చిత్రం.. భళారే..
మహబూబాబాద్ జిల్లా కొమ్ములవంచ వెంకటేష్ సొంతూరు. చిన్నప్పట్నుంచీ సినిమాలు బాగా చూడటం అలవాటు. ఇంటికొచ్చి ఆ సినిమాలోని హీరోహీరోయిన్ల చిత్రాలు వేసేవాడు. టైటిళ్లు రాసేవాడు
సామాజికహితం తోడైతేనే కళకి సార్థకత అంటాడు వెంకటేష్ కందునూరి. ఇప్పటివరకు వెయ్యికి పైగా వర్ణచిత్రాలు వేసిన కళాకారుడు తను. నిగూఢమైన అర్థంతో.. మానవాళికి మేలు చేసే సందేశంతో వేసే తన పెయింటింగ్స్ పలువురి ప్రశంసలందుకుంటున్నాయి. తాజాగా ధరిత్రిని కాపాడాలనే కాన్సెప్ట్‌తో వేసిన వర్ణచిత్రాన్ని ఈమధ్యే గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. అలాగే వందమందికిపైగా అంతర్జాతీయ క్రికెటర్లు సంతకాలు చేసిన పెయింటింగ్ ప్రపంచరికార్డుకి చేరువైంది. తనతో ఈతరం మాట కలిపింది.
మహబూబాబాద్ జిల్లా కొమ్ములవంచ వెంకటేష్ సొంతూరు. చిన్నప్పట్నుంచీ సినిమాలు బాగా చూడటం అలవాటు. ఇంటికొచ్చి ఆ సినిమాలోని హీరోహీరోయిన్ల చిత్రాలు వేసేవాడు. టైటిళ్లు రాసేవాడు. వాటిని చూసి ఉపాధ్యాయులు, స్నేహితులు బాగా ప్రోత్సహించడంతో మరింత ధ్యాస పెట్టసాగాడు. కొన్నాళ్లకి.. ఒక వ్యక్తిని అలా చూస్తే చాలు.. అలవోకగా బొమ్మ గీసేలా పట్టు సాధించాడు. కళాకారుడు, రాజకీయ నాయకుడు, సెలెబ్రిటీ ఎవరిని కలిసినా వాళ్ల పోర్ట్రెయిట్ వేయడం.. బహుమతిగా అందించడం అలవాటుగా మార్చుకున్నాడు. అలా అబ్దుల్ కలాం, లతా మంగేష్కర్, సోనియా గాంధీ, ప్రణబ్ ముఖర్జీ, సచిన్ తెందుల్కర్, రజనీకాంత్, ధోనీ, వివియన్ రిచర్డ్స్.. ఇలా వందలమంది సెలెబ్రిటీల చిత్రాలు వేసి స్వయంగా అందించాడు. కాన్వాసుపై వేసే ఒక్కో వర్ణచిత్రానికి ఒక్కోసారి వారాలు పడితే.. మరోసారి నెలలు తీసుకుంటా అంటున్నాడు వెంకటేష్. ఆ చిత్రం అనుకున్న విధంగా వచ్చేదాకా, జీవం ఉట్టిపడేదాకా రాజీ పడనంటాడు. వ్యక్తుల చిత్తరువులే కాదు.. ఒక పెద్ద వృత్తాంతాన్ని, చరిత్రను, సంఘటన సారాంశాన్ని చెప్పేలా పెయింటింగ్స్ వేయడంలోనూ తను దిట్ట. అలాంటివి కొన్ని వందలు గీశాడు. అందులో కొన్ని.
ఉనికికి ప్రమాదం: నింగీ, నేలా, నీరు.. ఈ మూడు చోట్లా ఉండే ప్రాణులు గద్ద, పులి, వేల్. ఇవి అంతరించిపోయే జీవుల జాబితాలో ఉన్నాయి. అత్యంత కీలకమైన ఈ ప్రాణుల ఉనికే ప్రశ్నార్థకం కావడం అంటే.. మానవాళి మనగడకు ప్రమాదం ముంచుకురానుంది అనే దానికి సంకేతం అంటాడు వెంకటేష్. ఆ విషయాన్ని తెలియజేస్తూ, మనుషుల్ని హెచ్చరిస్తూ.. ఆ సారాంశాన్నంతా ఒకే చిత్రంలో చూపించాడు.
పర్యావరణం: పేరాశతో, అనాలోచిత నిర్ణయాలతో.. మనిషి ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడని పర్యావరణ వేత్తలు ఎన్నో ఏళ్లుగా గగ్గోలు పెడుతూనే ఉన్నారు. పర్యావరణానికి గడ్డుకాలం దాపురించినప్పుడు సీతాకోకచిలకలు ఈ భూమిని వదిలి వెళ్లాలని ప్రయత్నిస్తుంటాయట. దీన్నే ‘బటర్‌ఫ్లై ఎఫెక్ట్’ అంటారు. దాన్ని ప్రతిబింబించేలా పెయింటింగ్ వేశాడు. అందులో గుంపులకొద్దీ సీతాకోకచిలకలు ఒక కొత్త గ్రహానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటాయి. పంచభూతాలకు ప్రతీకలైన ఐదు వేళ్లు భూగోళాన్ని పరిరక్షిస్తూ ఆ గుంపును ఆపడానికి ప్రయత్నించినా.. అవి ప్రయాణాన్ని ఆపవు. దీన్నంతటినీ ఒక పెద్ద కన్ను దీనంగా గమనిస్తూ ఉంటుంది.
గాంధీ బాట: మరో పెయింటింగ్‌లో గాంధీ ప్రవచించిన సిద్ధాంతాలు.. ఆయన జీవితం.. ఆచరించిన బాట.. స్వాతంత్రోద్యమ ఘట్టాలు.. చివరికి ఆయన నాథూరాం గాడ్సే చేతిలో మరణించడం.. ఈ ఘట్టాలన్నింటితో ఓ చిత్రాన్ని గాంధీజీ 150వ జన్మదినం సందర్భంగా ఆయనకు నివాళిగా వేశాడు.
చరిత్ర: ఒక చిత్రంలో తెలంగాణలోని గోల్కొండ కోట, ఓరుగల్లు కోట, చార్మినార్‌లాంటి చారిత్రక కట్టడాలు.. రాణి రుద్రమదేవి జీవితం, సాయుధ పోరాట చరిత్ర, పండే పంటలు.. పారే నదులు.. ఇలా సమస్తాన్నీ చూపించాడు.
గవర్నర్ చేతుల మీదుగా: రెండు ప్రపంచ యుద్ధాలు మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా జరిగిన మొత్తం పదమూడు యుద్ధాల వివరాలు.. వాటి ద్వారా కలిగిన వినాశనం, ధరిత్రీమాత రోదన ఈ అంశాలతో 12 అడుగుల అతిపెద్ద పెయింటింగ్ వేశాడు. దీన్ని ఇటీవలే గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. ఈ పెయింటింగ్‌ని త్వరలోనే నాలుగు దేశాల్లోనూ ప్రదర్శిస్తానంటున్నాడు వెంకటేష్.
* మొత్తం రామాయణాన్ని ఒక చిత్రంలో చూపించడం, ఏక కణ జీవి నుంచి రోబో రాక దాకా జీవ పరిణామ క్రమం.. స్ఫూర్తివీరుడు చేగువేరా జీవితం.. ఇలా కొన్ని వందల కాన్సెప్ట్ పెయింటింగ్స్ వేశాడు. వెంకటేష్ చిత్రకారుడే కాదు.. రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడాకారుడు కూడా. తన పెయింటింగ్స్‌ని వేలం వేసి వచ్చిన మొత్తంతో గ్రామీణ క్రీడాకారులకు ఒక స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేయడమే తన లక్ష్యం అంటున్నాడు.
ప్రపంచ రికార్డుకి చేరువలో..
సచిన్ తెందుల్కర్‌పై అభిమానంతో ఆరేళ్ల కిందటే ఒక వర్ణచిత్రం వేశాడు. దానిపై స్వయంగా సచిన్‌తో సంతకం చేయించి.. తర్వాత కోహ్లి, గంగూలీ, ధోనీ, గేల్, ద్రావిడ్, పాంటింగ్... లాంటి దిగ్గజాలు సహా వందమంది వరకు అంతర్జాతీయ క్రికెటర్ల చేవ్రాలు చేయించాడు. మరో యాభై మంది సినీ, రాజకీయ ప్రముఖులూ సంతకం చేశారు. ‘ఇది ఇప్పటికే ప్రపంచరికార్డు. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నా. ఆయన సంతకం కాగానే అధికారికంగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’కి పంపిస్తా’ అంటున్నాడు వెంకటేష్. కుంచెతో జీవకళ ఉట్టిపడేలా తను రూపొందిస్తున్న చిత్రాలను చూసి అచ్చెరువొందినవాళ్లు ఎంతోమంది. ఈ ప్రతిభకు పురస్కారాలు, ప్రశంసలు చాలానే దక్కాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TET Results: 27న టెట్ ఫలితాలు.. ఎన్నిగంటలకంటే?
-
PM Modi: అక్టోబర్ 1, 3 తేదీల్లో తెలంగాణలో మోదీ పర్యటన
-
IND vs AUS: షమి, శార్దూల్ ఇంటికి.. ఆసీస్‌తో మూడో వన్డేకు టీమ్ఇండియాలో 13 మందే
-
CM Kcr: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత
-
Social Look: శ్రీనిధి సెల్ఫీలు.. శ్రుతి హాసన్ హొయలు.. నుపుర్ ప్రమోషన్!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు