భీమ్స్‌... బీట్స్‌ 

నిలువనీడ లేక వర్షంలో తడుస్తున్నా... జడవలేదు. ఎవరో తిని వదిలేసిన అన్నమే ఆకలి తీర్చినా... వెనకడుగు వేయలేదు. ..

Published : 13 Oct 2018 15:47 IST

చీకటి బాటలో... వెలుగు పాట

నిలువనీడ లేక వర్షంలో తడుస్తున్నా... జడవలేదు. 
ఎవరో తిని వదిలేసిన అన్నమే ఆకలి తీర్చినా... వెనకడుగు వేయలేదు. 
టికెట్‌కు డబ్బుల్లేక మరుగుదొడ్లో దాక్కొని రైల్లో వచ్చినా... ప్రయాణం ఆపలేదు. 
ఎన్ని కష్టాలొచ్చినా... పాటలు రాసి, పాడి, స్వరరచన చేయాలనే లక్ష్యం వదలుకోలేదు. 

భీమ్స్‌... బీట్స్‌ 

‘వొయ్యారి బ్లాక్‌ బెర్రీ ఫోనువే..’ అంటూ ట్రాక్టర్లలో మోగిన, ‘డియ్యో డియ్యో డిసక్కు డిసక్కు..’ అంటూ హోటళ్లు హోరెత్తించిన పాటలు ఆయనవే. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి మాస్‌ పల్స్‌ తెలిసిన సంగీత దర్శకుడిగా గుర్తింపు సంపాదించిన భీమ్స్‌ సిసిరోలియో గురించే ఇదంతా.. తనలో పాట ఉందనే ధైర్యంతో హైదరాబాద్‌కొచ్చి.. సినిమా పాటల రచయితగా పడరానిపాట్లుపడి.. ఆ తర్వాత సంగీత దర్శకుడిగా ఉర్రూతలూగిస్తున్న భీమ్స్‌ ‘ఈతరం’తో తన ప్రయాణాన్ని పంచుకున్నారు.

‘‘ఇంటర్మీడియేట్‌ ఫెయిల్‌ అయినపుడు ‘వన్స్‌మోర్‌ ప్లీజ్‌‘ అనే ఓ ఛానల్‌ ప్రోగ్రామ్‌కి హైదరాబాద్‌ వచ్చాను. అక్కడ అందరూ జానపదాలు పాడితే నేను రాసుకున్న పాటలనే పాడి వినిపించాను. అక్కడ ఒకాయన ‘సినిమాల్లో ప్రయత్నించు‘ అన్నాడు. ఆలోచించాను. కవితలు, నేను రాసుకున్న పాటల పుస్తకాన్ని తీసుకుని ఖమ్మం నుంచి హైదరాబాద్‌ రైలెక్కాను. దర్శకుడు తేజ ఆఫీసు చుట్టూ తిరిగేవాణ్ణి. అది అమీరుపేటలోని ఆఫీసు.. ఆ రోజు ఒకటే వర్షం. కవర్లో ఉంచిన పాటల పుస్తకాన్ని చేతిలో ఉంచుకుని వానకు వణుకుతున్నాను. ఇంతలో కారొచ్చి ఆగింది. ‘ఎవరు నువ్వ‘ని కారులోని సూర్యనారాయణరాజు అనే సహాయ దర్శకుడు అడిగారు. ‘పాటల రచయిత‘ను సార్‌ అన్నాను అమాయకంగా. కారులో కూర్చోమన్నారు. ‘ఏం పాటలు రాశావ్‌‘ అని అడిగితే.. ఓ ఇరవై పాటలు పాడాను. ఆయనకు ఓ నాలుగు నచ్చాయి. దీంతో వెంటనే జి. నాగేశ్వర్‌రెడ్డిగారికి ఫోన్‌ చేశారు. ఆయన దగ్గరికి వెళ్లగానే పాడిన రెండు పాటలు విని ‘శెభాష్‌‘ అన్నారు. ఆ తర్వాత ఎన్‌.శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఆయుధం‘ చిత్రంలో ‘ఒయ్‌ రాజు కన్నుల్లో నువ్వే..‘ పాటను తీసుకున్నారు. ఈ పాట రాయటానికి స్ఫూర్తి అంతా వందేమాతరం శ్రీనివాస్‌గారిదే. ఆయన స్టూడియోలో కూర్చోబెట్టుకొని సినిమాకు పాట ఎలా రాయాలో నేర్పించారు. ఈ సమయంలోనే సహాయ రచయితగా పని చేస్తున్న సంపత్‌ నందిగారితో నాకు పరిచయమైంది.

వదిలేసిన అన్నమే పరమాన్నం : రూమ్‌ బాడుగ కట్టలేక రోడ్ల పక్కనే పడుకున్నా. అన్నపూర్ణ స్టూడియో ముందర వాటర్‌ లీక్‌ అవుతున్నచోట ముఖం కడుక్కుని. బట్టలను అక్కడే పిండుకుని పిచ్చి మొక్కలపై ఆరేసుకుని సినిమా ఆఫీసుల చుట్టూ విపరీతంగా తిరిగాక మళ్లీ వచ్చి ఆరిన దుస్తులు తీసుకుని కేబీఆర్‌ పార్క్‌ దగ్గర ఉండే ఓ బస్టాప్‌లో పడుకునేవాణ్ణి.  తెల్లావారు జామున నాలుగున్నర సమయంలో.. ఓ ముసలావిడ రగ్గు ఉంటే ఇవ్వమని అడిగింది. నా దగ్గర లేక చేతులు ముడుచుకుని పడుకున్నా. ఆమెకు సాయం చేయలేక ఏడ్చేశాను. చాలాసార్లు నీళ్లు  తాగి పడుకున్నా. ఒకతను వందరూపాయలు ఇస్తానంటే.. పదిసార్లు కాల్‌ చేస్తే ఫోనులో ఉన్న పదిరూపాయలు అయిపోయేవి. వస్తాననేవాడు, వచ్చేవాడు కాదు. ఓ సారి తిరిగి తిరిగి యూసఫ్‌గూడలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో వాచ్‌మెన్‌ తిని వదిలేసిన అన్నాన్ని పరమాన్నంగా తిన్నా. అదృష్టం కొద్దీ.. ఓ సినిమా ఆఫీసులో ఆఫీస్‌బాయ్‌తో కలిసి ఉండేవాణ్ని.  అతనికి వచ్చిన యాభై రూపాయల బేటాతో రాత్రి భోజనం చేసేవాళ్లం.

గత్యంతరం లేక... మాది ఖమ్మం జిల్లా గార్ల బయ్యారం. మా నాన్న ఏడోతరగతి వరకే చదివారు. ఆయనకి పెద్దబాలశిక్ష చదవటం అలవాటు. అందులో ఆయనకు నచ్చిన సిసిరో, గెలీలియోలపై ప్రేమతో భీమ్‌ సిసిరోలియో అనే పేరు సూచించారంతే. ఇది బావుందని కొనసాగిస్తున్నా. మా తల్లిదండ్రులు ఇంటర్‌ తర్వాత ఉద్యోగం చూసుకోవాలని ఆశపడేవారు. చదువుకుంటూ, పాటలు రాయటానికి వెళ్తున్నా అనుకునేవారు. కొడుకు, శ్రావణమాసం, సీమటపాకాయ్‌.. ఇలా ఏడేళ్లలో ఐదారు పాటలే రాశాను. కాలేజీకి వెళ్లటం, సినిమాలకోసం తిరగటం. మబ్బుకునికేప్పుడు సైకిల్‌ తీసుకుని వేరే ఊరెళ్లి అక్కడ మిత్రుడి ఇంట్లో సైకిలు పెట్టి. అక్కడ నుంచి ఆటో.. ఆ తర్వాత రైలు ఎక్కి సికింద్రాబాద్‌ వచ్చి.. బస్సులో ఫిల్మ్‌నగర్‌ చేరుకొనేవాడిని. ఎక్కడైనా అవకాశాలున్నాయా అని వెతుక్కునేవాణ్ణి. టీసీలకు దొరక్కుండా బాత్రూమ్‌లో దాక్కోవటం, హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు టికెట్‌ తీసుకోకుండా వెళ్లటం, టోకెన్‌ తీసుకోకుండా భోజనం చేయటం... ఇలాంటివి ఎన్నో అనుభవాలున్నాయి.

భీమ్స్‌... బీట్స్‌ 

డిగ్రీ అయిపోయాక... 2007లో ‘ఏమైందీ ఈవేళ‘ చిత్రంలో నాకు సంగీత దర్శకుడిగా అవకాశం వచ్చింది. చివరి నిమిషంలో ఈ అవకాశం చేజారిపోయింది. అదే సమయంలో ఎడ్‌సెట్‌ రాశాను. రాజమండ్రిలో సీటొచ్చింది. సంగీత దర్శకుడిగా అవకాశం పోయిందని డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఎలాగూ సీటొచ్చింది.. రాజమండ్రిలోని గోదారిలో పడి చచ్చిపోదామనుకునే నిర్ణయం తీసుకున్నా. అయిష్టంగా కాలేజీకి వెళ్లా.. అడ్డుకట్టలేని గోదారిలాగా అక్కడి విద్యార్థులు ఆనందంగా ఉన్నారు. ఇంత జీవితం పెట్టుకుని ఇలా ఎందుకనుకున్నాననిపించింది. అలా రోజూ కాలేజీకి వెళ్తుంటే ఆనందం రెట్టింపయ్యింది. బాలు అనే ఓ కుర్రోడు అన్నానికి డబ్బుల్లేకుంటే తన షాపులోని అరటిపండ్లు తెచ్చిచ్చేవాడు.

ఆయన ఇచ్చిన స్ఫూర్తితో..  బీఈడీ తర్వాత మళ్లీ మనసు హైదరాబాద్‌పై పడింది. సహరచయితగా పెద్ద సినిమాలకు పని చేశా. ఆ అనుభవంతో కాస్త రాటుదేలాను. నా పాటలు నచ్చి.. ‘నువ్వా నేనా’ చిత్రానికి రాయమన్నారు. నాలుగు పాటల తర్వాత ట్యూన్స్‌ ఎలాగూ నువ్వే చేశావు. సంగీత దర్శకుడూ నువ్వేనన్నారు. ఆ చిత్రంలో ‘వొయ్యారి బ్లాక్‌ బెర్రీ ఫోనులే..‘ పాట      సూపర్‌ హిట్‌ అయ్యింది.

ఆ తర్వాత ‘కెవ్వుకేక‘ లో ‘బాబూ ఓ రాంబాబు..‘ అనే పాట రాశా. అది సూపర్‌ హిట్‌. ఆ సినిమాకి సంగీతం నేనే చేశా. ఆ తర్వాత ‘జోరు‘,  ‘గాలిపటం’ , ‘అలా ఎలా’ చిత్రాలకు సంగీతం అందించా. రవితేజ హీరోగా నటించిన ‘బెంగాల్‌ టైగర్‌’కి సంగీత దర్శకత్వం వహించా. అందులోని చూపులతో దీపాల.. పాటకు గామా అవార్డు వచ్చింది. రవితేజ శుభాకాంక్షలు చెప్పారు.  ‘మనం ఫలానా సినిమా చేశాం... అని చెప్పుకోకూడదు. మన పని ఇలా చెప్పాలి. నీకు భవిష్యత్తులో మరింత పేరొస్తుంద’ని నాలో స్ఫూర్తిని రగిల్చారాయన.

‘బెంగాల్‌ టైగర్‌‘ లాంటి హిట్‌ తర్వాతా నాకెలాంటి అవకాశాలు రాలేదు. ఆ తర్వాత ‘నక్షత్రం‘ కోసం కృష్ణవంశీగారిని కలిశా. మ్యూజిక్‌తో పాటు రీరికార్డింగ్‌ నాకే ఇచ్చారాయన. ఆ తర్వాత ‘గరుడవేగ చిత్రానికి మ్యూజిక్‌ చేస్తే.. అందులోని ‘డియ్యో డియ్యో..’ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. ఏంజెల్‌ తర్వాత పేపర్‌బాయ్‌ సినిమా చేశా. ఇటీవల వచ్చిన ఈ సినిమాలో ‘బొంబాయి పోతవా రాజా..’ పాట ప్రేక్షకులను మెప్పించింది. అయినా పెద్దగా అవకాశాలేం నన్ను ముంచేయలేదు. వచ్చే నెల గడిస్తే చాలనే మైండ్‌సెట్‌ నాది. మా ఊరెళ్లి వ్యవసాయం చేసుకోవడమంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటికైనా అదే చేస్తా.

- రాళ్లపల్లి రాజావలి, 
ఫొటో: వసంత్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని