చాయ్‌వాలా.. సంపాదన రూ.4 కోట్లు

టీకొట్టు పెడితే చీప్‌గా చూశారు. చిల్లర వ్యాపారమని నిందించారు. అదే చాయ్‌తో కోట్ల రూపాయలు పోగేస్తున్నాడు ప్రఫుల్‌ బిల్లోర్‌. ‘ఎంబీఏ చాయ్‌వాలా’గా అతడి పేరు దేశమంతా మార్మోగిపోతోంది.‘బాగా సంపాదించాలి..

Updated : 23 Jul 2022 09:21 IST

టీకొట్టు పెడితే చీప్‌గా చూశారు. చిల్లర వ్యాపారమని నిందించారు. అదే చాయ్‌తో కోట్ల రూపాయలు పోగేస్తున్నాడు ప్రఫుల్‌ బిల్లోర్‌. ‘ఎంబీఏ చాయ్‌వాలా’గా అతడి పేరు దేశమంతా మార్మోగిపోతోంది.

‘బాగా సంపాదించాలి.. పేద్ద పేరు తెచ్చుకోవాలి’ చిన్నప్పుడే ప్రఫుల్‌ బుర్రలో నాటుకుపోయిన భావన ఇది. ఎంబీఏ పూర్తి చేస్తే మంచి జీతమొచ్చే ఉద్యోగం దొరుకుతుందన్నారు తల్లిదండ్రులు. నాలుగుసార్లు దండయాత్ర చేసినా ‘క్యాట్‌’ దాటలేదు. ఇంక ఎంబీఏ పట్టా అందేదెలా? అయినా అతడిలో సంపాదించాలనే ఆశ చనిపోలేదు. వ్యాపారవేత్తల స్ఫూర్తిదాయక పుస్తకాలు బాగా చదివేవాడు. 2016లో అతడి దగ్గరున్న కొద్దిపాటి మొత్తం తీసుకొని సొంతూరు ‘ధర్‌’ దాటాడు. రోజూ కొత్త వ్యక్తుల్ని కలిసి వాళ్ల ఆలోచనలు వినేవాడు. చివరికి ఓ వ్యాపార ప్రయత్నంలో ఉండగా కన్నవాళ్ల పోరు ఎక్కువైంది. చివరికి వాళ్ల బాధ భరించలేక అహ్మదాబాద్‌లో ఓ కాలేజీలో ఎంబీఏలో చేరాడు. మరోవైపు ‘మెక్‌డొనాల్డ్స్‌’లో పార్ట్‌టైం ఉద్యోగం. కొన్నాళ్లయ్యాక అతడికి అర్థమైన విషయం ఏంటంటే.. ఎంబీఏ పూర్తి చేసినా లక్షలకొద్దీ సంపాదించలేనని. ఉన్నఫళంగా చదువాపేసి అహ్మదాబాద్‌లోని ఓ రహదారి పక్కనే టీకొట్టు తెరిచాడు. ‘ఇండియాలో సమయం, కాలం లేకుండా ఎప్పుడూ నడిచే వ్యాపారం ఇదొక్కటే. అందుకే చాయ్‌ బాట పట్టా’ అంటాడు ప్రఫుల్‌. పైగా పెట్టుబడి తక్కువ. దానికి తన దగ్గరున్న రూ.8 వేలు కేటాయించాడు. టీకొట్టుకి ‘మిస్టర్‌ బిలియనీర్‌ అహ్మదాబాద్‌’ (ఎంబీఏ) అనే పేరు పెట్టాడు. ‘అంతదూరం వెళ్లింది ఇది చేయడానికా?’ అని తల్లిదండ్రులు, బంధువులూ తిట్టారు.. పట్టించుకోలేదు. మొదట్లో అతడి టీ ఏమంత రుచిగా ఉండేది కాదు. కొన్నాళ్లకి పట్టు సాధించాడు. ప్రఫుల్‌ చూడటానికి స్టైలిష్‌గా ఉంటాడు. ఆకట్టుకునే పేరు. మెల్లగా జనం పోగవసాగారు. ఈ ఉత్సాహంతో వ్యాపారం పెంచుకోవడానికి కొత్త ఎత్తుగడలు వేసేవాడు. కేఫ్‌లో క్రికెట్‌ మ్యాచ్‌లు ఏర్పాటు చేయడం, లూడో గేమ్స్‌ ఆడించడం.. తమకిష్టమైన వారికి సందేశాలు రాసుకునేలా బోర్డులు ఏర్పాటు చేయడం.. ఇలాంటి కిటుకులు బాగా పని చేశాయి. రెండేళ్లలో బాగా పేరు రావడంతో రెండో కేఫ్‌ని సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో తెరిచాడు. అలా నాలుగేళ్లలో యాభై ఫ్రాంచైజీలకు విస్తరించాడు. ఒక్కో కేఫ్‌లో యాభై మంది కూర్చునేలా.. విశాలమైనవి అవి. ఇక జనానికి నచ్చే రుచి.. అభిరుచులకు తగ్గ వినోదం.. ఇంకేం ప్రఫుల్‌ టీకొట్లు కిటకిటలాడుతూనే ఉన్నాయి. టర్నోవరు నాలుగుకోట్ల రూపాయలు దాటింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని