Published : 27 Aug 2022 01:16 IST

పది చదవని.. ప్రపంచ యాత్రికుడు!

పక్క వీధికి వెళ్లాలనుకున్నా పర్సు చూసుకుంటాం. ఊరు దాటాలంటే జేబు నిండుగా ఉందో, లేదో గమనిస్తాం. అలాంటిది చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా దేశమంతా చుట్టేస్తున్నాడు భువన్‌చంద్ర. అతి తక్కువ ఖర్చుతో దేశాలు తిరుగుతున్నాడు. చదివింది తొమ్మిదే అయినా విదేశీ భాషలూ అలవోకగా మాట్లాడేస్తున్నాడు.

భువన్‌ది తమిళనాడులోని తంజావూరు. పదహారేళ్ల వయసున్నప్పుడు నాన్న చనిపోయారు. ఆయన చేసిన అప్పులు, కుటుంబ భారం మోయాల్సి రావడంతో చదువాపేశాడు. కానీ కంప్యూటర్‌పై మమకారం. పని చేస్తూనే యానిమేషన్‌, గ్రాఫిక్స్‌ నేర్చుకున్నాడు. దాంతో చిన్న ఉద్యోగంలో చేరినా వర్కవుట్‌ కాలేదు. ‘మంచి వీడియోలు తీసి యూట్యూబ్‌లో పెడితే డబ్బులొస్తాయి’ ఎవరో చెబితే నమ్మాడు. అప్పు తీసుకొని మరీ హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీ యాత్ర మొదలుపెట్టాడు. చెన్నై, దిల్లీ ద్వారా ఏడు రోజుల్లో అక్కడికి చేరాలనేది ప్లాన్‌. తన దగ్గరున్నదేమో తక్కువ డబ్బులు. దాంతో మోటార్‌సైకిళ్లు, ట్రక్కులు, బస్సులు, కార్ల వాళ్లని లిఫ్ట్‌ అడుగుతూ వెళ్లేవాడు. ఈ కష్టాలన్నింటినీ వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టాడు. ప్చ్‌.. పెద్దగా స్పందన రాలేదు. తర్వాత దిల్లీ తిరిగొచ్చాడు. రాజస్థాన్‌లో రెండు నెలలు గడిపాడు. ఆపై ఎప్పట్లాగే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులలో లిఫ్ట్‌ అడుక్కుంటూ ఇంటికొచ్చాడు. ఈ ప్రయాణంలో కొంతమంది తమ వాహనాల్లో ఉచితంగా ప్రయాణించడానికి అనుమతినివ్వడమే కాదు.. కడుపు నిండా భోజనం పెట్టించారట. ఈ ఉత్తరాది యాత్ర చేసొచ్చాక ఎక్కడికైనా వెళ్లగలను అనే నమ్మకం అతడిలో కలిగింది. దాంతో ఈసారి పాకిస్థాన్‌ వరకూ వెళ్లి రావాలనుకున్నాడు. పంజాబ్‌లోని కర్తార్‌పూర్‌, గురుసాహిబ్‌ ద్వారా దాయాది దేశం చేరుకున్నాడు. అక్కడ ఒక్కరోజు ఉండి వీడియో షూట్‌ చేశాడు. దాన్ని యూట్యూబ్‌లో పోస్ట్‌ చేస్తే లక్షల వ్యూస్‌ వచ్చాయి. ఒక్కసారిగా సబ్‌స్క్రైబర్లు పెరిగారు. యూట్యూబ్‌ ఆదాయం గణనీయంగా పెరిగింది. దాంతో భువన్‌చంద్ర దశ మారింది. ఈ ఊపుతో విదేశాల బాట పట్టాడు. కెన్యా, ఇథియోపియా, సొమాలియా, ఉగాండా సహా ఇరవై దేశాలు తిరిగాడు. ఎక్కడికి వెళ్లినా అక్కడి ప్రత్యేకతలను తన సబ్‌స్క్రైబర్లకు తెలియజేస్తున్నాడు. అంతేకాదు.. తక్కువ ఖర్చుతో యాత్రను ఎలా పూర్తి చేయాలో వివరిస్తుంటాడు భువన్‌చంద్ర. ఒక్కో రాష్ట్రం, దేశం ఒక్కో మర్చిపోలేని అనుభవం అంటాడు. ఇందులో కొన్ని చేదు జ్ఞాపకాలూ ఉన్నాయి. ఓసారి సోమాలియా యాత్రలో ఉండగా ఐదుగురు వ్యక్తులు దాడి చేసి ఫోన్‌, డబ్బులు లాక్కున్నారట. ప్రస్తుతం భువన్‌చంద్ర యూట్యూబ్‌ ద్వారా నెలకు రూ.లక్షన్నర వరకు సంపాదిస్తున్నాడు. ఈ యాత్రల్లోనే హిందీ, ఇంగ్లీషు, రష్యన్‌, సొహెలీ, కెన్యన్‌, ఇథియోపియన్‌ భాషలు నేర్చుకున్నాడు.

- బొగ్గరపు వెంకటేష్‌ ఎన్‌.ఎం., ఈజేఎస్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని