ఆ ప్రతిభకు కష్టాలన్నీ క్లీన్‌ బౌల్డ్‌!

మాటలు రావు... వినికిడి శక్తి లేదు...రెక్కలాడిస్తేనే ఆ పూట కడుపు నిండే కుటుంబం... అయితే ఏంటట? కష్టాలపై యార్కర్లు విసిరారు... సిక్సర్లు బాదారు... అంతులేని ప్రతిభతో బధిరుల క్రికెట్‌లో మేటి ఆటగాళ్లుగా  ఎదిగారు... ఆ స్ఫూర్తి వీరులే చల్లగాలి రఘు, సిలువేరు వేణులు.

Published : 18 May 2024 01:43 IST

మాటలు రావు... వినికిడి శక్తి లేదు...రెక్కలాడిస్తేనే ఆ పూట కడుపు నిండే కుటుంబం... అయితే ఏంటట? కష్టాలపై యార్కర్లు విసిరారు... సిక్సర్లు బాదారు... అంతులేని ప్రతిభతో బధిరుల క్రికెట్‌లో మేటి ఆటగాళ్లుగా  ఎదిగారు... ఆ స్ఫూర్తి వీరులే చల్లగాలి రఘు, సిలువేరు వేణులు.

చేయి విరిగినా.. వెరవకుండా

‘అరేయ్‌ బె..బె..బ్బె.. నువ్వూ క్రికెట్‌ ఆడతావా... నిన్నెవడ్రా ఆటలో చేర్చుకునేది’ అంటూ బంధువులు, స్నేహితులు ఎన్నోసార్లు కించపరిచారు. అయినా డీలా పడిపోకుండా, పట్టుదలగా ఆడి ఐసీడీఏ దివ్యాంగుల క్రికెట్‌ మ్యాచ్‌ల్లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు కెప్టెన్‌ అయ్యాడు చల్లగాలి రఘు. పల్నాడు జిల్లా యడ్లపాడుకు చెందిన రఘుకి పుట్టుకతోనే వినికిడి సమస్య. మాటలు కూడా రావు. తండ్రి లారీ డ్రైవరు. ఎలాగోలా కష్టపడి ఆయన కొడుకుని పాఠశాలలో చేర్పించినా.. అక్కడ తోటి విద్యార్థులు హేళన చేసేవారు. దీంతో ఆ పక్కనే ఉన్న మైదానంలోకి వెళ్లి కూర్చునేవాడు. అక్కడ క్రికెట్‌ ఆడుతున్నవాళ్లని చూసి, ఇష్టంతో తనూ ఉదయాన్నే వెళ్లి సాధన చేసేవాడు. అతడి ఆసక్తి గమనించిన డ్రిల్‌ మాస్టారు సబ్‌స్టిట్యూట్‌గా స్కూల్‌ జట్టులోకి తీసుకున్నారు. ఓసారి మ్యాచ్‌లో ప్రధాన బౌలర్‌కి గాయమవగా అతడి స్థానంలో ఆడించారు. ఆ సమయంలో ఓడిపోయే మ్యాచ్‌ని తన ప్రతిభతో గెలిపించాడు రఘు. దీంతో అతడిపై నమ్మకంతో తర్వాత ప్రతి మ్యాచ్‌లో కొనసాగించారు. క్రమం తప్పకుండా సత్తా చాటుతుండటంతో రాష్ట్రస్థాయి బధిరుల జట్టుకి ఎంపికయ్యాడు. ఇతర రాష్ట్రాల్లో జరిగే మ్యాచ్‌లకు వెళ్లడానికి సైతం డబ్బులు లేకపోవడంతో.. విజయవాడలోని ఓ వస్త్ర దుకాణంలో క్యాషియర్‌గా చేరాడు. పార్ట్‌ టైం ఉద్యోగం చేస్తూనే తెల్లవారుజామున సాధన చేసేవాడు. మరోవైపు డిగ్రీ కూడా పూర్తి చేశాడు. స్థానిక మ్యాచ్‌లలో గెల్చుకున్న పారితోషికాలు దాచుకొని తెలంగాణలో జరిగిన బధిరుల క్రికెట్‌ పోటీలకు వెళ్లాడు. అక్కడ బౌలింగ్‌లో మెరుపు ప్రదర్శన ఇవ్వడంతో నిర్వాహకులు ఆంధ్రా తరఫున ప్రత్యేక రంజీ పోటీలకు ఎంపిక చేశారు. అలా 2017లో 22 ఏళ్లకే రాష్ట్ర జట్టుకి ఎంపికవడమే కాదు.. కెప్టెన్‌ కూడా అయ్యాడు. నాలుగేళ్లలో వివిధ రాష్ట్రాల్లో 21 మ్యాచ్‌లు ఆడి ఐదుసార్లు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. తాజాగా జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఐసీడీఏ టీ-20 మ్యాచ్‌లో ఏపీ తరఫున బౌలింగ్‌లో నాలుగోవర్లు వేసి రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. 2017లో అనంతపురంలో జరిగిన ఏపీ టీ-20 ఛాంపియన్‌షిప్‌ ఫర్‌ డెఫ్‌ క్రికెట్‌ పోటీల్లో ఫీల్డింగ్‌ చేస్తూ.. కిందపడటంతో రఘుకి కుడి చేయి విరిగింది. నాలుగు నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినా, నెలకే కోలుకొని మళ్లీ జట్టులోకి వెళ్లాడు. రఘు ఇప్పటివరకు 20 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించి 13 మ్యాచ్‌ల్ని విజయపథంలో నిలిపాడు. 


కిట్‌ కూడా కొనలేని స్థితి నుంచి..

‘మీ అబ్బాయికి వినపడదు.. మాట్లాడలేడు.. అతడికి పాఠాలు చెప్పడం మావల్ల కాదు’ చిన్నప్పుడు సిలివేరు వేణుని అతడి తండ్రి స్థానిక పాఠశాలలో చేర్పించడానికి వెళ్తే ఉపాధ్యాయులు అన్న మాటలవి. తనది పల్నాడు జిల్లా చిలకలూరి పేట. స్కూల్లో చేర్చుకోవడానికి నిరాకరించడంతో ట్యూషన్‌ చెప్పే ఓ మాస్టారి దగ్గర ఏడోతరగతి వరకు చదువు నేర్చుకున్నాడు వేణు. వాళ్ల అమ్మానాన్నలది చిన్న టిఫిన్‌ సెంటర్‌. ఆదాయం ఏ మూలకూ సరిపోకపోవడంతో తనని టైలరింగ్‌ షాపులో చేర్పించారు. ఆ పక్కన గ్రౌండ్‌లో తోటి స్నేహితులంతా క్రికెట్‌ ఆడేవారు. వాళ్లు ఎడాపెడా బౌండరీలు బాదడం, టపటపా వికెట్లు తీస్తుండటాన్ని దూరం నుంచి చూసిన వేణు ‘నేనూ ఆడతా’నని చాలాసార్లు అడిగాడు. వేళాకోళాలు, సూటిపోటి మాటలే అతడికి మిగిలేవి. ఇలా కాదనుకొని తెల్లవారే నిద్రలేచి ఒక్కడే ప్రాక్టీసు చేసేవాడు. చివరికి అతడి అమితాసక్తిని గ్రహించిన ఆ బృందం.. జట్టులో ఎవరైనా రాకపోతే అవకాశం ఇచ్చేవారు. అలా ఓసారి చక్కటి ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేశాడు. దీంతో 2017లో జిల్లాస్థాయి జట్టుకి ఎంపికై, సత్తా చాటాడు. 2018లో ఇండియన్‌ డెఫ్‌ అసోసియేషన్‌ (ఐడీసీఏ)లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. ఐడీసీఏ నేషనల్‌ క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫర్‌ డెఫ్‌ పోటీల్లో 79 బంతుల్లో 53 పరుగులు చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. తర్వాత ప్రతి అవకాశాన్నీ ఒడిసిపట్టుకుంటూ వన్డే, టీ-20 మ్యాచ్‌ల్లోనూ ప్రతిభ చూపించాడు. ఇప్పటివరకు 60 మ్యాచ్‌లు ఆడి.. 21 సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఇంత ప్రతిభ చూపిస్తున్నా వేణుది అరకొర ఆదాయమే. మొదట్లో కనీసం క్రికెట్‌ కిట్‌ కూడా కొనుక్కోలేని పరిస్థితి. టైలరింగ్‌ చేస్తే వచ్చిన డబ్బులతోనే మ్యాచ్‌లకు వెళ్లేవాడు. మ్యాచ్‌ ఫీజు, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గెలిచినప్పుడు వచ్చే పారితోషికం.. ఇంట్లో ఖర్చులకు ఇచ్చేవాడు. 2023లో దుబాయిలో టీ-20 మ్యాచ్‌లు ఆడే అవకాశం వచ్చినా.. ప్రయాణ ఖర్చులు భరించలేక విరమించుకున్నాడు. గల్లీ క్రికెట్‌ నుంచి జాతీయ జట్టుదాకా ఎదిగిన వేణు.. భారత్‌ తరఫున కచ్చితంగా ప్రపంచకప్‌ సాధిస్తానంటున్నాడు.

- వేల్పూరి వీరగంగాధరశర్మ, ఈనాడు డిజిటల్‌ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు