వృత్తి భేష్.. ప్రవృత్తి శెభాష్!
తనో సైనికుడు. పాటలు బాగా పాడతాడు. తెలుగు ఇండియన్ ఐడల్‌లో ఆకట్టుకునే ప్రదర్శనా చేస్తున్నాడు... ఆయన చిన్నపిల్లల వైద్యుడు. జీవం ఉట్టిపడే బొమ్మలు వేస్తున్నాడు. అరుదైన తంజావూరు చిత్రకళలో నిపుణుడు. వాళ్ల వృత్తేంటి.. చేస్తున్న పనేంటి? అనే సందేహం వచ్చిందా? మనసు పెట్టి ప్రయత్నిస్తే..
తనో సైనికుడు. పాటలు బాగా పాడతాడు. తెలుగు ఇండియన్ ఐడల్‌లో ఆకట్టుకునే ప్రదర్శనా చేస్తున్నాడు... ఆయన చిన్నపిల్లల వైద్యుడు. జీవం ఉట్టిపడే బొమ్మలు వేస్తున్నాడు. అరుదైన తంజావూరు చిత్రకళలో నిపుణుడు. వాళ్ల వృత్తేంటి.. చేస్తున్న పనేంటి? అనే సందేహం వచ్చిందా? మనసు పెట్టి ప్రయత్నిస్తే.. దేంట్లో అయినా రాణించొచ్చు అని నిరూపించిన ఈ ఇద్దరు యువతరంగాల స్ఫూర్తి ప్రయాణం మీకోసం.
గాయక సైనికుడు
సరిహద్దుల్లో గస్తీ కాసే సైనికుడి గళంలో గమకాలు పలుకుతున్నాయి. దేశసేవే మిన్నగా భావించే ఆ గాయకుడి ప్రతిభకు మిన్నంటేలా చప్పట్లు మోగుతున్నాయి. తెలుగు ఇండియన్ ఐడల్‌లో దూసుకెళ్తున్న ఆ జవానే చక్రపాణి.
పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్యోగం. నిత్యం అప్రమత్తంగా ఉండే విధులు. అలాంటి వ్యక్తి టీవీ తెరపై కనిపిస్తూ.. పాటతో అందరి మనసులు గెలుస్తాడని ఎవరూ అనుకోరు. కానీ జరుగుతోందదే. ఎందుకో తెలియదు చక్రపాణికి చిన్నప్పట్నుంచీ పాటపై మమకారం. సరదాగా కూనిరాగాలు తీసేవాడు. దేశభక్తి గీతాలు పాడేవాడు. ఎనిమిదో తరగతిలో ఇలాగే ఓ పాట పాడుతుంటే.. ఒక స్నేహితుడు సరదాగా దాన్ని రికార్డు చేశాడు. ‘చక్రీ.. నువ్వు బాగా పాడుతున్నావ్ చూడూ.. ఏదైనా టీవీ షోలో ప్రయత్నించవచ్చు కదా’ అన్నాడు. అప్పుడే చిన్నగా ఆలోచన మొదలైంది..
నాన్న చిన్నప్పుడే చనిపోవడంతో.. తనవంతుగా కుటుంబ భారం మోయడానికి సిద్ధమయ్యాడు చక్రపాణి. ఇంటర్ పూర్తవగానే.. 19 ఏళ్ల వయసులోనే పరీక్ష రాసి, సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్)లో సైనికుడిగా చేరాడు. డ్యూటీ ఎక్కగానే యథా ప్రకారం పాటతో సేద తీరేవాడు. ఉద్యోగ విధుల్లో తోటి సైనికుల ఒత్తిడిని పోగొట్టేలా ‘సందేశ్ ఆతే హై’, ‘మిట్టీ మే మిల్ జావా’, ‘ఆయే మేరే వతన్ కే లోగో..’, ‘పుణ్యభూమి నా దేశం నమో నమామి..’ ఇలాంటి సాంగ్స్ పాడి వినిపించేవాడు. ఇదికాకుండా తను పనిచేసే 125 బెటాలియన్ వార్షికోత్సవం, ఆగస్టు 15, జనవరి 26, దీపావళి పండగలప్పుడు.. సాంస్కృతిక కార్యక్రమాల్లో అతడి పాట తప్పనిసరిగా ఉండాల్సిందే. చక్రపాణి గాత్రాన్ని తోటి సైనికులు ఆస్వాదించేవాళ్లు. అడిగి మరీ పాడించుకునేవాళ్లు. ఆ ప్రోత్సాహం, పొగడ్తలు విన్నకొద్దీ ఒక్కసారైనా ఏదైనా షోలో పాల్గొనాలని అనుకునేవాడు. అదే సమయంలో తెలుగు గాయకుడు ఎల్‌వీ రేవంత్ ‘ఇండియన్ ఐడల్’ నెగ్గడంతో తనకీ ఆ షోలో పాల్గొనాలనే ఆసక్తి ఎక్కువైంది. హిందీపై పెద్దగా పట్టు లేకపోవడంతో.. ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్‌కి ప్రయత్నించి ఎంపికయ్యాడు.
నాకు సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానం ఇచ్చింది ఆర్మీ ఉద్యోగమేనంటాడు చక్రపాణి. అందుకే ఒక్కసారి సైనికుడి దుస్తుల్లో వేదికనెక్కి పాడి వెళ్లిపోదాం అనుకున్నాడు. కానీ తనకు సహజసిద్ధంగా అబ్బిన కళతో, ఏళ్లకొద్దీ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నవారితో పోటీ పడి మరీ ముందుకెళ్తున్నాడు. నిజానికి ఈ షోకి ఎంపికవడమే పెద్ద విజయం. దీనికి వేలమంది పోటీ పడతారు. అనేక వడపోతల అనంతరం అతికొద్దిమందే వేదికనెక్కి పాడే అవకాశం చేజిక్కించుకుంటారు. ఆ దశలన్నీ దాటి చక్రపాణి తుది 12 మంది జాబితాలోకి వచ్చాడు. పాడటం మొదలు పెట్టాక న్యాయనిర్ణేతలు తమన్, కార్తీక్, గీతామాధురిల ప్రశంసలు పొందాడు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటల ప్రత్యేక ఎపిసోడ్‌లో అందర్నీ మెప్పించేలా పాడి, ఎస్పీ బాలు గోల్డెన్ మైక్‌ని కానుకగా అందుకున్నాడు. అతిథిగా వచ్చిన హీరో బాలకృష్ణని ఆకట్టుకొని, ఆయనతో సైనిక వందనం స్వీకరించాడు. క్లాసిక్, మెలోడీలు ఇష్టపడే చక్రపాణి ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’లోని ‘ఓ సైనికా..’, ‘లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో..’లాంటి ఫాస్ట్‌బీట్‌లతోనూ అదరగొట్టాడు. అన్నింటికన్నా ముఖ్యంగా తను ప్రాణంలా భావించే అమ్మ సమక్షంలో పాడటం ఓ మర్చిపోలేని అనుభూతి అంటున్నాడు.
కళా వైద్యుడు...
రోజంతా ఊపిరి సలపనంత పనిలో ఉండే వైద్యులు ఏమాత్రం ఖాళీ ఉన్నా సేద తీరాలనుకుంటారు. యువ డాక్టర్ శ్రీకాంత్ కోనా అలా కాదు. కరోనా కాలంలో తనకి దొరికిన సమయంలో తంజావూరు చిత్రలేఖనంపై పట్టు సాధించాడు. ఈ అరుదైన కళ గొప్పతనాన్ని నలుగురికీ చాటి చెబుతున్నాడు.
శ్రీకాంత్ హైదరాబాదీ. వైద్యవిద్యలో భాగంగా కొన్నాళ్లు తమిళనాడులో ఉన్నాడు. అక్కడ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంతో సాగే తంజావూరు చిత్రలేఖనంపై పరిచయం మొదలైంది. దాన్ని సరదాగా ప్రయత్నించేవాడు. తర్వాత హైదరాబాద్ వచ్చేసి ఓ ప్రముఖ ఆసుపత్రిలో పిల్లల వైద్యుడిగా కెరియర్ ప్రారంభించాడు. అంతా బాగానే సాగుతున్న సమయంలో కరోనాతో కొన్నాళ్లు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమయంలోనే తనకిష్టమైన తంజావూరు చిత్రలేఖనంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాడు. కావాల్సిన సమాచారం ఆన్‌లైన్‌లో సంపాదించాడు. స్నేహితుల సాయంతో వేయాల్సిన పద్ధతి నేర్చుకున్నాడు. మెల్లమెల్లగా ప్రయత్నిస్తూ ఎనిమిది నెలల్లో మొదటి బొమ్మను వేశాడు. తర్వాత పదుల సంఖ్యలో చిత్రాలు గీశాడు. వీటన్నింటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది డ్యాన్సింగ్ సీత. రాముడితో నిశ్చితార్థం కుదిరాక, ఆ ఉంగరాన్ని పట్టుకుని సీతాదేవి నృత్యం చేస్తున్న బొమ్మను బంగారం, వజ్రాలతో పూర్తి చేశాడు. ఎంతో క్లిష్టమైన పని అయినప్పటికీ ఓపికతో, తీరిక దొరికినప్పుడల్లా ఈ బొమ్మను గీస్తుండేవాడు. ఆరడుగుల ఎత్తైన ఈ చిత్రాన్ని పూర్తి చేసేందుకు 8 నెలలు పట్టిందంటున్నాడు శ్రీకాంత్.
అరుదైన కళ: క్రీ.శ.1676 నుంచి తంజావూరు చిత్రలేఖనం మనుగడలో ఉంది. విజయనగర రాజులు రాజ్యాన్ని విస్తరిస్తున్న కాలంలో 16వ శతాబ్దానికి చెందిన భారతీయ కళ నుంచి ప్రేరణ పొందినదే తంజావూరు చిత్రలేఖనం. దీనిని తంజోర్ పెయింటింగ్ అని కూడా అంటారు. కళ్లు చెదిరే రంగులు, అందమైన అలంకరణలు, బంగారు రేకులను ఉపయోగిస్తూ తీర్చిదిద్దే దేవతల వర్ణనలకు ఈ పెయింటింగ్ ప్రసిద్ధి. ఈ కళారూపం సంవత్సరాలుగా అనేక మార్పులకు లోనవుతున్నా ఇప్పటికీ ఎంతోమంది అభిమానులున్నారు.
బషీర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Manipur Violence: మణిపుర్ సీఎం ఇంటిపై దాడి చేసేందుకు అల్లరిమూక ప్రయత్నం
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు..12 రాశుల ఫలితాలు ఇలా... (29/09/2023)
-
Crime: డబ్బు కోసం దారుణ హత్య.. తీరా చూస్తే..!
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Netherlands: నెదర్లాండ్స్‌లో కాల్పుల కలకలం.. తొలుత ఓ ఇంటిపై.. ఆతర్వాత ఆసుపత్రిలో
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్