Published : 24 Sep 2022 01:56 IST

అందమైన అల్లరి.. కయాదు

కయాదు లోహర్‌. సినిమా నేపథ్యం లేదు.. గాడ్‌ఫాదర్లూ లేరు. తెరను ఏలాలనేదే తన ఏకైక అర్హత. పుణె నుంచి వచ్చి దక్షిణాదిలో వాలిపోయింది. సీన్‌ కట్‌ చేస్తే.. కన్నడ, మలయాళ భాషల ఇష్టసఖిగా మారింది. తాజాగా తెలుగులోనూ ‘అల్లూరి’తో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది. ఈ సుందరాంగి సంగతులు.

అమ్మ అండతో: వెన్నెలను, వెన్నముద్దనీ కలిపి రుబ్బితే తయారైందా.. అన్నట్టుగా ఉంటుంది ఈ అమ్మడి మేని సౌందర్యం. ‘ఈ అందంతోనే నువ్వు తెరను ఏలేయొచ్చు’ అన్నారు సన్నిహితులు. అమ్మ సైతం ‘గో అహెడ్‌’ అంది. కథానాయిక కావాలనుకున్న తన కోరిక కూతురి రూపంలో తీర్చుకోవాలనుంది. పైగా చిన్నప్పట్నుంచీ స్టేజీ కనిపిస్తే చాలు.. పాడుతూ, ఆడుతూ అదరగొట్టేది కయాదు. అందరి అండతో చెలరేగిపోవచ్చు అనుకుంది.

సులువేం కాదు: చదువైపోగానే ముంబయిలో ప్రయత్నాలు మొదలుపెట్టినా వర్కవుట్‌ కాలేదు. అవకాశం కల కన్నంత సులువు కాదుగా! అందంతోపాటు అదనపు అర్హతలు ఉంటేనే అందలం అని అర్థమైంది. రూటు మార్చి మోడలింగ్‌లోకి దిగింది. శిక్షణ తీసుకుంటూ నటనలో రాటుదేలింది. అమ్మడి అందం ఓ రేంజ్‌లో ఉండటంతో తొందర్లోనే సినీవర్గాల కళ్లలో పడింది.

కన్నడ పిలుపు: తను నటించిన వాణిజ్య ప్రకటనలు చూసి దర్శకుడు భరత్‌ నవుండా నుంచి కబురందింది. రెక్కలు కట్టుకొని బెంగళూరులో వాలిపోయింది. అలా ‘ముగిల్‌పేట్‌’ అనే కన్నడ చిత్రంతో తెరగేట్రం చేసింది. ఇది కరోనాకు ముందు సంగతి. అది అప్పుడే విడుదలైతే తను టాప్‌ హీరోయిన్‌గా మారేదేమో! కొవిడ్‌ కోరల్లో చిక్కి అమ్మడి కెరియర్‌కి కామా పడింది. పరిస్థితులు సద్దుమణిగేసరికి కొంచెం సమయం పట్టింది. ఈలోపే అందరి కళ్లలో పడింది. ముగిల్‌పేట్‌ విడుదల కాకముందే ‘పతోన్‌పాతమ్‌ నూట్టాండు’ అనే మలయాళ చారిత్రక సినిమాకి సంతకం చేసింది. ఇది భారీ ప్రాజెక్టు. ఇందులో కయదు నటనకి మంచి మార్కులే పడ్డాయి.

తెలుగులో: కన్నడ, మలయాళ సినిమాలు చూసిన దర్శకుడు ప్రదీప్‌వర్మ నేరుగా కాల్‌ చేశారు. అలా అల్లూరితో తెలుగునాట అడుగు పెట్టింది. మన భాషపై పట్టు సాధించడానికి బాగానే కసరత్తులు చేసింది. ఓ శిక్షకుడిని పెట్టుకొని మరీ డైలాగులు సాధన చేసింది. చీరకట్టులో తెలుగు పడుచుగా నిండుగా కనిపించింది.

అల్లరే అల్లరి: చూడటానికి సాఫ్ట్‌గా ఉన్నా కయాదు అల్లరి పిల్ల. కాలేజీలో తనకో పెద్ద గ్యాంగ్‌ ఉండేది. తరగతులు డుమ్మా కొట్టి సినిమాలకు చెక్కేసిన సందర్భాలు ఉన్నాయట. అన్నట్టు డిగ్రీలో ఉండగానే పలు అందాల పోటీల్లో పాల్గొంది. ‘పుణె టైమ్స్‌ ఫ్రెష్‌ ఫేస్‌’గా ఎంపికైంది. అంగద్‌ దేశ్‌పాండే అనే కుర్రాడితో ప్రేమలో ఉందనే వార్తలతోపాటు ఆ జంట ఫొటోలూ అంతర్జాలంలో షికార్లు చేస్తున్నాయి.


కయాదు అంటే: భక్త ప్రహ్లాదుడి తల్లిపేరు

చదువు: బీకామ్‌

సొంత రాష్ట్రం: అస్సాం

నచ్చే నటులు: నాని, అల్లు అర్జున్‌, అలియా భట్‌

చిన్నప్పటి కోరిక: మిస్‌ ఇండియా

బలం, బలహీనత: అమ్మే

ఇష్టమైన పాత్ర: గంగూభాయ్‌ కథియావాడీ

పని చేయాలనుకునేది: మణిరత్నం, సుకుమార్‌

ఖాళీగా ఉంటే: దూరప్రయాణాలు చేస్తా.

ఓ సరదా: బైక్‌ రైడింగ్‌


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని