Updated : 29 Oct 2022 17:09 IST

రిషి.. ప్రేమర్షి

మన రిషి సునాక్‌.. అగ్ర దేశం బ్రిటన్‌కి ప్రధాని ఇప్పుడు. పదిహేనేళ్ల కిందటే ఆయన మనసులో ప్రేమ ఉదయించింది! అలవోకగా ఉపన్యాసాలు ఇచ్చే తనలో.. ఆమె కనపడగానే కలవరం మొదలయ్యేది! ఆయనను అంతలా కనికట్టు చేసిన ఆమె అక్షత మూర్తి. వీళ్ల వలపు గాథేంటో తెలుసుకుందాం పదండి.

అమెరికాలోని ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం. అక్కడే రిషి, అక్షతలకు పరిచయమైంది. ఫుల్‌బ్రైట్‌ స్కాలర్‌షిప్‌మీద ఎంబీఏలో చేరారు రిషి. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు కోసం వచ్చింది అక్షత. ఒకరిది రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. మరొకరేమో ఐటీ దిగ్గజ సంస్థ అధిపతి కూతురు. రిషి కాలేజీలో జరిగే ప్రతి కార్యక్రమంలో చురుగ్గా ఉండేవారు. ఆ నాయకత్వ లక్షణాలే అక్షతకు నచ్చాయి. వేల కోట్ల ఆస్తులున్నా సాదాసీదాగా ఉండేది తను. ఆమె నిరాడంబరత రిషిని మెప్పించింది. అభిరుచులు, అభిప్రాయాలు కలవడంతో చదువులతోపాటు ప్రేమ పాఠాలూ వల్లె వేశారు.

పెద్దల అభ్యంతరం
ఇద్దరూ మేజర్లు.. కెరియర్‌లో స్థిరపడ్డవాళ్లు. పెళ్లికి అడ్డేముందనుకున్నారు. అక్కడే వచ్చింది చిక్కు. నారాయణమూర్తి నిరాకరించారు. ప్రేమ లేక కాదు. ‘సంప్రదాయాలకు నెలవైన కుటుంబం మాది. అణువణువూ ఆధునికత నింపుకొన్న సమాజం వాళ్లది. ఇద్దరికీ పొసగదేమో’ అనే అనుమానం. ఆయన కాదన్నా ప్రేమికులు వెనక్కి తగ్గలేదు. ‘నిన్ను మనసారా ప్రేమించా. నీకోసం జీవితాంతం ఎదురుచూస్తా. అవసరమైతే బ్రహ్మచారిగానే మిగిలిపోతా’ అన్నారు రిషి. ఆ నిఖార్సైన ప్రేమ కోసం తండ్రిని ఒప్పించే బాధ్యత తీసుకున్నారు అక్షత. ‘రిషి తెలివైనవాడు, అందగాడు, అన్నింటికీ మించి నిజాయతీపరుడు. ప్లీజ్‌ డాడ్‌.. ఒక్క అవకాశం ఇవ్వండి’ అని అర్థించారు. నారాయణమూర్తి అయిష్టంగానే సరేనన్నారు. రిషి లండన్‌ నుంచి బెంగళూరులో దిగారు. కాబోయే మామని మెప్పించారు. 2009లో ప్రియసఖితో ఏడడుగులు నడిచారు.  

పెళ్లయ్యాక సైతం అర్థాంగిపై ఇసుమంతైనా ప్రేమ తగ్గించుకోలేదు రిషి. అక్షత పౌరతస్వం, పన్ను చెల్లింపుపై కొన్ని విమర్శలు, వివాదాలొచ్చాయి. ఎంతమంది ఎదురుదాడి చేసినా భార్యవైపే నిలబడ్డారు. బ్రిటన్‌ ప్రధాని ఎన్నికల ప్రచారంలోనూ ఆమె వెన్నంటే ఉంది. ‘నాకు అన్నీ పక్కాగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా అల్లాడిపోతుంటా. అక్షత దేనికీ గాబరా పడదు. ఎంత పెద్ద టాస్క్‌ అయినా ఇట్టే పూర్తి చేస్తుంది. తను నా పక్కనుంటే చాలు.. నాకు కొండంత ధైర్యం’ అని ఓ వేదికపైనే చెప్పి భాగస్వామిపై ప్రేమ చాటుకున్నారు.
భాగస్వామి, కుటుంబాన్ని ప్రేమించేవాళ్లు సమాజాన్ని, దేశాన్నీ ప్రేమిస్తారట. చూడాలి.. ఈ ప్రేమర్షి బ్రిటన్‌ని ఎంతగా ప్రేమిస్తారో.. చేతల్లో ఎంత చూపిస్తారో!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని