గోల్డ్‌ ఏటీఎం..రూపకర్త మనోడే!

మనకి డబ్బులొచ్చే ఏటీఎం తెలుసు... వాటర్‌ ఏటీఎం గురించీ విన్నాం! కానీ ఈమధ్య గోల్డ్‌ ఏటీఎం జనాల్ని తెగ ఆకట్టుకుంటోంది.

Updated : 21 Jan 2023 08:44 IST

మనకి డబ్బులొచ్చే ఏటీఎం తెలుసు... వాటర్‌ ఏటీఎం గురించీ విన్నాం! కానీ ఈమధ్య గోల్డ్‌ ఏటీఎం జనాల్ని తెగ ఆకట్టుకుంటోంది. విదేశాల్లోనే అక్కడక్కడ ఉన్న ఇలాంటి దానిని తొలిసారి ఇండియాలోనూ ప్రారంభించారు. అదీ హైదరాబాద్‌లో! ఈ క్లిష్టమైన యంత్రం, దాని సాఫ్ట్‌వేర్‌ని రూపొందించింది మన తెలుగు యువకుడే. తనే ‘ఓపెన్‌ క్యూబ్స్‌’ వ్యవస్థాపకుడు పి.వినోద్‌.

వినోద్‌ది ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి. తండ్రి వ్యాపారరీత్యా కొన్నేళ్లు బెంగళూరులో ఉన్నారు. అక్కడే వేసవి సెలవుల్లో సరదాగా వెబ్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులో చేరాడు. పదోతరగతి పూర్తయ్యేసరికి అందులో పట్టు సాధించాడు. అప్పటి నుంచే సొంతంగా వెబ్‌సైట్‌లు రూపొందిస్తూ పాకెట్‌మనీ సంపాదించేవాడు. అలా మొదలైన ప్రయాణాన్నే కెరియర్‌గా మార్చుకున్నాడు. ఇంజినీరింగ్‌కి వచ్చేసరికి సొంత ప్రాజెక్టులతో పాటు స్నేహితులకు సలహాలు ఇచ్చే, అధ్యాపకులకు అకడమిక్‌ ప్రాజెక్టులు చేసిపెట్టే స్థాయికి ఎదిగాడు. ఎంబీఏ పూర్తయ్యాక ప్రముఖ టెలికాం కంపెనీలో భాగస్వామిగా చేరాడు. ఆపై విశాఖపట్నంలో జీవిత బీమా కంపెనీలో మూడున్నరేళ్లు పనిచేసి మార్కెటింగ్‌, సేల్స్‌ మెలకువలు నేర్చుకున్నాడు.

2017లో హైదరాబాద్‌కి వచ్చేశాడు వినోద్‌. ఓవైపు ఉద్యోగం చేస్తూనే తనకంటూ గుర్తింపు తెచ్చే ఆవిష్కరణలపై పని చేయడం మొదలు పెట్టాడు. మొదటిసారి బధిరులకు తేలిగ్గా సమాచారం అందించే ఒక కమ్యూనికేషన్‌ పరికరాన్ని రూపొందించాడు. దీనికి పేటెంట్‌ దక్కింది. ఈ క్రమంలోనే ఏడేళ్ల కిందట హైదరాబాద్‌లో ‘ఓపెన్‌ క్యూబ్స్‌’ అనే అంకుర సంస్థ ప్రారంభించాడు. కొత్త కంపెనీ కావడంతో మొదట్లో ప్రాజెక్టులు సంపాదించడంలో చాలా సవాళ్లే ఎదురయ్యాయి. అయినా మొదటి ఆవిష్కరణ భిన్నంగా ఉండాలనుకొని ‘ఎన్‌హెచ్‌ 7’ అనే అప్లికేషన్‌ని తయారు చేశాడు. ఇది ఫేస్‌బుక్‌, ట్విటర్‌, టెలిగ్రామ్‌లాంటి సామాజిక మాధ్యమాలను పోలిన యాప్‌. ఫీచర్లు బాగుండటం, వాడటం తేలిక కావడంతో.. రెండు నెలల్లోనే 18 లక్షల మంది వినియోగించడం మొదలుపెట్టారు. దీని కోసం ఎంతో కష్టపడి రూ.2 కోట్ల నిధులు సమీకరించాడు. ఆ యాప్‌ విజయవంతం కావడంతో సింగపూర్‌లోనూ కార్యాలయం తెరిచాడు.

అంతా సవ్యంగా సాగిపోతున్న దశలో కరోనా విరుచుకుపడింది. కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. ఆఫీసులు, యాప్‌ల నిర్వహణకే రూ.20లక్షలు ఖర్చయ్యేది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో.. ఆ యాప్‌ని ఒక అమెరికా కంపెనీకి లాభానికే విక్రయించాడు. తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ కోసం ‘ఆజాదీ’ అనే యాప్‌ రూపొందించారు. దీంతో బాగా పేరు రావడంతో.. ‘గోల్డ్‌ సిక్కా’ కంపెనీ నిర్వాహకులు గోల్డ్‌ ఏటీఎం తయారు చేయమంటూ వినోద్‌ని సంప్రదించారు. దుబాయ్‌, లండన్‌ నగరాల్లో ఉండే ఈ తరహా ఏటీఎంల తయారీ.. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సిబ్బందితో కలిసి దాదాపు మూడు నెలలపాటు శ్రమించి వారు చెప్పినట్టే గోల్డ్‌ ఏటీఎం తయారు చేశాడు. దీనికోసం సొంతంగా సాఫ్ట్‌వేర్‌ రూపొందించాడు. ఇందులో నుంచి 0.5 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు బంగారాన్ని డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. విదేశాల్లో అయితే 20 గ్రాములకంటే తక్కువగా డ్రా చేయలేరంటున్నాడు. దేశంలోనే తొలిసారిగా మొదలైన ఈ గోల్డ్‌ ఏటీఎంను హైదరాబాద్‌లోని బేగంపేట్‌లో ప్రారంభించారు. లండన్‌ బులియన్‌ మార్కెట్‌ ఆధారంగా నాలుగు సెకన్లకోసారి ఇందులో బంగారం ధర మారిపోతుంటుంది. ఈ యంత్రాన్ని ముప్ఫై శాతం తక్కువ ఖర్చుతోనే రూపొందించామంటున్నాడు వినోద్‌. ఇది సక్సెస్‌ కావడంతో.. ఔషధ మందుల ఏటీఎం రూపొందించే పనిలో ఉన్నాడు. అంతకుముందు పైరసీని అరికట్టే జామర్‌ని తయారు చేశాడు. దీన్ని థియేటర్‌లో ఒకచోట అమర్చితే చాలు.. రికార్డు చేయడానికి ప్రయత్నించే కెమెరాలు ఏవీ పని చేయవు. అలాగే పైరసీ చేసిన వీడియోలను సైతం వాటర్‌మార్క్‌ సాంకేతిక ద్వారా ఎక్కడ, ఎప్పుడు? ఎలా పైరసీ చేశారు అని తెలుసుకోవచ్చు అంటున్నాడు వినోద్‌.
కె.ప్రశాంత్‌గౌడ్‌, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని