అమరం.. అజరామరం.. మీ త్యాగం!

దేశభక్తి అంటే మువ్వన్నెల పతాకాన్ని ముద్దాడటం కాదు... శత్రువుకి ఎదురొడ్డి నిలవడం! దేశభక్తి అంటే క్రికెట్‌ మ్యాచ్‌లో ‘ఇండియా ఇండియా’ అని అరవడం కాదు... ఎముకలు కొరికే చలిలో సరిహద్దుల్లో పహారా కాయడం! దేశభక్తి అంటే సామాజిక మాధ్యమాల్లో స్టేటస్‌లు పెట్టుకోవడం కాదు... దేశ పౌరుల కోసం ప్రాణాలనైనా తృణప్రాయంగా అర్పించడం! ఇలాగే భావించారు హెచ్‌.వైశాఖ్‌, రోహిణ్‌ కుమార్‌లు.

Updated : 13 Aug 2022 07:19 IST

దేశభక్తి అంటే మువ్వన్నెల పతాకాన్ని ముద్దాడటం కాదు... శత్రువుకి ఎదురొడ్డి నిలవడం!
దేశభక్తి అంటే క్రికెట్‌ మ్యాచ్‌లో ‘ఇండియా ఇండియా’ అని అరవడం కాదు... ఎముకలు కొరికే చలిలో సరిహద్దుల్లో పహారా కాయడం!
దేశభక్తి అంటే సామాజిక మాధ్యమాల్లో స్టేటస్‌లు పెట్టుకోవడం కాదు... దేశ పౌరుల కోసం ప్రాణాలనైనా తృణప్రాయంగా అర్పించడం!
ఇలాగే భావించారు హెచ్‌.వైశాఖ్‌, రోహిణ్‌ కుమార్‌లు.
ఈ క్రమంలోనే శత్రు మూకలతో జరిపిన పోరులో అమరులయ్యారు...
స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు జరుపుకుంటున్న వేళ స్ఫూర్తి రగిలించే ఈ అమరుల్ని స్మరించుకోవడం అవసరం.


చావుకు ఎదురెళ్లి..

మ్ముకశ్మీర్‌ సరిహద్దు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన కదన క్షేత్రం. ఇక్కడ విధులు నిర్వర్తించడమంటే చావు నోట్లో తల పెట్టి పని చేయడం లాంటిది. అనుక్షణం పొంచి ఉండే తీవ్రవాదుల ముప్పు ఒకవైపు.. ఏ క్షణమైనా దాడి చేసే శత్రు సైనికులు మరోవైపు. బుల్లెట్ల వర్షాన్ని నిత్యం కాచుకోవాల్సిందే. దీనికితోడు అత్యంత కఠినమైన వాతావరణం. అక్కడే అడిగి మరీ పోస్టింగ్‌ వేయించుకున్నాడు కేరళ కుర్రాడు హెచ్‌.వైశాఖ్‌. ‘సవాళ్లను ఎదుర్కోవడం అంటే నాకు ఇష్టం. దేశానికి సవాల్‌గా మారిన శత్రువు అంతు చూడటం మరీ ఇష్టం. అందుకే నేను కశ్మీర్‌లో పోస్టింగ్‌ కోరుకున్నా’ అంటూ విధుల్లో చేరేముందు అధికారులతో చెప్పాడు. దానికి తగ్గట్టే సైన్యం నిర్వహించిన పలు ఆపరేషన్లలో కీలకంగా పాల్గొన్నాడు.

వైశాఖ్‌ సొంతూరు కొల్లాం. దురదృష్టవశాత్తు చిన్నప్పుడే నాన్న చనిపోయారు. ఆర్థిక కష్టాలతో సొంత ఇంటిని, ఉన్న కొద్దిపాటి పొలాన్ని అమ్మేశారు. ఎన్ని కష్టాలున్నా ముఖంపై చిరునవ్వు చెరగనిచ్చేవాడు కాదు తను. అమ్మ, అక్కలతో కలిసి చిన్న ఇంటిలో ఉండేవాడు. బండిపై దూరప్రదేశాలకు వెళ్లడమంటే మహా సరదా. తన మోటర్‌సైకిల్‌పై మువ్వన్నెల జెండా ఎప్పుడూ రెపరెపలాడుతుండేది. పందొమ్మిదేళ్ల వయసులో 2017లో సైన్యంలో చేరాడు వైశాఖ్‌. కొవిడ్‌ సమయంలో అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం, జనాలను అదుపు చేయడం లాంటివీ చేశాడు. 24 ఏళ్లు వచ్చేసరికి కుటుంబానికి ఆధారంగా మారాడు. రుణం తీసుకొని కుటుంబానికి ఒక ఇంటిని నిర్మించి ఇచ్చాడు. కానీ గృహప్రవేశం చేసిన నాలుగు నెలలకే తను అమరుడయ్యాడనే చేదువార్త వినాల్సి వచ్చింది.

అక్టోబరు 9, 2021. ఉగ్రవాదులు అక్రమంగా దేశంలోకి చొరబడ్డారని సమాచారం అందింది. వాళ్లను ఏరివేయడానికి అధికారులు రాష్ట్రీయ రైఫిల్‌ బెటాలియన్‌కి చెందిన సైనికులను కశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాకు పంపించారు. ఆ బృందంలో ఒకడు వైశాఖ్‌. రెండ్రోజులపాటు ఆ ప్రాంతంలో అణువణువూ గాలించారు. అక్టోబరు 11న ఓ సాయంత్రం ఇలాగే వెతుకులాట కొనసాగుతుండగానే ఓ కొండ వెనకన నక్కిన ఉగ్రవాదులు ఒక్కసారిగా సైనికులపై కాల్పులకు తెగబడ్డారు. కొందరి శరీరాల్లోకి తూటాలు దిగబడ్డాయి. వెంటనే తేరుకొన్న మనవాళ్లు తమ తుపాకులకు పని చెప్పి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. వైశాఖ్‌తోపాటు ఈ పోరులో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు దక్కలేదు. తర్వాత వైశాఖ్‌ భౌతిక కాయానికి అతడి సొంత ఊరిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. తను బతికి ఉంటే తమ్ముడికి రాఖీ కట్టి కొత్త ఇంటిలో ఘనంగా పండగ చేసుకునేవాళ్లమని కన్నీరుమున్నీరవుతోంది వైశాఖ్‌ అక్క. ఆమెతోపాటు ‘నా కలల వెంట పరుగులు తీస్తున్నా’ అనే వైశాఖ్‌ వాట్సప్‌ స్టేటస్‌ కూడా మూగగా రోదిస్తోంది.


సాటి సైనికుల్ని కాపాడి...

గస్టు 1, 2020. హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌ జిల్లాలోని గలోర్‌ఖాస్‌కు చెందిన భారత సైనికుడు రోహిణ్‌ కుమార్‌ తన మాతృదేశం కోసం మృత్యు ఒడిలోకి ఒరిగిపోయిన రోజు. తను ఇరవై ఏళ్ల వయసున్నప్పుడు భారత సైన్యంలో అడుగుపెట్టాడు. పంజాబ్‌ రెజిమెంట్‌లో పని చేసేవాడు. పాత హిందీ పాటలు పాడుతూ అందరి అభిమానం చూరగొనేవాడు. ముఖ్యంగా ‘ఏ మేరే వతన్‌కి లోగో...’ తను పాడుతుంటే సాటి సైనికుల కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగేవి.

జులైలో రోహిణ్‌ పెళ్లి కుదిరింది. నవంబరులో పెళ్లి. ఆగస్టులో మెల్లగా పనులు మొదలుపెట్టాడు. పెళ్లికి ముందు నెలరోజులు సెలవు తీసుకోవాలనుకున్నాడు. ఇంతలో పై అధికారుల నుంచి ఓ ఆజ్ఞ. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా భారతీయ పోస్టులపై శత్రు దేశ సైనికులు తరచూ తూటాల వర్షం కురిపిస్తున్నారని, వాళ్లని ఎదుర్కోవడానికి రోహిణ్‌తోపాటు మరికొందరు సైనికుల్ని అక్కడకు పంపించారు. వెళ్లిన రెండు రోజులు పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. అంతా సద్దుమణిగినట్టే అని భావించారు. మూడోరోజు అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా పాకిస్థాన్‌ వైపు నుంచి కాల్పులు మొదలయ్యాయి. కాపలా డ్యూటీ నిర్వహిస్తున్న రోహిణ్‌ అందరికన్నా ముందే తేరుకొని ఇతరుల్ని అప్రమత్తం చేశాడు. వాళ్లు తుపాకులు అందుకొని దీటుగా బదులిచ్చారు. కానీ ఈలోపే భారీగా తుపాకీ గుళ్లు రోహిణ్‌ శరీరంలోకి దిగబడటంతో అక్కడే కుప్పకూలిపోయాడు. రోహిణ్‌ ఇతరుల్ని అప్రమత్తం చేయకపోతే భారీఎత్తున ప్రాణ నష్టం జరిగేదని అతడి త్యాగాన్ని అంతా కొనియాడారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు