పంచ్‌లు విసిరే.. పద్ధతైన పిల్ల!

‘నాంది’తో తెలుగు సినిమాకి నాంది పలికింది. ‘అభిరామ్‌’తో అలరించడానికి సిద్ధమవుతోంది. క్యూట్‌ గాళే కాదు.. తేడా వస్తే కిక్‌బాక్సింగూ చేయగలదు. తనే నవమీ గాయక్‌. ఇవిగోండి ఆమె కబుర్లు.

Published : 08 Oct 2022 00:27 IST

‘నాంది’తో తెలుగు సినిమాకి నాంది పలికింది. ‘అభిరామ్‌’తో అలరించడానికి సిద్ధమవుతోంది. క్యూట్‌ గాళే కాదు.. తేడా వస్తే కిక్‌బాక్సింగూ చేయగలదు. తనే నవమీ గాయక్‌. ఇవిగోండి ఆమె కబుర్లు.

నేపథ్యం: నవమి కేరళ కుట్టి. చిన్నప్పట్నుంచీ సినిమాలు బాగా చూసేది. టీనేజీకొచ్చేసరికి ఎప్పటికైనా తెరపై మెరవాలనే కోరిక స్థిరపడింది. మంజూ వారియర్‌ని స్ఫూర్తిగా తీసుకుంది. మోడలింగ్‌తో మొదటి అడుగు వేసింది. వాణిజ్య ప్రకటనలతో వెలుగులోకి వచ్చాక  మలయాళ దర్శకుల దృష్టిలో పడింది.
నాందితో: మలయాళంలో మూడు సినిమాల్లో చేయడంతో ఆమె ఫొటోలు, వీడియోలు బయటికొచ్చాయి. వాటిని తెలుగు దర్శకుడు విజయ్‌ కనకమేడల చూశారు. పిలిస్తే.. ఆడిషన్‌లోనూ అదరగొట్టింది. ఇంకేం.. ‘నాంది’ అవకాశం ఒళ్లో వాలింది. షూటింగ్‌ మొదలు కాగానే లాక్‌డౌన్‌ వచ్చిపడింది. ఆ సమయాన్ని సినిమాలు చూస్తూ, తెలుగు నేర్చుకుంటూ సద్వినియోగం చేసుకుంది.  
బాక్సింగ్‌ భామ: నవమి మంచి పొడగరి. బంధువుల సలహాతో వాలీబాల్‌, బాక్సింగ్‌, కరాటే నేర్చుకుంది. చాలా పోటీల్లో పాల్గొని విజయాలు సాధించింది కూడా. నటనతో భావాలు పలికించడం ఎంత వచ్చో.. తేడా వస్తే సాహసాలూ ప్రదర్శించడం అంతలా వచ్చు. అయితే అన్నింటికీ మించి నటనపై ఎక్కువ ఇష్టం ఉండటంతో ఇదే కెరియర్‌గా తీసుకుంది.
* మహానవమి పండగంటే ఇష్టంతో కూతురికి నవమి అనే పేరు పెట్టింది ఆమె తల్లి.
* మొదటి సినిమాతోనే తెలుగు నేర్చేసుకుంది నవమి.
* మాట్లాడకుండా, నవ్వకుండా.. తను అరగంట ఉండలేదట.
* ప్రకృతి, పిల్లలంటే చాలా ఇష్టం. కుదిరినప్పుడల్లా కొండలు, అటవీ ప్రాంతాలకు వెళ్లిపోతుంటుంది.
*   మంచి బైక్‌ రైడర్‌. అన్నిరకాల టూవీలర్లు నడుపుతుంది.
* తెలుగులోకి రాకముందు అల్లు అర్జున్‌ సినిమాలు ఎక్కువగా చూసేది.
* ప్రభాస్‌, చిరంజీవిలంటే ఇష్టం. సాయిపల్లవిని ఆరాధిస్తుంది.
* నవమికి ఒక అక్క. తనే బెస్ట్‌ఫ్రెండ్‌. ఆమెతోనే అన్ని విషయాలూ పంచుకుంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని