Updated : 23 Jul 2022 04:45 IST

కొలువు వదిలి.. కలల బాట!

చేతుల్లో సొగసైన ల్యాప్‌టాప్‌.. పేరు వెనకాల ఇంజినీర్‌ హోదా. నెల తిరిగేసరికల్లా బ్యాంకు ఖాతాలో ఆరంకెల మొత్తం జమయ్యేంత జీతం. నిండుగా పర్స్‌. మొత్తానికి బిందాస్‌ జీవితం వినయ్‌కుమార్‌ సిరిగినీడి, పవన్‌కుమార్‌ కోదాటిలది. అయినా రిస్కు తీసుకున్నారు. ఆ సౌకర్యాలన్నీ వదిలి తెర కలల బాట పట్టారు. ‘సినిమా కష్టాలు దాటితేనే సినిమాల్లో ఛాన్స్‌’ అనే ట్రెండ్‌ని తిరగరాసి సులభంగానే అవకాశాలు ఒడిసిపట్టారు. అదెలా సాధ్యమైంది? లక్షల జీతం ఎందుకు వదిలారు? ఈ వివరాలన్నీ ‘ఈతరం’తో పంచుకున్నారు. ఆ ప్రయాణం వారి మాటల్లోనే.


బీటెక్‌ దర్శకుడు..

మాది రాజమండ్రి. సినిమాలంటే అందరి కుర్రాళ్లలానే నాకూ ఇష్టం. కాదు కాదు.. పిచ్చి. వైజాగ్‌లో బీటెక్‌ పూర్తి చేసి చెన్నైలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరా. జీతం, గుర్తింపునకు ఏ లోటూ లేదు. జాలీగా గడిచిపోతోంది జీవితం. అయినా ఏదో వెలితి. కొన్నాళ్లకి నా డ్రీమ్‌ జాబ్‌ ఇది కాదనిపించింది. అప్పుడే సినిమాల్లోకి వెళ్లిపోవాలని ఫిక్సయ్యా. ఆ విషయం ఇంట్లో చెప్పా. మంచి కెరియర్‌ వదులుకోవడమేంటని ఆశ్చర్యపోయారు. మొదట ఒప్పుకోలేదు. నేనూ వెనక్కి తగ్గలేదు. వాళ్లు తలూపక తప్పలేదు. అప్పటికే సోషల్‌ మీడియాలో రాహుల్‌ రవీంద్రన్‌, సందీప్‌ కిషన్‌, అడివి శేష్‌లతో ఏర్పడిన పరిచయం అక్కరకొచ్చింది. నేను చేసిన ప్రాజెక్ట్‌ పనులు కొన్ని పంపాను. వాళ్లకి నచ్చింది. అలా 2016లో గూఢచారి సినిమాకు సహాయ దర్శకుడిగా అవకాశం వచ్చింది. దర్శకుడు శశికిరణ్‌ తిక్కా, శేష్‌కు నా పని నచ్చడంతో తర్వాత సినిమాల్లోనూ అవకాశాలిచ్చారు. ‘ఎవరు’కి పని చేయకపోయినా నేను కట్‌ చేసిన టీజర్‌, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దాంతో నాపై నమ్మకంతో ‘మేజర్‌’కి అసిస్టెంట్‌ డైరెక్టర్‌, రైటర్‌, ఎడిటింగ్‌ ఇలా చాలా బాధ్యతలు ఇచ్చారు. అన్నీ సక్రమంగా చేయడంతో.. ఈసారి గూఢచారి-2 దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పారు. మొత్తానికి అలా నా కల నెరవేరింది. ఉద్యోగం వదిలేసి ఐదేళ్లు ఇంటికి దూరంగా ఉంటూ నేను పడిన కష్టానికి ప్రతిఫలం అది. ఓరోజు ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోనొచ్చింది. తనను నా ఫ్రెండ్‌గా పరిచయం చేసుకున్నాడు. ‘నేను సాధించలేకపోయాన్రా నువ్‌ చేసి చూపించావు. నీ సక్సెస్‌లో నన్ను చూసుకుంటున్నా’ అన్నాడు. ఆ మాటలు నాకు నాపై మరింత నమ్మకాన్ని పెంచాయి. ఈ ఐదేళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశా. పనిని ప్రేమించడం వల్లనేమో.. ఎప్పుడూ కష్టంగా అనిపించలేదు. సినిమాలపై నా ఇష్టం.. కొందరి సాయంతోనే నేను ఈ స్థాయిలో ఉన్నా. ఓ సినీ అభిమానిగా మంచి చిత్రాలు తీస్తూనే ఉంటా.


జాతీయ అవార్డు సినిమా.. ఎడిటర్‌

ఎన్‌ఐటీ రూర్కెలాలో మెరైన్‌ ఇంజనీరింగ్‌ చదివి రాజస్థాన్‌లోని హిందుస్థాన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఇంజనీర్‌గా పనిచేసేవాడిని. నా లక్ష్యం మాత్రం సినిమానే. మాది వైజాగ్‌. నాన్న ఉద్యోగరీత్యా జహీరాబాద్‌లో స్థిరపడ్డాం. కొంచెం డబ్బు కూడబెట్టగానే మంచి ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలన్నది నా ప్లాన్‌. అది కుదరలేదు. ఓ సినిమా వెబ్‌సైట్‌లో అవకాశం వచ్చింది. వాళ్లు రూపొందించే వీడియోలకు ఎడిటర్‌గా పనిచేశా. కొన్ని వీడియోల్లోనూ నటించా. పేరొచ్చింది. జాతీయ అవార్డు సినిమా ‘కలర్‌ఫొటో’ దర్శకుడు సందీప్‌ మా టీమ్మేట్‌. నా పని చూసి తన మొదటి చిత్రానికి అవకాశం ఇచ్చాడు. దాంతో గుర్తింపొచ్చింది. ఈమధ్యలో ‘మేజర్‌’కి ఆన్‌లైన్‌ ఎడిటర్‌గా అవకాశం. అంటే సినిమా షూటింగ్‌ సమయంలోనే సీన్స్‌ అప్పటికప్పుడు ఎడిట్‌ చేసి చూపించడం. మేజర్‌ కోసం నన్ను సంప్రదించినప్పుడు ఒక ఫైల్‌ ఇచ్చి ‘ఎంత సమయంలో ఎడిట్‌ చేస్తావు?’ అనడిగారు. మూడు గంటలు పడుతుందన్నా. ‘ముప్ఫై నిమిషాల్లో చేసి ఇవ్వలేవా?’ అన్నారు. ప్రయత్నిస్తే 35 నిమిషాల్లోనే పని  పూర్తైంది. ప్రధాన ఎడిటర్‌గా ప్రమోట్‌ చేశారు. ఈ సమయంలోనే వినయ్‌తో పరిచయమై, ‘గూఢచారి-2’ కి అవకాశం దక్కింది. తర్వాత వీటితోపాటు మరో నాలుగైదు. కొంతమంది కొత్తవాళ్లు ఫోన్‌ చేసి ‘మీరు పనిలో వేగం చూపిస్తారు. మీరే మాకు స్ఫూర్తి’ అన్నారు. సంతోషమేసింది. వాళ్లకి ఒక్కటే చెబుతా.. చేస్తున్న పనిపై మమకారం ఉంటే విజయం, పేరు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి.


* కెరియర్‌పై విపరీతమైన ఇష్టంతోపాటు, కష్టపడితేనే విజయం.
* ఒక్కోసారి ఆలస్యమైనా.. శ్రమకు తగ్గ గుర్తింపు వస్తుంది.
* ఎంచుకున్న రంగంలో అప్‌డేట్‌ అవుతుండాలి. హార్డ్‌వర్కే కాదు.. స్మార్ట్‌వర్క్‌ తెలిసుండాలి.
* ఒక్కోసారి తేలిగ్గానే విజయం వరిస్తుంది. అప్పుడూ పాదాలు నేల మీదే ఉండాలి.
* సినిమా హిట్‌ అయితే ఆకాశానికెత్తేస్తారు. ఫెయిలైతే కనుమరుగైపోతాం. మనకో ప్రత్యామ్నాయం ఉండాలి.
* చదువు, భాషా పరిజ్ఞానం, మంచి నడవడిక ఉంటే మనల్ని చూసే తీరు మారుతుంది.

- భవాని మోటకోడూరు, ఈజేఎస్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని