హార్వర్డ్‌ మెచ్చిన తెలుగు తేజం

మనం ఔనన్నా.. కాదన్నా భవిష్యత్తులో మానవాళిపై అత్యంత ప్రభావం చూపనుంది కృత్రిమ మేధస్సు. ఈ సాంకేతికతను అందిపుచ్చుకొని అందరికన్నా ముందుండాలని తొందరపడుతున్నాయి అన్ని దేశాలూ, కొన్ని సాంకేతిక సంస్థలు.

Updated : 04 May 2024 03:36 IST

ప్రతిష్ఠాత్మక హార్వర్డ్‌ విశ్వ విద్యాలయం.. ప్రఖ్యాత మసాచ్యుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) కలిసి నిర్వహించేదే ఏఐ రెసిడెంట్‌ ప్రోగ్రాం. మానవ భవిష్యత్తు గమనాన్ని మార్చగల ఆవిష్కరణలు చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. అత్యంత ప్రతిభావంతులకు మాత్రమే ఇక్కడ ప్రవేశం. అలాంటి అరుదైన ఈ ప్రాజెక్టుకి తెలుగు యువకుడు నారిశెట్టి అక్షయ్‌ ఎంపికయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా 16 మందికే ఈ అవకాశం దక్కగా.. భారత్‌ నుంచి ఒకే ఒక్కడిగా నిలిచాడు. అతడితో ‘ఈతరం’ మాట కలిపింది.

నం ఔనన్నా.. కాదన్నా భవిష్యత్తులో మానవాళిపై అత్యంత ప్రభావం చూపనుంది కృత్రిమ మేధస్సు. ఈ సాంకేతికతను అందిపుచ్చుకొని అందరికన్నా ముందుండాలని తొందరపడుతున్నాయి అన్ని దేశాలూ, కొన్ని సాంకేతిక సంస్థలు. ఈ పోటీతోనే హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం, ఎంఐటీలు ‘వేరబుల్‌ టెక్నాలజీ రెసిడెంట్‌ ప్రోగ్రామ్‌’కి తెర తీశాయి. దైనందిన జీవితంలో మనుషులు ధరించే గ్యాడ్జెట్లలో కృత్రిమ మేధస్సును జొప్పించి.. వాళ్ల ఆలోచనలు, భావోద్వేగాలను సైతం నియంత్రించగలిగేలా సాంకేతికను అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇది అమెరికాలోని ఎంఐటీ మీడియా ల్యాబ్‌, హార్వర్డ్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌లో మూడు నెలలు కొనసాగనుంది. ఎంపికైనవారు తమ మేధస్సుకు పదును పెట్టేలా పరిశోధనలు చేయాలి. వీళ్లు తయారు చేసిన వేరబుల్‌ బయో ట్రాకర్‌.. బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఇంటర్ఫేస్‌.. న్యూరల్‌ ఇంపల్సెస్‌ చిప్స్‌ని వేరబుల్‌ గ్యాడ్జెట్స్‌లో అమర్చుతారు. ఇవి కాళ్లూచేతులు, చూపు, మాట లేని వాళ్లు ధరించినా మెదడులోని ఆలోచనల్ని చదివి ఆ డేటాని అందిస్తాయి. ఈ పరిశోధనల్లో సలహాలు ఇచ్చేందుకు, సందేహాలు తీర్చేందుకు రెండు విద్యాసంస్థల్లోని సీనియర్‌ పరిశోధకులు, అధ్యాపకులు సిద్ధంగా ఉంటారు. గతంలో ఇక్కడ ప్రోగ్రామ్‌ పూర్తి చేసిన వాళ్లకు పరిశోధకులుగా అపారమైన అవకాశాలు దక్కాయి. మెటా, గూగుల్‌ డీప్‌మైండ్‌లాంటి పెద్ద కంపెనీల్లో భారీ వేతనంతో కీలక స్థాయిల్లో చేరారు. చేసిన ఆవిష్కరణల ఆధారంగా వందల కోట్ల రూపాయల పెట్టుబడులు దక్కించుకొని అంకుర సంస్థల్ని ప్రారంభించిన వాళ్లూ ఉన్నారు.


ఆసక్తి అలా..

పాతికేళ్లకే ప్రపంచ యవనికపై ప్రతిభ చూపిస్తున్న అక్షయ్‌ మొదట్లో సాదాసీదా విద్యార్థినే. పల్నాడు జిల్లా నరసరావుపేట దగ్గర్లోని రావిపాడు తన సొంతూరు. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు వాళ్ల స్కూల్‌కి ఒక ఎలక్ట్రానిక్‌ పరికరం తీసుకొచ్చి ప్రదర్శించారు. తర్వాత దాన్ని ఇంటికి తీసుకెళ్లి.. అందులోని ట్రాన్సిస్టర్లు, కెపాసిటర్లు, ఇతర పరికరాలు విప్పదీసి సొంతంగా ప్రయోగాలు చేశాడు. యూట్యూబ్‌లో వెతికి, ఆ పరికరాలతో కొన్ని ప్రాజెక్టులు తయారు చేశాడు. అలా సైన్స్‌, టెక్నాలజీపై ఆసక్తి మొదలైంది. తర్వాత చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీలో చేరడం పెద్ద టర్నింగ్‌ పాయింట్‌. అక్కడ టెక్నికల్‌ క్లబ్స్‌లో అటానమస్‌ వాహనాల గురించి తెలుసుకున్నాడు. మొదటి సెమిస్టర్‌లోనే సీ కోడింగ్‌ నేర్చుకున్నాడు. అందరి కంటే భిన్నంగా కంప్యూటర్‌లో తెరపై కాకుండా.. మైక్రో కంట్రోలర్ల ద్వారా దీన్ని రాశాడు. విద్యార్థిగా తను నేర్చుకున్న ప్రతీదీ ఆన్‌లైన్‌ విద్యాసంస్థ యూడెమీలో బోధించేవాడు. ఈ అమితాసక్తి, టెక్నాలజీపై పట్టుతోనే ఇంజినీరింగ్‌ పూర్తయ్యేసరికి గూగుల్‌, జేపీమోర్గాన్‌, భారత్‌ ఎక్స్‌ సహా ఏడు సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ దక్కించుకున్నాడు. భారత్‌ ఎక్స్‌ ఇంటర్న్‌షిప్‌లో అయితే ఏకంగా నెలకు రూ.లక్షన్నర వేతనం అందుకున్నాడు. ప్రస్తుతం ప్రతిష్ఠాత్మక ప్రోగ్రామ్‌కి ఎంపికై, దేశం దృష్టిని ఆకర్షించాడు.


ఎంపికయ్యాడిలా..

కార్యక్రమానికి ఎంపికవడం తేలికైన విషయం కాదు. ముందు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు ఎవరైనా ఈ రెసిడెన్స్‌ ప్రోగ్రామ్‌కి రికమెండ్‌ చేయాలి. తర్వాత ఔత్సాహికులు గతంలో ఏఐ రంగంలో చేసిన పరిశోధనలు, అనుభవం బేరీజు వేసి ఎంపిక చేస్తారు. అక్షయ్‌ ప్రస్తుతం ‘హ్యాకథాన్‌’ అనే ఓపెన్‌సోర్స్‌ ప్రాజెక్టులో ‘ఫ్రెండ్‌’ అనే ఏఐ రికార్డింగ్‌ పరికరం తయారీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీన్ని పెండెంట్‌లా మెడలో వేలాడదీసుకుంటే.. రోజంతా మాట్లాడింది రికార్డు చేసి, విశ్లేషించి యాప్‌ ద్వారా ఫోన్‌కి సమాచారాన్ని బదిలీ చేస్తుంది. కావాల్సిన విధంగా సంక్షిప్తంగా సారాంశం రూపంలో అందిస్తుంది. రోగులతో మాట్లాడే వైద్యులు, బోర్డు మీటింగుల్లో పాల్గొనే సీఈవోల్లాంటి వారికి ఇది చాలా ఉపయుక్తం అంటాడు అక్షయ్‌. ఈ ప్రాజెక్టులో పని చేస్తుండగానే హార్వర్డ్‌లో సీనియర్‌ పరిశోధకుడిగా ఉన్న దక్షిణకొరియాకు చెందిన యాన్పుతో అక్షయ్‌కి పరిచయమైంది. ఆయన రెఫరెన్స్‌ ద్వారానే ఈ ప్రోగ్రామ్‌కి ఎంపికయ్యాడు.


  • హార్వర్డ్‌ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా 8 వేల మంది పోటీ పడ్డారు. వాళ్లంతా కృత్రిమ మేధస్సు రంగంలో ప్రతిభ ఉన్నవాళ్లే.
  • బీటెక్‌ మొదటి ఏడాదిలోనే ఆన్‌లైన్‌లో కొన్నిరకాల కాంపొనెంట్స్‌ కొనుగోలు చేసి.. వాటికి ఆర్డినో, సెన్సర్లు కలిపి సొంతంగా మొబైల్‌ఫోన్‌ తయారు చేశాడు.
  • అక్షయ్‌ రూబిక్‌ క్యూబ్స్‌ని పది సెకన్లలో సాల్వ్‌ చేయగలడు. ఈ అనుభవంతో సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌ రాసి రూ.నాలుగు వేలలో ఒక రోబో తయారు చేశాడు. అది ఇరవై ఎత్తుల్లో, ఐదు సెకన్లలో సాల్వ్‌ చేసేస్తుంది.
  • బీటెక్‌ పూర్తవగానే ఒక బహుళజాతి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో రూ.90లక్షల వేతనంతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు.
  • ప్రముఖ విద్యాసంస్థ జార్జియాటెక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో కంప్యూటర్‌ సైన్స్‌ మాస్టర్స్‌ చేయడానికి ప్రవేశం పొందాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని