ఇది స్టైలిష్‌ సేవరా!

అప్పుడు అతని వయసు ఏడేళ్లు.. పేదరికం తననో స్కూల్‌ డ్రాప్‌ అవుట్‌ని చేసింది.. ఇప్పుడు తన వయసు మూడు పదులు.. నమ్ముకున్న క్షౌర వృత్తి ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్‌ని చేసింది.. దీంట్లో కొత్తేముందీ? అనేగా.. తనొక్క సెలబ్రిటీల హెయిర్‌ స్టైలిస్ట్‌ మాత్రమే కాదు.. అనాథలకీ ప్రత్యేక స్టైలిస్ట్‌..

Published : 01 Feb 2020 01:23 IST

అప్పుడు అతని వయసు ఏడేళ్లు.. పేదరికం తననో స్కూల్‌ డ్రాప్‌ అవుట్‌ని చేసింది.. ఇప్పుడు తన వయసు మూడు పదులు.. నమ్ముకున్న క్షౌర వృత్తి ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్‌ని చేసింది.. దీంట్లో కొత్తేముందీ? అనేగా.. తనొక్క సెలబ్రిటీల హెయిర్‌ స్టైలిస్ట్‌ మాత్రమే కాదు.. అనాథలకీ ప్రత్యేక స్టైలిస్ట్‌.. వారిని మోడల్స్‌గా మలచడమే కాదు..  ర్యాంప్‌పై నడిపించి వారితో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాడు.. దశాబ్ద కాలంగా తనదైన  స్టైల్‌లో సేవా గుణాన్ని చాటుతున్నాడు వైజాగ్‌కి చెందిన చరణ్‌ కుమార్‌..
సేవ చేయాలంటే డబ్బుతో పని లేదు.. వారానికి ఓ రోజు... కొద్ది గంటల సమయం. ఇవి చాలు.. మార్పు కోసం మనదైన ప్రయత్నం చేయొచ్చు అంటున్నాడు చరణ్‌. తన వృత్తినే సేవా సాధనంగా ఎలా మలచుకున్నాడు? దాంట్లో తనకు దొరికిన కిక్‌ ఏంటి?.. అని అడిగితే తన స్టైలింగ్‌ సేవా దృక్పథాన్ని ‘ఈతరం’తో పంచుకున్నాడిలా..
మాది వైజాగ్‌. పేదరికం నన్ను స్కూల్‌కి దూరం చేసింది. ఏడేళ్లకే నాన్నతో కలిసి క్షౌర వృత్తిలోకి అడుగు పెట్టా. అది మొదలు హెయిర్‌ స్టైలింగ్‌లో మెలకువల్ని నేర్చుకున్నా. నేను సానబెట్టుకున్న స్కిల్స్‌ నన్నీ స్థితికి చేర్చాయి. నగరంలో చాలా మంది ప్రముఖులు ఇప్పుడు నా క్లైంట్స్‌. సంపాదన బాగుంది. పేరొచ్చింది. అప్పుడే ఆలోచనలు సేవా మార్గం వైపు మళ్లాయి. వారానికి ఒక రోజు నా వృత్తిలో పాటించే సెలవు దినాన్ని సేవకు మార్గంగా ఎందుకు మలుచుకోకూడదు అనుకున్నా. ప్రముఖులకే కాదు ఎవరూ లేని అనాథలకూ నేనో     స్టైలిస్ట్‌గా మారాలనుకున్నా. విశాఖ జిల్లాలో ఉండే వివిధ అనాథాశ్రమాల్లో పిల్లలకు హెయిర్‌ కటింగ్‌ చేయడం ప్రారంభించా. అందమైన హెయిర్‌ స్టైల్‌  చిన్నారుల ముఖానికి తీసుకువచ్చే అందం.. దాంతో పిల్లల్లో కలిగే ఆత్మ స్థైర్యం ఎంతో సంతృప్తి కలిగించాయి. ఆ కిక్‌ వెలకట్టలేనిది. అందుకేనేమో  12 ఏళ్లుగా నిర్విరామంగా ప్రతి మంగళవారం వృత్తి నైపుణ్యాన్ని సేవకు పెట్టుబడిగా మార్చేశా. నా నుంచి  స్ఫూర్తి పొందిన హెయిర్‌ స్టైలిస్ట్‌లు ఇప్పుడు అనేక మంది ఈ మార్గాన్ని అనుసరిస్తున్నారు. ‘న్యూ ట్రెండ్జ్‌’ పేరిట విజయవాడ, గుంటూరు, హైదరాబాద్‌, ముంబైలలో స్నేహితులు అనాథ పిల్లలకు హెయిర్‌ కట్‌ చేస్తున్నారు. కేవలం స్టైలింగ్‌ మాత్రమే కాదు. ఆరోగ్య స్పృహను సైతం పెంపొందిస్తారు. వ్యక్తిగత పరిశుభ్రతపై బాలబాలికల్లో అవగాహన కల్పిస్తున్నారు. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్‌ జీవితాల్లోని ప్రత్యేక సందర్భాల్ని అనాథ, వృద్ధాశ్రమాల్లో జరుపుకోవాలని కోరతా. వారి జీవితంలో మరిచిపోలేని విధంగా ఉండే రీతిలో ఆయా ఫంక్షన్స్‌ని నిర్వహిస్తా. దీంతో ఎవరూ లేరు అనుకున్న చిన్నారులు, వృద్ధులు మాకు ఎన్నో కుటుంబాలు అండగా ఉన్నాయని ధైర్యంగా జీవిస్తుంటారు. ఇక నా పండగలన్నీ వారితోనే.

ర్యాంప్‌పై నడిపించాడు..
‘న్యూ ట్రెండ్జ్‌’ బృందం సేవలు అందించే చిన్నారుల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన వారు ఉంటారు. మానసిక, శారీరక సవాళ్ల మధ్య జీవితంతో పోరాటం చేస్తున్న పిల్లల్లో అందమైన కోణాన్ని చరణ్‌ ఆవిష్కరించాడు. 2018లో విశాఖలోని ‘చిల్డ్రన్‌ థియేటర్‌’ లో జరిగిన ‘న్యూ ట్రెండ్జ్‌ ఫ్యాషన్‌ వాక్‌’ ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది. హైదరాబాద్‌, ముంబై నుంచి వచ్చిన మేకప్‌ ఆర్టిస్ట్‌లు, హెయిర్‌ స్టైలిస్ట్‌ల సహకారంతో పదుల సంఖ్యలో ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల్ని అందాల ప్రదర్శనకు సిద్ధం చేశాడు. ర్యాంప్‌పై పిల్లలు సంరక్షకుల సహకారంతో, వీల్‌ ఛైర్లలో.. ఫ్యాషన్‌ షోకి వచ్చిన వారిని పలకరించారు. ఆ క్షణాలు ప్రతి ఒక్కరిలో ఓ ప్రత్యేక అనుభూతి, భావోద్వేగాన్ని కలిగించాయి.

సేవకు గుర్తింపు...
చరణ్‌ వినూత్న మార్గంలో చేస్తున్న సేవ.. అందిస్తున్న స్ఫూర్తికి గుర్తింపుగా అనేక అవార్డులు వచ్చాయి. రాష్టీయ్ర గౌరవ్‌ సమ్మాన్‌  అవార్డు-2019 అందుకున్నారు. ‘స్మార్ట్‌ ఇండియన్‌ జాతీయ అవార్డు’ సహా విశాఖలో ఎంతో గుర్తింపు ఉన్న చైతన్య స్రవంతి సంస్థ అందించే ఉత్తమ సామాజిక కార్యకర్త అవార్డు సహా అనేక అవార్డులను చరణ్‌ దక్కించుకున్నారు.

- కె.అనిల్‌ బాబు
ఈటీవీ, విశాఖపట్నం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని