Published : 30 Jul 2022 00:56 IST

ఫోర్బ్స్‌ మెచ్చిన.. డిజిటల్‌ స్టార్లు

కాస్త ప్రతిభ.. కూసింత కళాపోషణ.. ఇంకొంచెం సృజనాత్మకత... ఈమాత్రం ఉంటే.. డిజిటల్‌ కంటెంట్‌కి మంచి పెట్టుబడి దొరికినట్టే!  అన్నింటినీ రుబ్బేసి.. అంతర్జాలంలోకి వదిలామా.. ‘లైక్‌’ల వరద. జనాలకి కంటెంట్‌ నచ్చితే.. కాసుల వాన. వీక్షణలు బాగుంటే ఫేమ్‌ వెంట పడి మరీ రావడం గ్యారెంటీ! అందుకే మరి ఇప్పుడు ‘డిజిటల్‌ కంటెంట్‌ క్రియేషన్‌’ కుర్రకారుకి లాభసాటి బేరమైంది. ఈమధ్యే ఇలాంటి టాప్‌ క్రియేటర్ల జాబితా రూపొందించింది ‘ఫోర్బ్స్‌’. వంద మందికి ‘డిజిటల్‌ స్టార్లు’ అంటూ పట్టం కట్టింది.. అందులో కొందరి పరిచయం.


సొగసుల రాణి కోమల్‌

విభాగం: ఫ్యాషన్‌

దిల్లీ అమ్మాయి కోమల్‌ పాండే.. స్టైల్‌లో సినిమా తారకు ఏమాత్రం తీసిపోదు. వీడియోలు చూస్తే.. సూపర్‌ మోడల్‌ హొయలే గుర్తొస్తాయి. ఇంతకీ తనెవరు? అంటే సోషల్‌మీడియా స్టార్‌, ఇన్‌ఫ్లూయెన్సర్‌. తన స్టైల్‌, ఔట్‌ఫిట్స్‌, ఫ్యాషన్‌ సంగతులకు ఫిదా అయిన యువత కోకొల్లలు. ఆమె సొగసు పాఠాలకు తలొగ్గే విద్యార్థులు మిలియన్లకొద్దీ.

కోమల్‌ ముందు నుంచీ చదువుల్లో టాపర్‌. తనదీ, తల్లిదండ్రులదీ ఒకటే లక్ష్యం.. ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌ కావడం. ఇంటర్‌ దాకా మెరిట్‌గా ఉంటూ అదే బాటలో సాగింది. ఎప్పుడైతే దిల్లీ యూనివర్సిటీలో చేరిందో.. అప్పట్నుంచే ఫ్యాషన్‌ రంగంపై మనసు పారేసుకుంది. ఫలితం.. డిగ్రీ చివరి ఏడాది డింకీ కొట్టింది. ఏడాది విరామం. ఈ సమయంలోనే ‘ది కాలేజ్‌ కౌచర్‌’ అంటూ ఓ బ్లాగ్‌ మొదలు పెట్టింది కోమల్‌. రీసైకిల్డ్‌ ఫ్యాషన్లతో సరదాగా వీడియోలు చేసేది. ఇవి చూసిన ఒక ఫ్యాషన్‌ బ్రాండ్‌ నుంచి ఆహ్వానం అందింది. అలా పందొమ్మిదేళ్లకే ఫ్యాషన్‌ వీడియో సమన్వయకర్తగా ఉద్యోగం దక్కించుకుంది. అక్కడే ప్రొడక్షన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌, లైట్స్‌, కెమెరా.. వీడియోలు రూపొందించడం నేర్చుకుంది. తర్వాత మరో పెద్ద ఫ్యాషన్‌ సంస్థలో పని చేసింది. ఈ అనుభవంతో 2018లో తనే సొంతంగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించింది. ఫ్యాషన్‌ థెరపీ పేరుతో ఇన్‌స్టా ఖాతా తెరిచింది. సొగసు టిప్స్‌, వేషధారణ, ఔట్‌ఫిట్స్‌తో ప్రయోగాలు, కొత్త ట్రెండ్‌ విషయాలతో యూట్యూబ్‌ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్‌.. ఏది చేసినా సూపర్‌హిట్టే. తనకి ఇప్పుడు యూట్యూబ్‌లో 12 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాలో 17లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఇచ్చిన ఇంటర్వ్యూలకు లెక్కే లేదు. ఈ ఊపుతో సొంత ఫ్యాషన్‌ బ్రాండ్‌ రూపొందిస్తోంది కోమల్‌.


అలుపెరుగని యాత్రికుడు నిఖిల్‌ శర్మ

విభాగం: ట్రావెల్‌

ముంబయి యువకుడు నిఖిల్‌ శర్మ అంటే ఎవరికీ పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. ‘ముంబైకర్‌ నిఖిల్‌’ అంటే అంతా ఇట్టే గుర్తు పడతారు. దేశంలోని తొలి వ్లాగర్లలో ఒకడు తను. టూవీలర్‌పై దేశమంతా తిరుగుతున్న సాహసికుడు. ప్రయాణాన్ని తాను ఆస్వాదించడమే కాదు.. తన కెమెరా కళ్లతో ఆ అనుభవాల్ని మనకు కళ్లకు కట్టినట్టు వివరిస్తాడు. అందమైన ప్రదేశాలు, అరుదైన దృశ్యాలు, అనుకోకుండా వచ్చిపడే సంఘటనలు.. ఎన్నెన్నో. ఆరేళ్ల కిందట కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి యాత్రతో తన అసలైన ప్రయాణం మొదలైంది. మొదట్లో సరదాగా యాభై, వంద కిలోమీటర్లు బండిపై వెళ్లొచ్చేవాడు. తనపై తనకు నమ్మకం కలిగాక.. లాంగ్‌ జర్నీలు మొదలు పెట్టాడు. ఇప్పుడు తను ఇండియాలోని మోటో వ్లోగర్లకు మార్గదర్శి. కేవలం వీడియోలు చూపిస్తూ ఆకట్టుకోవడమే కాదు.. మాటలతోనూ కనికట్టు చేసే నేర్పు అతడి సొంతం. ఎప్పుడో.. అనుకోకుండానే ట్రావెల్‌ని కెరియగా ఎంచుకున్నాడు. ద్విచక్రవాహనంపై అలా సాగిపోతూనే ఉన్నాడు. పేరు, డబ్బు అతడి వెంటే పరుగెత్తుకొస్తున్నాయి. నిఖిల్‌కి యూట్యూబ్‌లో 40లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉంటే.. ఇన్‌స్టాలో 15లక్షలమంది అనుసరిస్తున్నారు.


యోగిని నటాషా నోయెల్‌

కేటగిరీ: ఫిట్‌నెస్‌

డేళ్ల చిన్న వయసులో అత్యాచారానికి గురైంది. అప్పట్నుంచి తన శరీరంపై తనకే అసహ్యం. అకారణమైన భయం. ఆందోళన, ఒత్తిడి, అపరాధభావంతో.. ఇరవై ఏళ్ల వయసు వచ్చేవరకూ మానసిక కుంగుబాటులోనే ఉంది నటాషా నోయెల్‌. ఈ సమయంలో యోగా తన దృక్పథాన్ని మార్చింది. అప్పుడుగానీ తనపై తనకు నమ్మకం కలగలేదు. అదే కెరియర్‌కి దారి చూపింది. యువత నచ్చేలా, మెచ్చేలా వీడియోలు చేయసాగింది నటాషా. వ్యాయామం, యోగాసనాలపై పూర్తి పట్టు సాధించి యోగినిగా మారింది. ఒంటిని రబ్బరులా సాగదీస్తూ తను వేసే ఆసనాలకు అభిమానులు ఎంతో మంది ఫిదా అవుతుంటారు. ఇదిగాక అమ్మాయిల వ్యక్తిగత సమస్యలు పరిష్కరించే వీడియోలు చేస్తూ, స్ఫూర్తిదాయక ఇంటర్వ్యూలు ఇస్తూ.. సెలెబ్రిటీ హోదా సొంతం చేసుకుంది. ‘టెడెక్స్‌’ వేదికపై తను ఇచ్చిన ఉపన్యాసం కన్నీళ్లు పెట్టించింది. నటాషా ఛానెల్‌కి ఏడున్నర లక్షలమంది సబ్‌స్క్రైబర్లున్నారు. ఇన్‌స్టా అభిమానులు మూడున్నర లక్షలు.


టెక్‌ మొనగాడు శ్లోక్‌ శ్రీవాత్సవ

విభాగం: టెక్నాలజీ

సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, ఐపాడ్‌.. మార్కెట్లోకి కొత్తగా ఏ ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌ వచ్చినా శ్లోక్‌ శ్రీవాత్సవ రివ్యూ కోసం ఎదురు చూసే యువత లక్షల్లో ఉంటారు. కేవలం రివ్యూలే కాదు.. ఎథికల్‌ హ్యాకింగ్‌ టిప్స్‌, టెక్నికల్‌ ట్రిక్స్‌, ఫ్యూచరిస్టిక్‌ టెక్నాలజీ.. ఎలాంటి విషయం అయినా శ్లోక్‌కి కొట్టినపిండే. సాంకేతిక సమస్యలకూ సలహాలిస్తాడు. అందుకే తను ఇండియాలోనే టాప్‌ ఇన్‌ఫ్లుయెన్షియల్‌ టెక్‌ రివ్యూయర్‌. కౌమారంలోనే ఇతగాడి సాంకేతిక యాత్ర మొదలైంది. నాన్న ల్యాప్‌టాప్‌ చాటుమాటుగా తీసుకొని తనకిష్టమైనవి ఏవేవో వీడియోలు రూపొందించేవాడు. ఆ పరిజ్ఞానంతో చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు స్నేహితులకు వచ్చే మొబైల్‌ చిక్కుల్ని విప్పదీసేవాడు. సొంతంగా సాఫ్ట్‌వేర్‌ రాసేవాడు. ఇలాంటి విషయాలతో యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించమని ఓ ఫ్రెండ్‌ ఇచ్చిన సలహాతో రంగంలోకి దిగాడు. సూటిగా.. సుత్తి లేకుండా.. తనకున్న పరిజ్ఞానంతో వీడియోలు రూపొందించడం మొదలుపెట్టాడు. గ్యాడ్జెట్స్‌, ప్రొడక్ట్‌ రివ్యూలు, లైఫ్‌ హ్యాక్స్‌.. ప్రతీదానిపై ‘హౌ టూ’ చేస్తున్నాడు. ఈ వీడియోలకి నెలకి ఐదుకోట్ల వ్యూస్‌ వస్తున్నాయంటే.. అతడి ‘రేంజ్‌’ ఏంటో అర్థమవుతుంది. శ్లోక్‌ ‘టెక్‌ బర్నర్‌’ ఛానెల్‌కి 75 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉంటే.. ఇన్‌స్టాలో 12 లక్షలమంది అనుసరిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని