సైకతం.. సందేశం

పక్షుల దినోత్సవం.. ధరిత్రీ దినోత్సవం.. ఓటరు దినోత్సవం.. ప్రభుత్వ కార్యక్రమం.. ప్రజలకు ఉపయోగపడే పండగ.. ఇలా సందర్భం ఏదైనా తన సైకత కళతో సమాజాన్ని చైతన్యం చేసే పనిలో తలమునకలై ఉన్నాడు సనత్‌ కుమార్‌.

Published : 15 Jun 2024 00:29 IST

పక్షుల దినోత్సవం.. ధరిత్రీ దినోత్సవం.. ఓటరు దినోత్సవం.. ప్రభుత్వ కార్యక్రమం.. ప్రజలకు ఉపయోగపడే పండగ.. ఇలా సందర్భం ఏదైనా తన సైకత కళతో సమాజాన్ని చైతన్యం చేసే పనిలో తలమునకలై ఉన్నాడు సనత్‌ కుమార్‌. పన్నెండేళ్ల నుంచి 300 పైగా ఇసుక విగ్రహాలను సృష్టించి, ఈ అరుదైన కళతో ఔరా! అనిపిస్తున్నాడు. 

సనత్‌ది తిరుపతి జిల్లాలోని ఏరూరు. తన ఇంటికి ఆరు కిలోమీటర్ల దూరంలోనే సముద్రం. దాంతో రోజూ మిత్రులతో కలిసి బీచ్‌కి వెళ్లి, ఇసుక తిన్నెలమీద ఆడుకునేవాడు. అందరూ చిన్న చిన్న పిచ్చుకగూళ్లు కడుతుంటే తను మాత్రం పెద్దపెద్ద నమూనాలు నిర్మించేవాడు. మధ్యలో చదువుల కోసం వేరే ఊరు వెళ్లొచ్చినా ఇసుకపై మమకారం తగ్గలేదు. తిరిగొచ్చాక ‘చిన్నప్పుడు అందరికంటే బాగా గూళ్లు కట్టేవాడివి కదా.. ఇప్పుడు ఆ ప్రతిభను బయటికి తీసి చూపించు’ అని చెల్లి ఓరోజు సరదాగా సవాల్‌ చేసింది. అసలే పక్కన అమ్మాయిలున్నారు. పరువు పోకూడదనుకొని ఎలాంటి సాధన లేకుండానే తదేక దీక్షతో ఓ భారీ సైకత శిల్పాన్ని ప్రారంభించాడు. అన్ని పనులూ పక్కన పెట్టేసి, కొన్ని గంటల్లోనే అనుకున్నది చేసి చూపించాడు. అది చూసి మెచ్చుకున్న సన్నిహితులు ‘నీ కళను సమాజానికి ఉపయోగపడేలా మలచు’ అని వెన్ను తట్టారు. అప్పటినుంచి మానవాళి, ప్రకృతికి ఉపయోగపడే సందర్భాలు, పండగలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో జనాన్ని చైతన్యం చేసేలా ఇసుక శిల్పాలు నిర్మిస్తున్నాడు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన సందర్భంలోనూ ఒక భారీ సైకత శిల్పాన్ని తయారు చేశాడు. కృష్ణా నది తీరాన ప్రకాశం బ్యారేజీ వద్ద పదిమంది విద్యార్థులు, 300 మంది కూలీలతో వారం రోజులు శ్రమించి 1,300 టన్నుల ఇసుకతో 52 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో అమరశిల్పి సైకత శిల్పాన్ని నిర్మించాడు. ఆపై 200మంది గురుకుల విద్యార్థులకు శిక్షణనిచ్చి మైపాడు బీచ్‌లో 1,186 సైకత జాతీయ జెండాలు తయారు చేయించి ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించాడు. పోలీసు సేవలు ప్రజలకు వివరిస్తూ 2018లో పోలీసు దినోత్సవం రోజున తక్కువ సమయంలో సైకత శిల్పాలు రూపొందించి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకున్నాడు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు, మానవుడి చెర కారణంగా కొన్ని పక్షి జాతులు మరణిస్తున్నాయనే విషయాన్ని తెలియజెప్పేలా దొరవారిసత్రం అనే ప్రాంతంలో భారీ సైకత శిల్పాన్ని ప్రదర్శించాడు. కరోనా సమయంలో పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది, పాత్రికేయుల సేవల్ని కొనియాడేలా 15 సైకత శిల్పాలు చేశాడు. తాజాగా మీడియా దిగ్గజం రామోజీరావు కన్నుమూసినప్పుడు ఆయనకు నివాళిగా అప్పటికప్పుడే ఐదు టన్నుల ఇసుకతో నాలుగు అడుగుల ఎత్తైన ఇసుక విగ్రహాన్ని మలిచాడు. ప్రస్తుతం ఒక పాఠశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వర్తిస్తూనే తనకిష్టమైన ప్రవృత్తిని కొనసాగిస్తున్నాడు. ఏదైనా చిత్రాన్ని వేయాలనుకున్నప్పుడు ఉదయం మూడు గంటలకే పని ప్రారంభిస్తాడు. సొంత ఆసక్తితో ఈ కళపై పట్టు సాధించిన సనత్‌.. పదిమంది శిష్యుల్ని సైతం తయారు చేసుకున్నాడు. వందకుపైగా పాఠశాలలు తిరిగి, ఈ అరుదైన కళ ప్రాధాన్యాన్ని భావితరాలకు వివరించాడు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన సనత్‌.. జాతీయ, అంతర్జాతీయ సైకత పోటీల్లో దేశం తరఫున పాల్గొనాలన్నదే తన ఆశయమంటున్నాడు.

పిల్లనగోయిన రాజు, తిరుపతి  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని