కళ.. భళా!

కళ ఏమేం చేస్తుంది? ఆకలి తీర్చుతుంది.. అందలం ఎక్కిస్తుంది. అందరు శెభాష్‌ అని మెచ్చుకునేలా చేస్తుంది.. అవార్డులూ సాధించి పెడుతుంది.

Updated : 30 Sep 2023 07:06 IST

కళ ఏమేం చేస్తుంది? ఆకలి తీర్చుతుంది.. అందలం ఎక్కిస్తుంది. అందరు శెభాష్‌ అని మెచ్చుకునేలా చేస్తుంది.. అవార్డులూ సాధించి పెడుతుంది. అన్నింటికీ మించి అంతులేని ఆనందాన్ని ఇస్తుంది...ఈ ముగ్గురు యువ తరంగాలూ కళతో అలాంటి మన్ననలు అందుకుంటున్న కళాకారులే!


ఇంటర్‌ ఫెయిల్‌.. రూ.27లక్షల జీతం

ఇంటర్‌ ఫెయిలైన కుర్రాడు నెలకు లక్షల్లో వేతనం అందుకునే స్థాయికి ఎదుగుతాడని ఎవరైనా ఊహిస్తారా? జాతీయస్థాయి అవార్డులు సాధిస్తాడని అనుకుంటారా? గంజి రాఘవేంద్ర తనకిష్టమైన కళతో అదే చేసి చూపించాడు.

ల్గొండ జిల్లా గట్టుప్పల్‌ యువకుడు రాఘవేంద్రకి బొమ్మలేయడం అంటే ఇష్టం. చిన్నప్పుడైతే స్కూల్‌ డుమ్మా కొట్టి మరీ చిత్రాలు వేసేవాడు. ఎప్పుడూ అతడి చేతిలో ఖాళీ కాగితం, పెన్సిల్‌ ఉండాల్సిందే. ఈ అతి చూసి కొడుకు పిచ్చివాడు అవుతాడేమోనని బాధ పడేవారు కన్నవాళ్లు. ఇంటర్‌ ఫెయిలవడంతో వాళ్ల ఆందోళన రెట్టింపైంది. పనిలో పడితే మార్పు వస్తుందనే ఉద్దేశంతో సొంత రైసుమిల్లులో బాధ్యతలు అప్పజెప్పారు. స్నేహితులేమో పై చదువులకు వెళ్లడం.. తనమో రైసుమిల్లులో మగ్గిపోవడం తట్టుకోలేక పోయాడు. మూడేళ్లు అక్కడే పని చేశాక తనకున్న కళతోనే ఎదిగే మార్గాలు అన్వేషించాడు. ఫైన్‌ఆర్ట్స్‌తో డిగ్రీ పూర్తి చేయొచ్చని తెలిసింది. ముందు కష్టపడి ఇంటర్‌ పాసై, ఆపై.. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఫైన్‌ఆర్ట్స్‌ పట్టా అందుకున్నాడు. దాంతో ప్రముఖ గేమింగ్‌ సంస్థలో 3డీ ఆర్టిస్టుగా ఉద్యోగం వచ్చింది. పదేళ్లలో అంచెలంచెలుగా ఎదుగుతూ.. ప్రస్తుతం హెచ్‌సీఎల్‌ కంపెనీలో సీనియర్‌ టెక్నికల్‌ లీడ్‌గా ఏడాదికి రూ.27 లక్షల వేతనం అందుకుంటున్నాడు. చిత్రకళ ఒక్కటే కాకుండా.. నేచర్‌ ఫొటోగ్రఫీ, చారిత్రక దేవాలయాల చిత్రీకరణ, ట్రావెలింగ్‌ డాక్యుమెంటరీలు తీయడం రాఘవేంద్ర హాబీ. చేనేత కళపై రూపొందించిన ‘వీవర్స్‌ ఆఫ్‌ ఇండియా’ అనే డాక్యుమెంటరీని జాతీయ చేనేత దినోత్సవాన దిల్లీలో ప్రదర్శించారు. ఉద్యోగంలో భాగంగా ‘జులాయి’, ‘ఎవడు’, ‘శ్రీరామరాజ్యం’ సినిమాలకు గ్రాఫిక్స్‌, 3డీ ఎఫెక్ట్స్‌ విభాగాల్లోనూ పని చేశాడు. రాఘవేంద్ర ప్రతిభకు గుర్తింపుగా చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీ పురస్కారం, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయ 75 సంవత్సరాల వేడుకల సందర్భంగా నిర్వహిచిన రాష్ట్రస్థాయి చిత్ర కళా పోటీల్లో బహుమతి, జపాన్‌ ఇంటర్నేషనల్‌ చిత్ర కళా పోటీల్లో బహుమానం అందుకున్నాడు. కోనసీమ చిత్రకళా పరిషత్‌ పోటీల్లో వరుసగా మూడేళ్లు విజేతగా నిలిచాడు.

అద్దంకి గోవర్ధన్‌, ఈనాడు పాత్రికేయ పాఠశాల


సాఫ్ట్‌వేర్‌ రచయిత..

రజనీకాంత్‌ ‘జైలర్‌’లోని జుజుబీ.. దినకంత్రీ కన్నయ్య పాట ఇంకా కుర్రకారు ఫోన్లలో మోగుతూనే ఉంది. ‘తిరు’లోని నామదీ.. పూవదీ.. ఎప్పుడో యువత మొబైల్‌ఫోన్లలో రింగ్‌టోన్‌గా మారింది. ఇవేకాదు.. అగ్ర హీరోల మెచ్చుకోళ్లు.. ప్రధాని మోదీ ప్రశంసలు అతని సొంతం. మదిని తాకేలా రాసే శ్రీనివాస్‌ మౌళి కళే.. అతడ్ని ఇక్కడిదాకా తీసుకొచ్చింది.

మెరికాలో ఉద్యోగం.. లక్షల్లో జీతం. ఎవరు వదులుకుంటారు? శ్రీనివాస్‌ వదులుకున్నాడు. పాటలు రాయాలనే అమితమైన ఇష్టంతో. అయితే ఇండియా తిరిగి రాగానే అవకాశాలు ఎదురు రాలేదు. సరైన బ్రేక్‌ రావడానికి దాదాపు ఏడెనిమిదేళ్లు పట్టింది. ఇప్పుడు తన పాటకి అగ్ర హీరోలు ఆడిపాడుతున్నారు. ప్రతి సాంగ్‌కి కోట్లలో వ్యూస్‌. కరోనా సమయంలో రాసిన ‘వీ గొన్నా ఫైట్‌ కరోనా..’ అనే పాటకు చిరంజీవి, నాగార్జున, కోటి అభినయించారు. బాగుందని మోదీ ట్వీట్‌ చేశారు. శ్రీనివాస్‌ సొంతూరు కృష్ణాజిల్లా నూజివీడు. అమ్మానాన్నలు తెలుగు ఉపాధ్యాయులు కావడంతో సహజంగానే తెలుగుపై మమకారం మొదలైంది. సరదాగా పేరడీలు, పాటలు రాసుకునేవాడు. అందులో కొన్ని ఈనాడు పత్రికలో ప్రచురితం అయ్యాయి. అవి చూసి స్నేహితులు ‘సినిమాల్లోకి వెళ్లు’ అని ప్రోత్సహించారు. మొదట్లో సీరియస్‌గా తీసుకోలేదు. ఈలోగా ఎంసీఏ పూర్తై, ఐటీ ఉద్యోగం వచ్చింది. బెంగళూరులో కొలువు చేస్తూనే సినిమాలకి ప్రయత్నించేవాడు. అలా తొలిసారి 2012లో ‘చిన్న సినిమా’ అనే చిత్రంలో అవకాశం దక్కింది. తర్వాత ‘రిప్రైజ్‌’ అనే ఆల్బమ్‌లో రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్‌లతో కలిసి ఓ పాట రాశాడు. ఆపై ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లాడు. అక్కడా అడపాదడపా ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ రాస్తుండేవాడు. శ్రీనివాస్‌ రాసిన ఓ పాట నచ్చి సంగీత దర్శకుడు కోటి స్వయంగా ఫోన్‌ చేశారు. ‘సినిమాల్లో ఎందుకు సీరియస్‌గా ప్రయత్నించకూడదు’ అన్నారు. దాంతో చేస్తున్న ఉద్యోగం వదిలేసి హైదరాబాద్‌ వచ్చేశాడు. ‘రాహు’లో మూడు పాటలు రాశాడు. అందులో ‘ఏమో ఏమో ఏమో’ అనే మెలోడీ గీతం మంచి పేరు తీసు కొచ్చింది. అది చూసే సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌ టీం నుంచి కబురొచ్చింది. తమిళ ‘కేఆర్‌కే’ చిత్ర తెలుగు అనువాదంలో 4 పాటలు రాశాడు. అవి నచ్చడంతో ‘తిరు’కి ఛాన్స్‌ ఇచ్చారు. అందులో చిన్నచిన్న పదాలతో సాగే ‘నా మది.. పూవది’ పెద్ద హిట్‌ అయ్యింది. చిన్నపదాలతో లయబద్ధంగా బాగా రాశావని చంద్రబోస్‌, భాస్కరభట్ల మెచ్చుకున్నారు. తర్వాత ‘జైలర్‌’ కోసం మాస్‌ కంటెంట్‌ ఉన్న లైన్లు కావాలన్నారు. ఆ రకంగా ‘దినకంత్రి కన్నయ్య..’ ఊపిరి పోసుకుంది. ఈ ఊపుతో శ్రీనివాస్‌ మరింతగా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం తన చేతిలో ఏడు సినిమాలున్నాయి. ఇప్పటివరకు 35 చిత్రాలకు పని చేశాడు. ఈ విజయం వెనక కష్టమూ ఉంది. 2019లో ఉద్యోగం మానేసి వచ్చిన కొన్నాళ్లకే కరోనా విరుచుకుపడింది. సినిమాల్లేక, జీతం రాక ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాడు. బతుకు బండి నడవడానికి మళ్లీ కొలువులో చేరి పాటల సేద్యం చేస్తున్నాడు. తన ప్రతిభకు గుర్తింపుగా సైమా అవార్డుకి నామినేట్‌ అయ్యాడు. సామాజికాంశాలపై రాసిన గీతాలకు మయూరి ఆర్ట్స్‌ విశ్వసంస్కృతి నంది పురస్కారం అవార్డు దక్కింది.

భూపతి సత్యనారాయణ, ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట


త్రీడీ మాయలతో..

ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు ఊహించుకోవడాన్ని హెల్యూజినేషన్‌ అంటారు అని ఓ సినిమాలో సరదాగా అంటాడు బ్రహ్మానందం. తన చిత్రాలతో అలాంటి మాయలే చేస్తున్నాడు పెద్దపల్లి జిల్లా మంథని యువకుడు సింగారపు శివరామకృష్ణ. త్రీడీ కళతో పలు అవార్డులు కొల్లగొట్టడమే కాదు.. అమెరికాలో జరిగే స్టేట్‌ ఫెస్టివల్‌కి ఆహ్వానం అందుకున్నాడు.

శివ నడిరోడ్డుపై ఒక బొమ్మ వేస్తే.. అక్కడ నిజంగానే ఓ పేద్ద బావి ఉన్న అనుభూతి కలుగుతుంది. ఓ కుర్రాడు ఓ భవంతి మెట్లపై కూర్చొని ఉన్న చిత్రం అది నిజం కాదని చెబితేగానీ నమ్మలేం. ఇలాంటి మాయలెన్నో చేశాడు. బొమ్మలతో కనికట్టు చేసే ఇలాంటి కళాకారులు దేశంలో అతికొద్దిమందే ఉన్నారు. చిత్రలేఖనంపై ఉన్న ఆసక్తే తనని సృజనాత్మక కళాకారుడిగా మార్చింది. మొదట్లో పుస్తకాలు, తెలుగు వార, మాస పత్రికలకు కార్టూన్లు వేసేవాడు. ఈ క్రమంలో త్రీడీ గురించి తెలిసింది. అంతర్జాలంలో నేర్చుకొని సొంతంగా సాధన చేశాడు. తర్వాత తను వేసిన చిత్రాల్ని ‘ఫెనమై’ అనే ఆంగ్ల మ్యాగజైన్‌ నాలుగేళ్లపాటు ప్రచురించింది. హరియాణా త్రీడీ చిత్రకారుడు ముఖేష్‌ సూచనతో నేలపై పెద్ద త్రీడీ చిత్రాలు వేయడం ప్రారంభించాడు.

అలా తన ప్రతిభనంతా రంగరించి వేసిన త్రీడీ కళాఖండాలు జనం ప్రశంసలతోపాటు.. పలు అవార్డులూ గెల్చుకున్నాయి. ఈమధ్యే అమెరికాలోని మిన్నెపొలిస్‌లో నిర్వహించిన స్ట్రీట్‌ ఆర్ట్‌ ఫెస్టివల్‌కి వెళ్లి, అక్కడా సత్తా చాటాడు. అతడి ప్రతిభకి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, యూనిక్‌ వరల్డ్‌ రికార్డులలో స్థానం సంపాదించాడు. ఔత్సాహికులకు ఉపయోగపడేలా దేశంలోనే తొలిసారి త్రీడీ ఆర్ట్‌పై పుస్తకాన్ని రాశాడు శివ. ప్రస్తుతం మంథని జేఎన్టీయూలో సహాయ ఆచార్యునిగా పని చేస్తున్నాడు.

మిరియాల గణేష్‌కుమార్‌,ఈనాడు, పెద్దపల్లి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని