గిరిపుత్రుడి సాహితీ సేద్యం
పుట్టి పెరిగిన చెట్టూచేమే అతడి అక్షరానికి ఆయువు. తనవాళ్ల కలిమిలేములే కవితలకు ముడిసరుకు. ఆ అనుభవ పాఠాలతో అల్లిన భావాలు డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశాలయ్యాయి. సాహితీ సౌరభాలు ఎల్లలు దాటి పరిమళించాయి. ఈ ఇరవై నాలుగేళ్ల యువ రచయితని ఎన్నో అవార్డులు, పురస్కారాలు వరించాయి. అతగాడే రమేష్ కార్తీక్ నాయక్. తనతో మాట కలిపింది ఈతరం.
ఇష్టమైన పనిని ఎవరైనా మనసు పెట్టి చేస్తారు. అది మనసుల్ని కదిలించేలా ఉంటే.. గుర్తింపు వెతుక్కుని మరీ వస్తుంది. నిజామాబాద్ జిల్లా వివేక్‌నగర్ తండా వాసి రమేశ్ నేపథ్యం అలాంటిదే. రమేశ్ చిన్ననాటి నుంచే తను పుట్టి పెరిగిన మట్టి పరిమళాలు.. తండా వాసుల తండ్లాటలు.. ప్రకృతమ్మతో మమేకమైన జీవనశైలి.. కల్మషం అంటని గిరిపుత్రుల బతుకుల్ని బొమ్మలుగా వేసేవాడు. కవితలుగా రాసేవాడు. ఇరవయ్యేళ్లు వచ్చేసరికి ఈ భావాల్నింటికీ అక్షర రూపమిచ్చి కవితా సంపుటిగా మలిచాడు. దీనికి సాహితీ ప్రియుల సహకారం తోడై ‘బల్దేర్ బండి’గా జనం ముందుకొచ్చింది. గిరిజనులు బతుకుదెరువు కోసం వలస వెళ్లే క్రమంలో వినియోగించే ఎడ్ల బండి నేపథ్యంగా ఈ కవితలు ఉంటాయి. ఈ మట్టి పరిమళాలు పాఠకులకు ఎంతగా నచ్చాయంటే.. ఇందులోని ‘జారేర్ బాటి’ కవిత కాకతీయ విశ్వవిద్యాలయ డిగ్రీ కోర్సు ఐదో సెమిస్టర్‌లో పాఠ్యాంశంగా చేర్చారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం ఎంఏ తెలుగు నాలుగో సెమిస్టర్‌లో పుస్తకం మొత్తాన్ని యూనిట్ పాఠ్యాంశంగా ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశ పెట్టారు. నూనూగు మీసాల వయసులో ఓ కుర్రాడు రాసిన కవితలు విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులకు పాఠ్యాంశంగా మారడం గొప్పే కదా!
రమేశ్‌ది సన్నకారు రైతు కుటుంబం. తమలా మట్టి పిసుక్కోకూడదని పిల్లల్ని మంచి స్కూళ్లలో చేర్పించారు తల్లిదండ్రులు. ఆంగ్ల మాధ్యమంలో చేరినా.. గురువుల ప్రోత్సాహంతో తెలుగులో కవితలు, కథలు రాయటం ప్రారంభించాడు రమేశ్. సాహిత్యంపై మక్కువతో తరగతి పుస్తకాలకు బదులు కథలు, కవితల పుస్తకాలనే నేస్తాలుగా మలచుకునేవాడు. నిత్యం వాటితోనే కాలం వెళ్లదీసేవాడు. వీటి మోజులో పడి కొడుకు ఎక్కడ చదువులో వెనకబడిపోతాడో అని భయంతో తల్లడిల్లేవాళ్లు కన్నవాళ్లు. ఆ పుస్తకాలను దాచేవారు. దాంతో రమేశ్ సాహిత్యాభిలాషకు కొంచెం విరామం వచ్చింది. కానీ తర్వాత తను పాలిటెక్నిక్‌లో చేరడంతో మళ్లీ సాహిత్య సేద్యం మొదలైంది. తన పుస్తకం తెలంగాణ భాషా సంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ఆవిష్కృతమైంది. ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు రమేశ్‌ని పొగడ్తల్లో ముంచెత్తుతుంటే అప్పుడుగానీ తనేం చేస్తున్నాడో అర్థం కాలేదు కన్నవాళ్లకి.
కవితలే కాదు.. గిరిజనుల జీవితాల్లో చోటుచేసుకునే విషాదాలు, మూఢనమ్మకాల విపరిణామాలు కథాంశాలుగా గతేడాది ఎనిమిది కథలు రాశాడు రమేశ్. ‘ఢావ్లో’ పేరిట వచ్చిన ఈ కథాసంపుటిని అన్వీక్షికి పబ్లిషర్స్ ప్రచురించారు. హృద్యంగా చెప్పిన ఈ కథలు దేశ హద్దులు దాటి మరీ మనసుల్ని హత్తుకున్నాయి. వీటిని కెనడాలో స్థిరపడ్డ భారతీయ రచయిత్రి వీబీ సౌమ్య ఆంగ్లంలోకి అనువదించారు. ‘ది స్టోరీ ఆఫ్ బర్త్’ పేరుతో అమెరికాలోని ఐవోడబ్ల్యూఏ విశ్వవిద్యాలయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
* రమేశ్ ఆంగ్ల కవితలు ఔట్‌లుక్ ఇండియా, లైవ్‌వైర్ తదితర మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి.
* బెంగాలీ రచయిత్రి మహాశ్వేతాదేవి ఆదివాసీల జీవనశైలిపై రాసిన కథలు, నవలలు.. పంజాబీ రచయిత్రి అమృతా ప్రీతం కవితలు రమేశ్‌కి స్ఫూర్తి.
* తన కవితల్ని కిరణ్‌భట్ స్పానిష్‌లో, ‘బైల్‌గాడీ’ పేరుతో పీసీ వసంత హిందీలోకి అనువదించారు.
* రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమశాఖ మంత్రి చేతుల మీదుగా ట్రైబల్ అఛీవర్ అవార్డు అందుకున్నాడు. బంజారా ఐకాన్, సేవాలాల్ కవిరత్నగా ఎంపికయ్యాడు.
* ఉగాది సాహిత్య పురస్కారం, కళాహంస, చిలకమర్తి లక్ష్మీనరసింహం పురస్కారం, నవ స్వరాంజలి పురస్కారాలు వరించాయి.
* చెక్‌మక్ (చెకుముకిరాళ్లు) పేరుతో కొత్త ఆంగ్ల కవితా సంపుటి తీసుకొస్తున్నాడు.
- రేవళ్ల వెంకటేశ్వర్లు, నిజామాబాద్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Khushbu Sundar: రాహుల్‌కు జైలుశిక్ష.. వైరల్ అవుతున్న ఖుష్బూ పాత ట్వీట్
-
General News
Hyderabad: సిగ్నల్ ఫ్రీగా ఎల్బీనగర్.. కూడలికి శ్రీకాంతాచారి పేరు : కేటీఆర్
-
Crime News
Hyderabad: విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య
-
General News
Rahul Gandhi: ‘సేవ్ రాహుల్ గాంధీ, సేవ్ డెమోక్రసీ’.. ఓయూలో నిరసన ర్యాలీ
-
India News
Sukesh- Jacqueline: ‘నా బుట్టబొమ్మ జాక్వెలిన్‌కు’.. జైలు నుంచి సుకేశ్ మరో ప్రేమ లేఖ
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు