Published : 26 Nov 2022 01:11 IST

మనోడి బాణీ ప్రపంచ వేదికపై..

‘మనవాళ్లంతా కాపీ బ్యాచ్‌. హాలీవుడ్‌ నుంచి సీన్లు, పాప్‌ సంగీతం నుంచి ట్యూన్లు దించేస్తుంటారు’ ఇలా ఉంటుంది కొందరి అభిప్రాయం. ఇది కొంత నిజం. మరికొంత అబద్ధం. ఈ సంగతి పక్కన పెడితే...  

మన సంగీత దర్శకుడు మిథున్‌ శర్మ ‘సనమ్‌ రే..’ స్వరాల్లోని ఒక ట్రాక్‌ని ప్రఖ్యాత ర్యాపర్‌ సీజీ అధికారికంగా వాడుకున్నాడు. దీనికి రాయల్టీ చెల్లిస్తున్నాడు. ఇలా చేయడం మొదటిసారి. ‘ఇది భారతీయ సంగీతానికి దక్కిన గౌరవం’ అంటున్నాడు ఏఆర్‌ రెహమాన్‌. అంతటి ఘనత సాధించిన మిథున్‌ సంగతులు.

నేపథ్యం: మిథున్‌ది సంగీత స్రష్ఠల కుటుంబం. తాత హిందుస్థానీలో దిట్ట. తండ్రి నరేష్‌ శర్మ కొన్ని బాలీవుడ్‌ సినిమాలకు పని చేశారు. మిథున్‌ ఏడేళ్లు ఉన్నప్పుడే ఆయనతో కలిసి రికార్డింగ్‌ థియేటర్‌కి వెళ్తూ గమనించేవాడు. ప్రఖ్యాత సంగీత దర్శకద్వయం లక్ష్మీకాంత్‌-ప్యారేలాల్‌లోని ప్యారేలాల్‌కి మిథున్‌ స్వయానా మేనల్లుడు. ఇంట్లో ఎప్పుడూ బాణీలు, గమకాల సందడి వినిపిస్తుంటే సహజంగానే ఆ కళపై మమకారం పెంచుకున్నాడు.

టీనేజీలోనేే: 19ఏళ్లకే ‘తేరే బిన్‌’, ‘జావెదా జిందగీ’.. గీతాల కంపోజ్‌ చేశాడు మిథున్‌. 21 ఏళ్లకే స్వర ప్రయాణం మొదలుపెట్టి 2006లో ‘బస్‌ ఏక్‌ పల్‌’ సినిమాతో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మారాడు. ఆ తర్వాత ‘అన్వర్‌’తో ఆకట్టుకున్నాడు. ఆపై ‘ఆషికీ 2’లో ‘తుమ్‌ హి హో’తో సంగీత ప్రపంచంలో సంచలనం సృష్టించాడు. అతడి సంగీతం మనసుని హత్తుకునేలా ఉండటం, వరుసగా హిట్‌ ప్రేమ గీతాలు పడటంతో రొమాంటిక్‌ కంపోజర్‌గా పేరొచ్చింది.

ఇష్టాలు: శంకర్‌ జైకిషన్‌, ఏఆర్‌ రెహమాన్‌లంటే ఇష్టం. సూఫీ సంగీతానికి పెద్ద అభిమాని. ఇష్టమైన కవి రూమి.
ఆల్‌రౌండర్‌: మిథున్‌ బాణీలు కట్టడమే కాదు.. శ్రోతల నాడి పట్టేలా పాటలూ రాయగలడు. ఎనిమిది సినిమాల్లో పాటలు రాశాడు. హిందీలో తెరకెక్కించిన ‘మర్డర్‌’, ‘కబీర్‌ సింగ్‌’తోపాటు ఇంకొన్ని సినిమాల్లో రాసిన పాటలు మంచి పేరు తెచ్చాయి. ప్రొఫెషనల్‌ సింగర్స్‌కి ఏమాత్రం తగ్గకుండా వందల పాటలు పాడాడు. పదివరకు ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ చేశాడు.

భిన్నంగా: మిథున్‌ నలుగురిలో ఒక్కడిలా ఉండాలనుకోడు. అందరికన్నా భిన్నంగా ఆలోచిస్తాడు. మొదట్లో తన సంగీతంపై విమర్శలు రావడంతో వచ్చిన అవకాశాలన్నీ వదులుకొని మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు. తను రూపొందించిన సంగీతాన్ని ఎవరూ వేలెత్తి చూపించేలా ఉండొద్దని నిష్ఠగా పని చేస్తాడు. చేసే ప్రతి సినిమా స్క్రిప్ట్‌ చదివి, కథలోని పాత్రల్ని అర్థం చేసుకున్నాకే సంగీతం చేయడానికి ఒప్పుకుంటాడు మిథున్‌. దర్శకుడు, హీరోలకు కాదు.. ముందు నాకు నచ్చితేనే మంచి పాటలు బయటికొస్తాయి అంటాడు. తను పార్టీలు, సామాజిక మాధ్యమాలకు దూరం. ఇప్పటికీ వాట్సప్‌ వాడటం లేదంటే నమ్మగలరా..?కొన్ని హిట్లు..
* వో లమ్హే.. వో బాతే..
- జెహర్‌
బస్‌ ఏక్‌ పల్‌.. తేరే బిన్‌
- బస్‌ ఏక్‌ పల్‌
* మౌలా మేరే మౌలా
- అన్వర్‌
* యే కసూర్‌..   - జిస్మ్‌ 2
తుమ్‌ హి హో..   ఆషికీ 2
* ఆషికీ ఆగయీ  - రాధేశ్యాం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు