స్వయంకృషితో..వేల కోట్లకు..

వాళ్లేమీ అపర కుబేరుల వారసులు కాదు...అయితే ఏంటట? సృజనాత్మక ఆలోచనల్లో ఐశ్వర్యవంతులు...అవే పెట్టుబడిగా ఒక్కో మెట్టే ఎక్కుతూ పైకొచ్చినవారు...పైసా పైసా కూడబెడుతూ వేల కోట్లకి ఎదిగినవారు..

Updated : 01 Oct 2022 12:54 IST

వాళ్లేమీ అపర కుబేరుల వారసులు కాదు...అయితే ఏంటట? సృజనాత్మక ఆలోచనల్లో ఐశ్వర్యవంతులు...అవే పెట్టుబడిగా ఒక్కో మెట్టే ఎక్కుతూ పైకొచ్చినవారు...పైసా పైసా కూడబెడుతూ వేల కోట్లకి ఎదిగినవారు...అలా స్వయంకృషితో అత్యంత ధనవంతులుగా మారిన వారి జాబితా తీసింది ‘ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురూన్‌’. అందులో కొందరి స్ఫూర్తిదాయక పయనమిది.

కోట్లకు పడగలెత్తిన వారి సంతానానికి కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, అంకురాలను అలవోకగా ముందుకు నడిపించడం పెద్ద కష్టమేం కాదు. వాళ్ల దగ్గర డబ్బులు దండిగా ఉంటాయి. సలహాలివ్వడానికి బోలెడంత మంది ఉంటారు. ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాల్లో వ్యాపార పాఠాలు నేర్చుకుంటారు. కానీ జీరో నుంచి మొదలు పెట్టి వేల కోట్లు సంపాదించినవాడే అసలైన హీరో. దానికోసం అనుక్షణం మెదడును మధించాలి. మస్తిష్కాన్ని కొలిమిలా మండించాలి. ఆణిముత్యాల్లాంటి ఆలోచనలు పుట్టించాలి. దాన్ని ఆచరణలో పెట్టడానికి పెట్టుబడిదారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాలి. అవసరమైతే కాళ్లావేళ్లా పడాలి. పురిటి నొప్పులు భరించి జన్మనిచ్చిన ఆ అంకుర సంస్థను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అనుభవజ్ఞులు, దిగ్గజాల పోటీని దాటుకుంటూ ముందుకెళ్లాలి. అది జరిగితేనే అగ్ర పథం. ఇదంతా ఎంతమందికి సాధ్యం? లక్షలమంది ఆలోచిస్తారు. వేలమంది ఆచరణలోకి దిగుతారు. వందలమంది మధ్యలోనే అస్త్ర సన్యాసం చేస్తారు. ఓటమి పాలవుతారు. చివరికి సాధించి విజేతగా నిలిచేది పదుల్లోనే ఉంటారు. ఇలా పైకొచ్చిన 40 ఏళ్లలోపు 40 మందిని ఎంపిక చేసిందీ సంస్థ.


పందొమ్మిదేళ్ల బిలియనీర్‌
పేరు: కైవల్య వోహ్రా, కంపెనీ: జెప్టో, వ్యాపారం: ఆన్‌లైన్‌ డెలివరీ, సంపద: రూ.1,000 కోట్లు

పందొమ్మిదేళ్ల వయసులో లోకం పోకడే సరిగా తెలియదు. అలాంటిది వెయ్యి కోట్లకు అధిపతి అయ్యాడు బెంగళూరు కుర్రాడు కైవల్య వోహ్రా. వ్యాపారరీత్యా వాళ్ల నాన్న దుబాయ్‌లో స్థిరపడితే అక్కడే చదువుకున్నాడు. డిగ్రీ కోసం అమెరికా వెళ్లి కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌లో చేరాడు. మొదట్నుంచీ తనకి నాన్న కన్నా పెద్ద వ్యాపారం చేసి బాగా సంపాదించాలనుండేది. కంప్యూటర్‌పై పట్టుండటంతో పదిహేడేళ్లకే కృత్రిమ మేధస్సుతో సేవలందించే ఓ కంపెనీ ప్రారంభించాడు. అది పెద్దగా విజయం సాధించలేదు. అమెరికా వెళ్లిన తర్వాత కరోనా విరుచుకుపడింది. నిత్యావసరాల కోసం జనం అల్లాడిపోవడం గమనించాడు. ఈ సమయంలో ఫుడ్‌, గ్రాసరీ డెలివరీ యాప్‌ల వ్యాపారం ఒక్కసారిగా ఊపందుకుంది. ఇదే మంచి తరుణం అని భావించాడు. చదువు మధ్యలోనే వదిలేసి భారత్‌ వచ్చేశాడు. మిత్రుడు ఆదిత్‌ పాలిచాతో కలిసి ‘కిరాణాకార్ట్‌’ పేరుతో బెంగళూరులో స్టార్టప్‌ ప్రారంభించాడు. ఫుడ్‌, గ్రాసరీ డెలివరీ కంపెనీలు అప్పటికే బోలెడన్ని ఉన్నాయి. మరి వీళ్ల ప్రత్యేకత ఏంటంటే.. ఆర్డర్‌ ఇచ్చిన పది నిమిషాల్లోనే వినియోగదారుడికి కోరింది చేరవేస్తారు. కూరగాయలు, పండ్లు, తినుబండారాలు, నిత్యావసరాలు.. ఏదైనా. సరైన సమయంలో ప్రారంభించడంతో త్వరగా క్లిక్‌ అయ్యాడు. కొన్నాళ్లకే దాన్ని ‘జెప్టో’గా పేరు మార్చాడు. రెండేళ్లలో బాగా విస్తరించాడు. ప్రస్తుతం జెప్టో హైదరాబాద్‌ సహా దేశంలోని పది నగరాల్లో సేవలందిస్తోంది.


రూ.25వేలతో 25 వేల కోట్లు
పేరు: దివ్యాంక్‌ తురాఖియా, వ్యాపారం: పెట్టుబడులు, సంపద: రూ.25వేల కోట్లు

ఫోర్బ్స్‌ జాబితాలో స్థానం, ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం యంగ్‌ గ్లోబల్‌ లీడర్‌.. ఇవన్నీ కనీసం డిగ్రీ పూర్తి చేయని దివ్యాంక్‌కి దక్కిన ఘనతలంటే నమ్మగలరా? కంప్యూటర్‌ కోడింగ్‌పై తనకున్న అపారమైన పరిజ్ఞానమే ఈ స్థాయికి చేర్చింది. దివ్యాంక్‌ చిన్నప్పట్నుంచీ క్షణం తీరిక దొరికినా కంప్యూటర్‌కే అతుక్కుపోయేవాడు. అంతర్జాలం జల్లెడ పట్టి సొంతంగా కోడింగ్‌ నైపుణ్యాలు నేర్చుకున్నాడు. 13 ఏళ్లకే కంప్యూటర్‌ గేమ్‌ తయారు చేశాడు. ఈ ధ్యాసలో పడి చదువును నిర్లక్ష్యం చేసేవాడు. దివ్యాంక్‌ నాన్న తిట్టేవారు. అయినా తను పట్టించుకుంటేగా! ఎంతో ఒత్తిడి తెస్తే బీకామ్‌లో చేరినా.. తరగతులు ఎగ్గొట్టి కోడింగ్‌ రాయడంలో మునిగిపోయేవాడు. ఆఖరికి నాన్నని ఎంతో బతిమిలాడి రూ.25 వేలు తీసుకున్నాడు. తమ్ముడు భవిన్‌తో కలిసి 1998లో ‘డైరెక్టి’ అనే వెబ్‌ హోస్టింగ్‌ కంపెనీని ప్రారంభించారు. ఇది ఇతర సంస్థలకు వెబ్‌సైట్‌ డొమైన్లు, ఇంటర్నెట్‌ సేవలు అందిస్తుంది. తర్వాత ఒకదాని తర్వాత మరొకటి చొప్పున 11 సంస్థలు మొదలుపెట్టారు. అభివృద్ధి చేయడం.. వాటిని అమ్మేయడం. 2016లో ఐదు కంపెనీలను ఒక అమెరికా సంస్థకి రూ.1,400 కోట్లకు, గతేడాది ‘మీడియా డాట్‌నెట్‌’ని ఒక చైనా సంస్థకు ఏకంగా రూ.ఏడున్నర వేల కోట్లకు అమ్మేశాడు.


వందమంది కాదన్నా..
పేరు: హర్షిల్‌ మాథూర్‌, స్టార్టప్‌: రేజర్‌పే, సంపద: రూ.5.6వేల కోట్లు

‘నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది’ అంటూ హర్షిల్‌ మాథూర్‌ ఇన్వెస్టర్ల చుట్టూ తిరిగితే వందమందికి పైగా తిరస్కరించారు. ‘వినియోగదారులు, కంపెనీల మధ్య ఆర్థిక లావాదేవీలు నువ్వెలా చేస్తావు? నువ్వేం బ్యాంకువి కాదు కదా..’ అని అనుమానించేవారు. హర్షిల్‌ డీలా పడిపోలేదు. స్నేహితుడు శశాంక్‌కుమార్‌కి చెబితే కలిసి నడుద్దాం అన్నాడు. ఎన్నో ప్రయత్నాలు అయ్యాక ‘రేజర్‌ పే’ పురుడు పోసుకుంది. ఇప్పుడు దానికి ఎయిర్‌టెల్‌, ఐఆర్‌సీటీసీ, ఓయో, జొమాటో, స్విగ్గీ... ఇలాంటి పెద్దపెద్ద కంపెనీలు వినియోగదారులు. లక్షలమంది ఈ సేవల్ని వినియోగించుకుంటున్నారు. ఏడాదికి రూ.4.5వేల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ‘ఇది ఫెయిల్యూర్‌ బిజినెస్‌ మోడల్‌’ అనిపించుకున్న నమూనానే ముంబయి వాసి హర్షిల్‌కి కాసులు కురిపించి కోటీశ్వరుడిని చేసింది.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని