కేన్స్‌లో.. చిదానందం

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌...ఈ ప్రతిష్ఠాత్మక వేడుకకి ఆహ్వానం అందితేనే గొప్ప...మరి అక్కడ తన చిత్రం ప్రదర్శితమైతే.. వేలమందితో పోటీ పడి అవార్డు గెల్చుకుంటే..? ఆకాశం అందినట్టే! ఇ

Updated : 25 May 2024 06:44 IST

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌...ఈ ప్రతిష్ఠాత్మక వేడుకకి ఆహ్వానం అందితేనే గొప్ప...మరి అక్కడ తన చిత్రం ప్రదర్శితమైతే.. వేలమందితో పోటీ పడి అవార్డు గెల్చుకుంటే..? ఆకాశం అందినట్టే! ఇప్పుడలాగే మబ్బుల్లో తేలిపోతున్నాడు చిదానంద్‌ ఎస్‌ నాయక్‌. తను దర్శకత్వం వహించిన ‘సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ది ఫస్ట్‌ వన్స్‌ టు నో’ ఉత్తమ షార్ట్‌ఫిల్మ్‌గా ఎంపికైంది మరి!

ప్రపంచం నలుమూలల నుంచి 2,623 ఎంట్రీలు. అనేక వడపోతల్లో ఆఖరికి మిగిలింది 17. వాటిలో నుంచి విజేతగా నిలవడం అంటే మాటలా? మైసూరుకు చెందిన చిదానంద్‌ ఆ ఘనత సాధించి చూపాడు. తనకి చిన్నప్పట్నుంచీ చాలామందిలా తెర కలలేం లేవు. తరగతులు బంక్‌ కొట్టి సినిమాలకు వెళ్లిన దాఖలాలూ లేవు. అతడు మెరిట్‌ విద్యార్థి. మైసూర్‌ మెడికల్‌ కాలేజీ నుంచి వైద్య విద్య కూడా పూర్తి చేశాడు. అయితే చిన్నప్పట్నుంచి బామ్మ, ఇతర పెద్దలు చెప్పే కథల్ని చెవులు రిక్కించి వినే వాడు. కథల పుస్తకాల్ని ఆసక్తిగా చదివేవాడు. అలా తనకు తెలియకుండానే తనలో కథలు వినడం, రాయడంపై ఆసక్తి మొదలైంది. కాలేజీ రోజుల్లో ఆ ప్రతిభ బయటికొచ్చింది. ఆ ఆసక్తి, ఆలోచనలకు రూపం ఇస్తూ చిన్నచిన్న కథలు అల్లేవాడు. బాగుండటంతో మిత్రులు సినిమాలవైపు వెళ్లమని సలహా ఇచ్చారు. దాంతో డాక్టరుగా ప్రాక్టీసు చేస్తూనే మిత్రులతో కలిసి ‘విస్ఫర్స్‌ అండ్‌ ఎకోస్‌’, ‘త్రిష్ణా’, ‘భూలే చుకే ట్యూల్స్‌’ అనే లఘుచిత్రాలు తీశాడు. అందులో చివరిది బాగా పేరు తీసుకొచ్చింది. దాంతో ఇక స్టెతస్కోప్‌ వదిలేసి మెగాఫోన్‌ పట్టుకోవాలనే నిర్ణయానికొచ్చాడు. 

స్టెతస్కోప్‌ వదిలి..

పూర్తిస్థాయిలో దర్శకుడు కావాలనుకున్నాక, పుణె వెళ్లి ప్రఖ్యాత ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో చేరాడు. ఆదూర్‌ గోపాలకృష్ణన్, షబానా ఆజ్మీ, నసీరుద్దీన్‌ షా లాంటి ఎందరో గొప్ప సినీ వ్యక్తులను అందించిన సంస్థ అది. ప్రాజెక్టులో భాగంగా మిత్రులు మనోజ్, సూరజ్‌ ఠాకూర్‌లతో కలిసి ‘సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ది ఫస్ట్‌ వన్స్‌ టు నో’కి తెర రూపం ఇచ్చాడు. ‘నా కోడిపుంజే జనాల్ని నిద్రలేకపోతే ఈ ప్రపంచానికి తెల్లవారదు’ అనే సామెత కన్నడలో బాగా పాపులర్‌. ఒక మారుమూల గ్రామంలో ఇలా అనుకునే ఒక కుటుంబానికి చెందిన కోడిపుంజును దొంగిలించి, ప్రపంచాన్ని శాశ్వతంగా అంధకారం చేయాలనుకుంటుంది ఒక ముసలమ్మ. దొంగిలించిన ఆ కోడి పుంజు కోసం ఊరంతా ఎంత గాబరా పడిందీ, ఎంతగా వెతికిందీ.. ఇందులో చూపించాడు. ఉన్న కొద్ది పాత్రలతోనే పలికించిన భావోద్వేగాలు, కథ నడిపించిన విధానం గొప్పగా ఉందని పాశ్చాత్య మీడియా సంస్థలు చిదానంద్‌ని పొగుడుతూ కథనాలు వెలువరించాయి. షూటింగ్‌ చేసింది నాలుగు రోజులే అయినా.. నెలలకొద్దీ కష్టపడి స్క్రిప్టు రాసుకున్నాడు. లొకేషన్‌ కోసం దాదాపు అరవై గ్రామాలు వెతికాడు. ఆఖరికి కనీస సౌకర్యాలు కూడా లేని ఒక పల్లెను ఎంచుకున్నాడు. పదహారు నిమిషాల షార్ట్‌ఫిల్మ్‌లో ప్రతి సన్నివేశాన్నీ హృద్యంగా మలిచాడు. ప్రపంచ వేదికపై విజేతగా నిలిచి, రూ.14లక్షల నగదు బహుమతి గెల్చుకున్నాడు. ఈ ప్రతిభ అప్పుడే ఒక కన్నడ సినిమాకి దర్శకుడిగా అవకాశం కూడా తెచ్చి పెట్టింది. ‘తెరపై కదిలే బొమ్మలు.. మనసుల్నీ కదిలించాలి. భావోద్వేగాలను తట్టిలేపాలి. దాని కోసం మనిషి మూలాల్ని మరవొద్దు. అలా చేసినప్పుడే నా వృత్తికి సార్థకత. ప్రతి సినిమాలో ఈ నియమం పాటిస్తా’ అంటున్నాడు చిదానంద్‌ విజయానందంతో.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని