విదేశాల నుంచి వచ్చి.. గాడిద పాల వ్యాపారం!

బాగా చదువుకోకపోతే గాడిదలు కాయాల్సి వస్తుందని పెద్దవాళ్లు పిల్లల్ని తిడుతుంటారు. అంటే ఎందుకూ పనికి రాకుండా పోతావని దానర్థం. కానీ గాడిదలు కాయడమూ సంపాదనకు మంచి మార్గమని నిరూపిస్తున్నాడు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం యువకుడు నరాల వీర వెంకట కిరణ్‌కుమార్‌.

Updated : 21 Sep 2022 14:32 IST

బాగా చదువుకోకపోతే గాడిదలు కాయాల్సి వస్తుందని పెద్దవాళ్లు పిల్లల్ని తిడుతుంటారు. అంటే ఎందుకూ పనికి రాకుండా పోతావని దానర్థం. కానీ గాడిదలు కాయడమూ సంపాదనకు మంచి మార్గమని నిరూపిస్తున్నాడు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం యువకుడు నరాల వీర వెంకట కిరణ్‌కుమార్‌. ఇంత చదువు చదివి, మంచి ఉద్యోగం చేస్తూ.. ఇదేం వ్యాపారం? అని నలుగురూ నవ్విన చోటే లక్షలు పోగేసుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో తనదే తొలి గాడిద పాల ఉత్పత్తుల కేంద్రం అంటున్నాడు. ఈ విజయం వెనకాల ఉన్న ఆలోచన, ఆచరణ, ప్రయాణం.. ఈతరంతో పంచుకున్నాడు.

కిరణ్‌ చదువు పూర్తవగానే అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వచ్చింది. జీతం ఎక్కువే. కొన్నేళ్లు బ్రిటన్‌లో కొలువు చేశాడు. ఇలా వేర్వేరు దేశాల్లోనే ఎక్కువ రోజులు ఉండటం నచ్చలేదు. కొన్నాళ్లయ్యాక కంపెనీ మారి బెంగుళూరుకి బదిలీ చేయించుకున్నాడు. అదేసమయంలో కరోనా విరుచుకు పడింది. ప్రతి ఒక్కరూ  కొవిడ్‌తో యుద్ధం చేస్తూ రోగ నిరోధకశక్తి పెంపొందించుకునేందుకు ఎవరికి తోచిన పద్ధతులు వారు అనుసరిస్తుండేవారు. గాడిద పాలు బలవర్థకం, రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయని నమ్మి.. చాలామంది ఖరీదు ఎంతైనా కొనుక్కునేవారు. వాటికోసం  ఎంత దూరమైనా వెళ్లి తెచ్చుకునేవారు. ఇది కిరణ్‌ని ఆలోచనలో పడేసింది. దీనికితోడు మరికొంత పరిశోధన చేశాడు. అనుభవజ్ఞులను ఆరా తీశాడు. ప్రతి ఒక్కరూ సానుకూలంగానే చెప్పారు. ఇవన్నీ చూసిన తర్వాత డాంకీ ఫాం ప్రారంభించాలనే నిర్ణయానికొచ్చాడు. స్నేహితురాలు గంపల నవ్య.. భాగస్వామిగా చేతులు కలుపుతానంది. కర్ణాటక, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రల్లో గాడిద పాల వినియోగం ఎక్కువ. అక్కడే డాంకీ ఫామ్స్‌ అధికం. అనుభవం కోసం ఆయా ఫాంల యజమానుల వద్దకు వెళ్లి పూర్తి వివరాలు సేకరించాడు కిరణ్‌. గాడిదల పెంపకంపై కొన్నాళ్లు శిక్షణ తీసుకున్నాడు. తర్వాత తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం మల్లంపూడిలో 20 ఎకరాలు లీజుకు తీసుకుని ‘అక్షయ డాంకీ ఫాం’ ఏర్పాటు చేశారు. జపాన్‌, ఇథియోపియన్‌ దేశాల గాడిదలు అచ్చం గుర్రాల్లాగే ఉంటాయి. వీటి ఖరీదు ఎక్కువ. ఒక్కోటి రూ.5లక్షల వరకు ధర పలుకుతుంది. లీటరున్నర పాలు ఇస్తాయి. వీటితోపాటు కొన్ని దేశీయ రకం గాడిదలు కొనుగోలు చేశారు. కొన్ని సంస్థలు, వ్యక్తులతో ముందే ఒప్పందం కుదుర్చుకొని పాలు సరఫరా చేస్తున్నారు.

లీటరు రూ.ఏడున్నర వేలు
ఆవు, గేదె పాల కంటే గాడిద పాలు ఖరీదెక్కువ. లీటరు రూ.ఐదు వేల నుంచి ఏడున్నర వేల వరకు ధర ఉంటుంది. ఇందులోని ప్రొటీన్లు సులువుగా జీర్ణమవుతాయి. బాడీబిల్డర్లకు ఇవెంతో మేలు. వీటిలో ఎ, బి, సి, డి విటమిన్లు, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంపొందించి యాంటీబాడీలను అభివృద్ధి చేస్తాయి. ముఖవర్చస్సు కోసం, మొటిమల నివారణకు, చర్మ సౌందర్యాన్నిపెంచేందుకు గాడిద పాలు బాగా దోహదపడతాయంటారు సౌందర్య నిపుణులు. ప్రస్తుతం అక్షయ ఫాం నుంచి ప్రతి శనివారం 350 లీటర్ల పాలు హైదరాబాద్‌కి పంపిస్తున్నారు. రెండు రోజులకోసారి 20 లీటర్లు కాకినాడ సమీపంలోని కాస్మొటిక్‌ కంపెనీలకు సరఫరా చేస్తున్నారు. ఇవికాకుండా మరికొన్ని సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. డిమాండ్‌ అధికంగా ఉండటంతో కొద్దిరోజుల్లో కర్ణాటకలో ఒకటి, నెల్లూరులో మరో కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేస్తున్నామంటున్నాడు కిరణ్‌.

కొత్త ప్రణాళికలు
అవకాశం ఉన్నప్పుడే అందిపుచ్చుకోవాలంటారు పెద్దలు. గాడిద పాల ధర ఎక్కువ కావడంతో అవసరం ఉన్నవారు ఎక్కువ మోతాదుతో ఖరీదు చేయలేరు. అలాంటి వారి కోసం అనువుగా టెట్రా ప్యాకెట్లలో నిల్వ చేసి అమ్ముతున్నారు. త్వరలోనే మార్కెట్లోకి 50ఎం.ఎంల్‌, 100ఎం.ఎల్‌., 250ఎం.ఎల్‌. అల్యూమినియం ప్యాక్‌లో తీసుకొస్తామంటున్నారు. మరోవైపు ఔషధంతో కూడిన న్యూట్రిషన్‌ డ్రింక్‌ల తయారీకి పరిశోధనలు చేస్తున్నారు. దీనికోసం ఒక రిసెర్చ్‌ టీంనే తీసుకున్నాడు. పాలపొడి, పన్నీరు వంటి ఉత్పత్తులు సైతం విక్రయిస్తామన్నారు. గుజరాత్‌, మహారాష్ట్రలకు గాడిద మూత్రాన్ని ఎగుమతి చేస్తున్నారు. వ్యర్థాలను సైతం పొలాల్లో ఎరువుగా వినియోగించేలా రైతులకు అమ్ముతున్నారు. పేడను ఎరువుగా తయారు చేసే కంపెనీలు సైతం ఉన్నాయి.

చులకన మాటలు దాటి..
కిరణ్‌ మాస్టర్స్‌ పూర్తి చేసింది.. పదేళ్లపాటు ఉద్యోగం చేసింది విదేశాల్లోనే. ఐటీ నిపుణుడిగా   మంచి వేతనం అందుకుంటున్నాడు. అలాంటిది గాడిదలతో వ్యాపారం అనగానే కొందరు ఆశ్చర్యపోయారు. ‘విదేశాల నుంచి వచ్చావు.   హాయిగా ఉద్యోగం చేసుకోకుండా గాడిదల చుట్టూ తిరుగుతావా? రిస్కు తీసుకోవడం అవసరమా?’ అని వెనక్కి లాగారు. భయాన్ని వ్యక్తం చేశారు. మొదట్లో ఇంట్లోవాళ్లు సైతం సానుకూలంగా లేరు. చాలా కష్టపడి వాళ్లని ఒప్పించాడు. తన సేవింగ్స్‌ మొత్తం పెట్టుబడిగా పెట్టాడు. అది సరిపోకపోవడంతో రుణం తీసుకొని ముందుకెళ్లాడు. అతడి నమ్మకం వృథా కాలేదు. ప్రారంభించిన కొద్దిరోజులకే మంచి ఫలితాలు అందుకున్నాడు.

- గొలుగూరి వెంకట్‌రెడ్డి, న్యూస్‌టుడే, రాజానగరం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని