పస్తులున్నచోటే.. పరులకు సాయం

నిత్యం పస్తులతో కుస్తీ పడే కుటుంబం. తల్లి బంగారం కుదువబెట్టి చదివాడు. 24 ఏళ్లకే సొంత కంపెనీ ప్రారంభించాడు. తనలా ఎవరూ ఇబ్బంది పడొద్దని యువతకు చేతనైన సాయం చేస్తున్నాడు... అతడే ‘ఏటీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌’ అంకుర వ్యవస్థాపకుడు అడప యోగేశ్వర్‌.

Updated : 30 Jul 2022 00:52 IST

నిత్యం పస్తులతో కుస్తీ పడే కుటుంబం. తల్లి బంగారం కుదువబెట్టి చదివాడు. 24 ఏళ్లకే సొంత కంపెనీ ప్రారంభించాడు. తనలా ఎవరూ ఇబ్బంది పడొద్దని యువతకు చేతనైన సాయం చేస్తున్నాడు... అతడే ‘ఏటీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌’ అంకుర వ్యవస్థాపకుడు అడప యోగేశ్వర్‌.

యోగేశ్వర్‌ది ఆదిలాబాద్‌ జిల్లా లక్ష్మీపూర్‌. ఇంట్లో నిత్యం కష్టాల కొలిమి రగులుతూనే ఉండేది. సేద్యం గిట్టుబాటు కావడం లేదని దాన్ని వదిలేశారు. అప్పు తెచ్చి మరీ వ్యాపారం మొదలు పెట్టారు యోగేశ్వర్‌ నాన్న. అక్కడా రూ.3 లక్షలు నష్టమొచ్చింది. అప్పులు తీర్చడానికి కుటుంబమంతా పొలం పనులకు వెళ్లేవాళ్లు. ఈ కష్టాల్లోనూ యోగేశ్వర్‌ చదువాపకుండా బీటెక్‌ పూర్తి చేశాడు. వెంటనే ఉద్యోగం దొరకలేదు. సొంత కంపెనీ ప్రారంభించాలనుకున్నా పెట్టుబడి లేదు. ఇతర నైపుణ్యాలైనా సంపాదించుకుందామని హైదరాబాద్‌ బయల్దేరాడు. అమ్మ తన బంగారు గొలుసు తాకట్టు పెట్టి రూ.70 వేలు ఇచ్చింది. నగరంలో శిక్షణ తీసుకుంటూనే పార్ట్‌టైం ఉద్యోగం చేసేవాడు. కోర్సు పూర్తయిన తరువాత కూడబెట్టిన కొద్దిమొత్తంతో తిరిగొచ్చాడు. అనుభవం కోసం నిర్మాణ రంగంలోని కంపెనీల్లో చిన్న చిన్న ప్రాజెక్టులు చేసేవాడు. పనిపై పట్టు సాధించడానికి ఉదయం నుంచి అర్థరాత్రి వరకూ కష్టపడేవాడు. ఈ అనుభవం, దాచుకున్న మొత్తంతో 2019 అక్టోబరులో తన కలల కంపెనీ ‘ఏటీఆర్‌’ ప్రారంభించాడు. దురదృష్టంకొద్దీ అప్పుడే కరోనా విరుచుకుపడింది. నిర్మాణ రంగం కుప్పకూలింది. అయినా ధైర్యం కోల్పోలేదు. ఇప్పుడు తను పదులమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. టర్నోవరు కోట్లకు చేరింది.

దారి చూపిస్తూ..
తను ఒకస్థాయికి చేరగానే గతంలోలాగా తనలా ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేయాలనుకున్నాడు. ‘ఏటీఆర్‌ డిజైన్స్‌ స్టూడియో’ అనే ఇంకో సంస్థ ప్రారంభించాడు. దీని ద్వారా రియల్‌ టైం ప్రాజెక్టులు ఎలా ఉంటాయి? ఫీల్డ్‌లో ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు చెబుతూనే.. కంప్యూటర్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణను అందిస్తున్నాడు. విజయవంతంగా ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసిన వారిని తన కంపెనీలోనే ఉద్యోగులుగా చేర్చుకుంటున్నాడు. ‘ఒకప్పుడు ఏ వృత్తి విద్య కోర్సులో శిక్షణ కోసం మా అమ్మ గొలుసు తాకట్టు పెట్టాల్సి వచ్చిందో... అదే విద్యను నలుగురికి ఉచితంగా అందివ్వడం చాలా సంతోషంగా ఉంది’ అంటున్నాడు. అలాగే ఆదిలాబాద్‌లోని నిరుద్యోగ యువతకు సాయంగా ‘స్టూడెంట్‌ ఎంపవర్‌మెంట్‌ సొసైటీ ఫర్‌ ఆదిలాబాద్‌’ అనే గ్రూప్‌ నడిపిస్తున్నాడు యోగేశ్వర్‌.             

- దాసరి సుభాష్‌, ఈజేఎస్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని