్టి సారించడంతో ఆసుపత్రిలో పనిచేస్తున్నవారు బాడీబిల్డింగ్‌ పోటీల్లో పాల్గొనమని సలహా ఇచ్చారు. అందులోనూ ప్రతిభ చూపి మిస్టర్‌ రాయలసీమ, మిస్టర్‌ ఆంధ్ర టైటిల్స్‌ గెలిచాడు.  
నాన్న తోడుగా..
అర్షద్‌ చదువుకునే రోజుల్లో సైకిల్‌పైనే వెళ్లాల్సి వచ్చేది. కానీ సైకిల్‌ తొక్కాలంటే రెండు కాళ్లుండాలి. అతడి ఇబ్బంది గమనించిన తండ్రి ఒంటికాలితో సైకిల్‌ తొక్కడం నేర్పించాడు. ఈ అనుభవం హైదరాబాద్‌లో ఆదిత్యమెహతా ఫౌండేషన్‌లో చేరినప్పుడు బాగా ఉపయోగపడింది. ఒంటికాలితో వేగంగా సైకిల్‌ తొక్కుతున్న అర్షద్‌ను గమనించిన ఆదిత్య మెహతా ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. దాంతో రెండేళ్ల క్రితం కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు పారా సైక్లింగ్‌ యాత్రకు ఎంపికయ్యాడు. దీంట్లో సాధన చేస్తూనే ఈ ఏడాది మార్చిలో తజకిస్తాన్‌లో జరిగిన పారా సైక్లింగ్‌ పోటీల్లో నాలుగోస్థానం సాధించాడు. తాజాగా దిల్లీలో నిర్వహించిన పదో అంతర్జాతీయ పారా సైక్లింగ్‌ పోటీల్లో రజత, కాంస్య పతకాలు సాధించిన తొలి తెలుగు యువకుడయ్యాడు.
  

‘శారీరక అవకరం కన్నా మానసిక వైకల్యం దుర్భరమైంది. ఎన్ని కష్టాలున్నా యువత ఏదైనా సాధించగలమనే నమ్మకం కోల్పోవద్దు. లక్ష్యం, దానికి సరైన ప్రణాళిక, పట్టువదలని కష్టం తోడైతే ఏదైనా సాధ్యమే. పద్దెనిమిదేళ్ల కిందట కాలు కోల్పోయినా.. నేనెప్పుడూ ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తే వచ్చే ఏడాది ప్యారిస్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకంతో తిరిగొస్తా’.

- బి.సునీల్‌ కుమార్‌, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని