Updated : 17 Dec 2022 01:04 IST

శిఖరాలు చిన్నబోయేలా...

పర్వతాలు అధిరోహించడం అంత తేలికేం కాదు... గుండెలో దమ్ముండాలి.. ఒంట్లో సత్తువ కావాలి. ప్రాణాలు పణంగా పెట్టే తెగువ చూపాలి.. నెలలకొద్దీ కఠోర సాధన చేయాలి. అప్పుడే ఎవరెస్ట్‌లు తలవంచుతాయి.. కిలిమంజారోలు చిన్నబోతాయి. ఈ లక్షణాలన్నీ ఒంట పట్టించుకున్న విజేతలు ఈ మధ్య కాలంలో ఎక్కువగానే కనిపిస్తున్నారు. వీళ్ల సంఖ్య పెరగడాకి కారణమేంటి? యువతను ఇలాంటి సాహసయాత్రలకు పురిగొల్పుతున్న వైనమేంటి??

‘పర్వతారోహణలో చాలా అవరోధాలుంటాయి. ఎత్తుకు వెళ్లినకొద్దీ ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోతుంటాయి. శిఖరం చేరే దశలో శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటారు. ఈ సమయంలో అప్రమత్తంగా లేకపోతే పర్వతారోహకులకు చాలా ప్రమాదకరం’ అంటున్నాడు ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని ఈమధ్యే విజయవంతంగా అధిరోహించిన యువకుడు వివేక్‌. ‘ఎముకలు కొరికే చలిలో, తాగేనీరు సైతం గడ్డ కట్టే క్లిష్ట వాతావరణంలో వంద మీటర్లు నడవాలంటేనే గంటలు పట్టొచ్చు. దీంతోపాటు అడుగడుగునా లోయల్లాంటి అపాయాలు పొంచి ఉంటాయి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. మన శరీరం కూడా దొరకదు. దీనికితోడు ఒక యాత్ర పూర్తి కావాలంటే.. లక్షల రూపాయల ఖర్చు అవుతుంది’ అంటూ తన అనుభవాన్ని వివరిస్తున్నాడు యశ్వంత్‌. అయినా ఇంత కఠిన పరిస్థితుల్లోనూ పర్వతాల అంతు చూద్దాం అని అడుగు ముందుకే వేస్తున్నారు. కష్టనష్టాలకోర్చి ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలను అవలీలగా అధిరోహిస్తున్నారు ఎంతోమంది.

ఎందుకీ ఉత్సాహం?

* ఈ మధ్యకాలంలో పర్వతారోహకులకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాల నుంచి అత్యధిక ప్రోత్సాహం, నజరానాలు అందుతున్నాయి.

* జీవితం అంటే నిరంతరం చలించడం.. ప్రపంచాన్ని గమనించడం.. అనుకునేవారు మౌంటెనీరింగ్‌ బాట పడుతున్నారు.

* అందరికంటే భిన్నంగా ఉండాలి.. నాకంటూ ఓ గుర్తింపు దక్కాలనే తాపత్రయం ఉన్నవారూ పర్వతారోహకులు అవుతున్నారు.

* కఠినమైన సవాళ్లతో కూడుకున్న పర్వతారోహణలో విజయం సాధిస్తే.. జీవితంలో ఎన్ని కష్టాలైనా ఎదుర్కోగలమని భావించేవారూ ఇటువైపు వస్తున్నారు.

* పరిస్థితి క్రమంగా మారుతోంది. గతంలో కాకుండా ఇప్పుడు పర్వతారోహణకు స్పాన్సర్లూ దొరుకుతున్నారు. సాయం చేస్తున్నారు.

* నెహ్రూ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెనీరింగ్‌ (ఉత్తర కాశీ), హిమాలయన్‌ మౌంటెనీరింగ్‌ ఇనిస్టిట్యూట్‌ (డార్జిలింగ్‌)లాంటి ప్రఖ్యాత సంస్థలతోపాటు స్థానిక సంస్థలూ నాణ్యమైన శిక్షణనిస్తున్నాయి.

* విజేతలను మీడియా ఆకాశానికెత్తేస్తోంది. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం పెరుగుతోంది. వారి నుంచి ఔత్సాహికులు స్ఫూర్తి పొందుతున్నారు..

* శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉంటేనే పర్వతారోహణ సాధ్యం. ఆ రెండింట్లో నిరూపించుకోవాలి అనుకునేవాళ్లు దీన్నో ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.


ఏడు ఖండాల్లో వేట

వాసం వివేక్‌ కుమార్‌ది ములుగు జిల్లాలోని మారుమూల మంగపేట ఓడగూడెం కాలనీ. బెంగళూరులో బీటెక్‌ పూర్తవగానే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వచ్చింది. జీవితం హాయిగా సాగిపోతున్నా ఏదో అసంతృప్తి. కొంచెం సరదా.. కొంచెం సాహసం చేయాలనే ఉద్దేశంతో.. ఓసారి స్నేహితులతో కలిసి కర్ణాటకలోని నందిహిల్స్‌కు వెళ్లాడు. అక్కడ కొండలు ఎక్కుతూ స్నేహితులంతా అలసిపోయి మధ్యలోనే ఆగిపోతే.. వివేక్‌ అలవోకగా పూర్తి చేశాడు. చిన్నప్పుడు తనకి మంగపేటలో పెద్దపెద్ద గుట్టలు ఎక్కే అలవాటు ఉండేది. అదే కలిసొచ్చింది. మిగతా వాళ్లంతా వివేక్‌ని మెచ్చుకోవడంతో.. తన గమ్యమేంటో అర్థమైంది. ఆరోజు నుంచి ట్రెక్కింగ్‌ని దినచర్యగా మార్చుకున్నాడు. దీంతోపాటు స్కూబా డైవింగ్‌, స్కై డైవింగ్‌, వాటర్‌ సర్ఫింగ్‌, పారా గ్లైడింగ్‌.. చేసేవాడు. వారాంతాల్లో వివిధ ప్రాంతాలకు ట్రెక్కింగ్‌కు వెళ్లేవాడు. అలా బ్రహ్మతాల్‌, కేదారినాథ్‌, ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌, హరిహర.. ఇలా దేశంలోని 23 ప్రముఖ పర్వతాలను అధిరోహించాడు. ఈ క్రమంలో విదేశీ పర్వతారోహకులతోనూ పరిచయాలేర్పడ్డాయి. వారి ద్వారా వివిధ ఖండాల్లోని ఎత్తైన పర్వతాల గురించి తెలుసుకున్నాడు. అప్పట్నుంచి వాటన్నింటినీ జయించడమే లక్ష్యంగా చేసుకున్నాడు. ఈమధ్యే ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన కిలిమాంజారోని పూర్తి చేశాడు. త్వరలోనే మిగతా ఖండాల్లోని పర్వతాలనూ చుట్టేసి వస్తానంటున్నాడు వివేక్‌.

 - సోగాల స్వామి, జయశంకర్‌ భూపాలపల్లి


తండా మురుస్తోంది

మహబూబాబాద్‌ జిల్లా ఉల్లేపల్లి తండా వాసి భూక్య యశ్వంత్‌ది మరో గాథ. భారత సైన్యంలో చేరడం తన కల. అదే లక్ష్యంతో హైదరాబాద్‌ దగ్గర్లోని ఇబ్రహీం పట్నంలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ)లో చేరాడు. అధ్యాపకులు శేఖర్‌బాబు, రాకేశ్‌, పరమేశ్‌ అతడ్ని పర్వతారోహణలో బాగా ప్రోత్సహించారు. తొలుత యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి ఖిల్లాపై తర్ఫీదు పొందాడు. ఆపై ఒక్కో పర్వతాన్నే ఎక్కుతూ మంచి మౌంటెనీర్‌గా పేరు సంపాదించాడు. గతేడాది జులైలో జమ్ముకశ్మీర్‌లోని అత్యంత క్లిష్టమైన ఖార్దూంగ్లా శిఖరం అధిరోహించాడు. ఆగస్టులో ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్నీ జయించాడు. ఈ సమయంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక తీవ్రమైన వాంతులతో నీరసించిపోయినా వెనక్కి తగ్గలేదు. తర్వాత 2022 సెప్టెంబరు 11న రష్యాలో 5,642 మీటర్ల ఎత్తైన మౌంట్‌ ఎల్‌బ్రస్‌ని అధిరోహించాడు. అక్కడి వాతావరణం మైనస్‌ 22 డిగ్రీలతో అత్యంత చలిగా ఉంటుంది. అయినా ఎన్నో అవాంతరాలు తట్టుకొని శిఖరాగ్రానికి చేరి భారత జాతీయ పతాకం ఎగరేశాడు. ఇది కాకుండా జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలోని కొన్ని ఎత్తైన శిఖరాలూ చేరుకున్నాడు. ఎవరెస్టుని జయించడం ప్రతి పర్వతారోహకుడి కల. నా ఆఖరి మజిలీ అదే అంటున్నాడు యశ్వంత్‌. 

- బొల్లం శేఖర్‌, మహబూబాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు