నలుగురూ నడవని బాటలో విజయం!

నలుగురు వెళ్లే దారిలో నడిస్తే.. ఫాలోవర్లుగా మిగిలిపోతాం. మనమే ఓ దారి సృష్టిస్తే మార్గదర్శకులుగా నిలుస్తాం. ఏ రంగానికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది.

Updated : 10 Jun 2023 03:35 IST

నలుగురు వెళ్లే దారిలో నడిస్తే.. ఫాలోవర్లుగా మిగిలిపోతాం. మనమే ఓ దారి సృష్టిస్తే మార్గదర్శకులుగా నిలుస్తాం. ఏ రంగానికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. అలా ఎంచుకుంది వ్యాపారమైనా.. వినూత్నంగా ముందుకు సాగుతూ ట్రెండ్‌సెట్టర్లుగా మారారీ యువతరంగాలు. విజయాల బాటలో సాగుతున్న వారి స్ఫూర్తిదాయక పయనం ఇది.


 అమెరికా నుంచి పర్యావరణ దారిలో

 ప్లాస్టిక్‌ మానవాళికి ప్రధాన శత్రువు. 140 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో దాని వాడకం ఇంకెంత ప్రతికూల ప్రభావం చూపిస్తుంది? ఇదే ఆలోచన శనగాల మహేంద్రరెడ్డిని కొత్త దారి పట్టించింది.

మహేంద్రది ప్రకాశం జిల్లా బొడ్డవారిపాలెం. డేటాసైన్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసి, అమెరికాలో ఆరేళ్లుగా ఓ సైబర్‌ సెక్యూరిటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. కొలువు జీవితం హాయిగా సాగిపోతున్న సమయంలో.. ఒకసారి ఆఫీసులో కంపోస్టబుల్‌ స్ట్రా చూడటంతో ఆలోచనలో పడిపోయాడు. వాటిని ఎందుకలా తయారు చేశారు? అనే సందేహానికి పర్యావరణ హితం కోసం అనే సమాధానం వచ్చింది. అదే సమయంలో జర్మనీలో మొక్కజొన్న నుంచి పర్యావరణహిత సంచులు తయారు చేసే ప్రక్రియ గురించి తెలిసింది. జనాభా తక్కువ ఉన్న దేశాలే ప్రకృతి కోసం అంతలా పరితపిస్తుంటే.. భారత్‌లో ఇలాంటి ఉత్పత్తులు ఎందుకు తీసుకురాకూడదు అనుకున్నాడు. ఆ ప్రయత్నం తానే మొదలు పెట్టాడు. కొన్నాళ్లు పరిశోధన చేశాక మార్చి 28, 2019న ‘ఈట్లరీ’ పేరుతో స్టార్టప్‌ ప్రారంభించాడు.

మొదటగా ప్లాస్టిక్‌ సంచులకు ప్రత్యామ్నాయంగా.. మొక్కజొన్నతో తయారుచేసిన సంచుల ఉత్పత్తి ప్రారంభించాడు. తర్వాత బ్రష్‌లు, ప్లేట్లు, స్పూన్‌లు, స్ట్రాలు తయారు చేస్తున్నాడు. ప్రారంభంలో నెలకు 2 టన్నులు ఉత్పత్తిని చేసేవాళ్లు. ఇప్పుడు 20 టన్నులకు పెంచారు. మొదట్లో ఆశించిన ఫలితాలు రాలేదు. దాదాపు రూ.40లక్షల వరకు నష్టం వచ్చింది. ఒకానొక సమయంలో పరిశ్రమ మూసేయాలనుకున్నారు. కానీ.. సత్సంకల్పంతో ప్రారంభించిన సంస్థ ఉసురు తీయొద్దని మరింత కష్టపడ్డాడు. అదేసమయంలో  ఏపీ ప్రభుత్వం ప్లాస్టిక్‌ని నిషేధించడంతో కలిసొచ్చింది. వీళ్ల ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. నేరుగా రైతుల దగ్గరే మొక్కజొన్నలు కొనుగోలు చేయడంతో రైతులకు లాభం చేకూరుతోంది. వీటితోపాటు అరటి చెట్లతో స్పూన్‌లు, వెదురు నుంచి బ్రష్‌లు తయారు చేస్తున్నారు. ఈ ఉత్పత్తులతో రాష్ట్రవ్యాప్తంగా తరచూ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవాలయం సహా.. పలు దేవాలయాల్లో ఈ ఉత్పత్తులను వాడుతున్నారు.                
ఎస్‌.శివవరప్రసాద్‌, ఈజేఎస్‌


ప్లాస్టిక్‌ వ్యర్థాలతో టైల్స్‌

కరోనా తన ఉద్యోగాన్ని కొల్లగొడితే.. బాధ పడుతూ ఇంట్లో కూర్చోలేదు 30 ఏళ్ల జూపల్లి సాయికిరణ్‌. దాన్నో అవకాశంగా మలచుకొని, రాష్ట్రంలోనే తొలిసారిగా ప్లాస్టిక్‌ వ్యర్థాలతో టైల్స్‌ తయారీ పరిశ్రమను నెలకొల్పాడు.

సాయికిరణ్‌ది పెద్దపల్లి జిల్లా బొంతకుంటపల్లి. 2013లో బీటెక్‌ పూర్తవగానే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వచ్చింది. మంచి జీతం.. జీవితం బాగానే సాగిపోతున్నా.. ఇంకేదో చేయాలనే తపన ఉండేది. కరోనా కారణంగా మూడేళ్ల కిందట ఉద్యోగం కోల్పోయాడు. అంతకుముందే ఏదైనా కొత్త ప్రయత్నం చేయాలనుకున్న సాయికిరణ్‌ దీన్నో అవకాశంగా భావించాడు. తను చేయబోయే వ్యాపారం జనాలకు ఉపయోగపడేలా ఉండాలనుకున్నాడు. దీనికోసం స్నేహితులు, అనుభవజ్ఞుల సలహాలు తీసుకున్నాడు. అంతర్జాలంలో గాలించాడు. చివరికి పర్యావరణహిత టైల్స్‌ తయారీ పరిశ్రమ ప్రారంభించాలి అనుకున్నాడు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ) రుణం, తన దగ్గరున్న మొత్తం కలిపి రూ.40లక్షలతో ‘పాలీసాండ్‌ పేవ్‌మెంట్‌ టైల్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌’ను ప్రారంభించాడు. గృహ, పరిశ్రమలు, నగర, పురపాలికలు, పంచాయతీల్లో సేకరించిన ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ఈ టైల్స్‌ తయారు చేస్తున్నాడు. రీసైకిల్‌ చేసిన ప్లాస్టిక్‌ని ఇసుక మిశ్రమంతో కలిపి ఈ టైల్స్‌ తయారు చేస్తారు. ‘బహిరంగ విపణిలో సాధారణ సిమెంట్‌ టైల్స్‌ ఒకటి రూ.25 నుంచి రూ.50 వరకు ఉంటే.. దీని ధర రూ.35. సిమెంట్‌ టైల్స్‌ కిందపడితే పగిలిపోతుంటాయి. అదే మా ఉత్పత్తులైతే.. యాభై ఏళ్లవరకు డ్యామేజీ కావంటున్నాడు సాయికిరణ్‌. వీటిని కరీంనగర్‌లోని పలు పార్కుల్లో వేశారు. పెద్దపల్లి, సుల్తానాబాద్‌లోని కొందరు స్థిరాస్తి వ్యాపారులు తరచూ ఆర్డర్లు ఇస్తున్నారంటున్నాడు సాయికిరణ్‌. ప్లాస్టిక్‌ సేకరణతో స్థానిక సంస్థలకూ ఆదాయం సమకూరుతోంది.
మిరియాల గణేష్‌కుమార్‌,పెద్దపల్లి


విమానాలు వదిలి.. టీ, కాఫీ డెలివరీ

పైలెట్‌గా పని చేయాల్సిన యువకుడు టీ, కాఫీలు అమ్ముతానంటే అంతా వింతగా చూశారు. దాన్నే ఓ సరికొత్త వ్యాపారంగా మలచి విజయవంతంగా ముందుకెళ్తున్నాడు ప్రభాహరన్‌ వేణుగోపాల్‌. అతడి ఆలోచనను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సైతం మెచ్చుకున్నారు.

ప్రభాహరన్‌ సొంతూరు మదురై. కుటుంబంలో నగల వ్యాపారం ఉండేది. తనకేమో విమానాలంటే ఇష్టం. చదువైపోగానే పైలెట్‌ శిక్షణకు దరఖాస్తు చేస్తానంటే.. ‘ఐదేళ్లు నీకు నచ్చింది చెయ్‌. తర్వాత మన వ్యాపారం చేయాల’న్నారు ఇంట్లోవాళ్లు. సరేనన్నాడు. అమెరికా వెళ్లి మూడున్నరేళ్లు శిక్షణ తీసుకున్నాడు. ట్రైనీ పైలెట్‌గా చేశాడు. యూఎస్‌, భారత పైలెట్‌ లైసెన్సులు వచ్చేసరికే ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈలోపు ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ కంపెనీ నుంచి ఆఫర్‌ వచ్చినా ఇంట్లోవాళ్లకిచ్చిన మాటతో దాన్ని వదులుకున్నాడు.

ప్రభాహరన్‌ నగల వ్యాపారం బాగానే సాగుతుండేది. దుకాణానికొచ్చే వారికి టీ, కాఫీలు తీసుకొచ్చేందుకు షాపులో పని చేసేవాళ్లు మాటిమాటికీ బయటికి వెళ్తుండేవాళ్లు. అవి రుచిగా ఉండేవి కావు. కొన్నిసార్లు చల్లారిపోయేవి. రోజూ ఇదో పెద్ద సమస్యలా ఉండేది. బాగా ఆలోచించాక మంచి నాణ్యమైన, వేడి వేడి టీ, కాఫీలు అందించే పానీయాల వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నాడు ప్రభాహరన్‌. అది వినగానే తెలిసినవాళ్లంతా నోరెళ్లబెట్టారు. అయినా అప్పటికే అతడి మస్తిష్కంలో పక్కా ప్రణాళిక సిద్ధమైంది.

2020లో ‘కప్‌టైమ్‌’ పేరుతో స్టార్టప్‌ తెరిచాడు. మసాలా టీ, ఫిల్టర్‌ కాఫీల తయారీకి అవసరమైన సరకులన్నీ రైతులనుంచే నేరుగా కొనుగోలు చేస్తున్నాడు. పేద, మధ్యతరగతి యువతకు డెలివరీ బాయ్‌లుగా అవకాశమిచ్చాడు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా ఆర్డర్లు తీసుకోవడం.. ఫ్లాస్కులకు ట్యాగింగ్‌, క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా డెలివరీ చేసే విధానం ఏర్పాటు చేశాడు. టీ, కాఫీ తయారీ మాస్టర్లు మారినా రుచి, నాణ్యత మారకుండా ప్రత్యేక మెథడాలజీ తీసుకొచ్చాడు. మొదట్లో రోజుకి పది కప్పులతో మొదలైన వ్యాపారం ఇప్పుడు 10వేల కప్పులు డెలివరీ చేసే స్థాయికి చేరింది. ప్రస్తుతం కప్‌టైమ్‌కి పరిశ్రమలు, దుకాణాలు, ఆసుపత్రులు, ఐటీ కంపెనీలు, విద్యాసంస్థలు ఇలా 700పైగా సంస్థలు కస్టమర్లు. టీ, కాఫీలు కోరిన చోటికే తెచ్చి ఇవ్వడంతో పలు సంస్థల్లో గణనీయంగా సమయం ఆదా అవుతోంది అంటున్నాడు ప్రభాహరన్‌. ఈ తరహా స్టార్టప్‌ మొదటిది కావడం, మంచి ఫలితాలు వస్తుండటంతో.. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ వీళ్లని ప్రత్యేకంగా అభినందించారు. తమిళనాడులో టాప్‌-25 స్టార్టప్‌లలో ‘కప్‌టైమ్‌’ను చేర్చి రూ.10లక్షల ఆర్థిక సాయం అందించారు.
హిదాయతుల్లాహ్‌.బి, చెన్నై


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని