Updated : 13 Aug 2022 05:33 IST

వృక్ష రక్షకుడు

‘ప్రకృతిపై ప్రేమతోనే ఈ వృత్తి ఎంచుకున్నాను. ఇందులో అంతులేని సంతృప్తి దక్కుతోంది. మామూలు చోట్లనే కాదు.. ప్రముఖ హోటళ్లు, మాల్స్‌, స్థిరాస్తి కంపెనీలూ మాతో రీ ప్లాంటేషన్‌ చేయించుకుంటున్నాయి’.

ఉద్యోగాలు బోలెడుంటాయి! మంచి జీతమిచ్చేవి.. త్వరగా పదోన్నతులు వచ్చేవి. డబ్బుతోపాటు.. మనసుకు సంతోషాన్ని, సమాజానికి ఉపయోగపడేవి  మాత్రం అరుదు! పెద్దపెద్ద చెట్లను ఒకచోటినుంచి మరోచోటికి  తరలించడం అలాంటిదే. ఆరేళ్లుగా అదేపని చేస్తున్నాడు వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ యువకుడు కావలి బాలకృష్ణ.

కొమ్మ, కాండం, పండు, ఆకు.. నీడ.. చెట్టులో ప్రతీదీ అమూల్యమే. అలాంటిది.. ఏదో కారణంతో ఒక వృక్షాన్ని నేలమట్టం చేయాలంటే.. ప్రకృతి ప్రేమికులు తల్లడిల్లిపోతుంటారు. అదే వృక్షాన్ని కూల్చకుండా మరోచోటికి తరలించి నాటితే దానికి పునర్జన్మనివ్వడమే అవుతుంది. చిన్న మొక్కను పెకిలించి వేరేచోట నాటితేనే అవి బతుకుతాయన్న గ్యారెంటీ ఉండదు. అలాంటిది పదుల, వందల ఏళ్లున్న పెద్దపెద్ద చెట్లను తరలించడం, చనిపోకుండా చూడటమే వృత్తిగా చేసుకోవడం మామూలు విషయం కాదు.

మొక్కలు, వాటి సంరక్షణపై చిన్నప్పట్నుంచి ఆసక్తి ఉన్న బాలకృష్ణ చదువైపోగానే హైదరాబాద్‌ సమీపంలోని ఒక నర్సరీలో చేరాడు. నాలుగేళ్లు అక్కడ పని చేశాక 2016లో బయటకొచ్చి, రుణం తీసుకొని సొంతంగా రీ ప్లాంటేషన్‌ కెరియర్‌ ప్రారంభించాడు. మొయినాబాద్‌లో మొదటిసారి 30 మామిడి చెట్లను రీ ప్లాంట్‌ చేశాడు. అందులో 30 నుంచి 200 సంవత్సరాల వయసున్నవి ఉన్నాయి. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించి, అక్కడ నాటి సంరక్షించే బాధ్యత అతడిదే. 45 నుంచి 60 రోజులు అలా చేస్తాడు. బాలకృష్ణ పనితనం చూసి అప్పటి సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఒక ప్రాజెక్టు అప్పగించారు. ఒక ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి అడ్డుగా ఉన్న రెండు వేప చెట్లను రీ ప్లాంట్‌ చేయమన్నారు. నిజామాబాద్‌లో రోడ్డు విస్తరణ పనుల్లో అడ్డుగా ఉన్న వృక్షాలను వేరేచోటికి తరలించాడు. ఇలా తెలంగాణ జిల్లాలతోపాటు బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ రీ ప్లాంటేషన్‌ చేస్తున్నాడు. కొబ్బరి, వేప, మామిడి, మర్రి, రావి, గుల్మోర్‌, నేరేడు.. ఏ చెట్టు అయినా విజయవంతంగా చిగురింపజేస్తున్నాడు. ఇప్పటివరకు మొత్తమ్మీద ఏడు వేల చెట్లకు పునర్జన్మనిచ్చాడు. రోడ్ల విస్తరణప్పుడు, తోటల్ని నరికేసి రియల్‌ఎస్టేట్‌ చేసినప్పుడు, కొత్త గృహ నిర్మాణాల సమయంలో... ఇలాంటి ప్రక్రియ చేపడతారు. అత్యంత నైపుణ్యంతో, భారీ క్రేన్ల సాయంతో, యాభై నుంచి రెండువందల మంది సిబ్బందితో భారీ వృక్షాలను పెకిలించి.. కిలోమీటర్ల దూరంలో వాటిని నాటడం.. మళ్లీ చిగురు వేసేంత వరకు సంరక్షించడం.. అంటే వాటికి మరో జన్మనిస్తున్నట్టే.

- భూపతి సత్యనారాయణ, ఈజేఎస్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని